సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక్క కాంగ్రెస్ సీటు గులాబీ ఖాతాలోకి చేరుతోంది. పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒ క్క ఆసిఫాబాద్‌లోనే కాంగ్రెస్ అభ్యర్థి అత్రం స క్కు గెలుపొందగా, మూడు నెలల స్వల్పకాలంలోనే ఆయన కూడా కారెక్కుతున్నట్లు ప్రకటిం చారు. దీంతో టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి జిల్లాలో విజయం సంపూర్ణం కాగా, ఉన్న ఒక్క సీటు కూడా పాయే అంటూ కాంగ్రెస్‌లో మాత్రం నైరాశ్యం నెలకొంది.
గులాబీ ఖిల్లా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గులాబీ ఖిల్లా కానుంది. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి, అధికారం చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తొమ్మిదింటిలో అధికార టీఆర్‌ఎస్ గెలుపొందగా, ఆసిఫాబాద్ ఒక్క నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధించి పార్టీ ఉనికిని కాపాడారు. కాని మారిన పరిస్థితుల్లో ఆత్రం సక్కు కూడా కారెక్కుతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గులాబీ ఖిల్లాగా మారిపోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనులు చేయడం కష్టంగా మారుతుండడం, అధికార టీఆర్‌ఎస్ నేతల సమాంతర పరిపాలన, రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ప్రధాన అనుచరుడుగా ఉన్న ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆసక్తిగా మారింది. ఆత్రం సక్కు గెలిచిన నాటి నుంచి ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారనే ప్రచారం సాగినా, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ మారుతుండడం చర్చనీయాంశమైంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రేంసాగర్‌రావు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన రోజే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించడం, ఆ తరువాత ప్రేంసాగర్‌రావు ఏకంగా సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది
కాంగ్రెస్‌లో నైరాశ్యం
ఉమ్మడి జిల్లాలోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీని వీడి కారెక్కుతుండడంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడిపోయాయి. అధిక మెజార్టీతో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టినప్పటికీ ఉమ్మడి జిల్లాలో తమకంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే భరోసాతో ఇప్పటివరకు కాంగ్రెస్ శ్రేణులున్నాయి. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున మాత్రమే గెలుపొందడం కాకతాళీయమే అయినా ఆ పార్టీకి కనీస ప్రాతినిధ్యం ఉండింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కాని పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన సమయంలో ఉన్న ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు.
ఇంకెవరైనా..?
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరడమే మిగిలింది. నియోజకవర్గ అభివృద్ధి, గిరిజన సమస్యల పరిష్కారం కోసం తాను టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్లు ఇప్పటికే ఆయన పలుమార్లు బహిరంగ ప్రకటన చేశారు. పైగా పీసీసీ నాయకత్వంపై మండిపడ్డారు కూడా. సాంకేతిక సమస్యలు, మరికొంతమంది పార్టీ మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆత్రం సక్కు అధికారికంగా కారెక్కడంలో జాప్యమవుతున్నట్లు ఓ ప్రచారం ఉంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా కొనుగోలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఆచరణలో పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
టీఆర్‌ఎస్ తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతుండడంతోపాటు ఫిరాయింపుల అంశానికి ప్రజల్లో విస్తృత ప్రాచుర్యం కల్పించి, సానుభూతి పొందేలా వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నియోజకవర్గమైన ఆసిఫాబాద్‌లో మంగళవారం పార్టీ శ్రేణులు నిరసన తెలుపనున్నట్లు పీసీసీ ప్రకటించింది. కాని నిరసన తెలిపేందుకు స్థానిక నాయకులు పెద్దగా ఆసక్తి కనపరచకపోవడం విశేషం. ఏదేమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరనుండడంతో గులాబీ విజయయాత్ర సంపూర్ణమైంది.
Comments
Please login to add a commentAdd a comment