రేగా కాంతారావు , సండ్ర వెంకటవీరయ్య
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారికంగా గులాబీ తీర్థం ఎప్పుడు పుచ్చుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్న వారి చేరికపై ఇంకా ముహూర్తం కుదరని పరిస్థితి నెలకొంది. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొం దిన సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ పార్టీ తరఫున పినపాక నియోజకవర్గం నుంచి గెలుపొందిన రేగా కాంతారావు వారం రోజుల క్రితం తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని, కార్యకర్త లతో సంప్రదింపులు జరిపి తేదీ ఖరారు చేస్తామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతోపాటు నియోజకవర్గాల అభివృద్ధిని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని మద్దతుదారులతో సమావేశమై.. పార్టీ మారేందుకు తీసుకున్న నిర్ణయంపై ముఖ్య నాయకులకు వివరించి.. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దీంతో పినపాక నియోజకవర్గంలోనూ.. అటు సత్తుపల్లి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేల నిర్ణయానికి పార్టీ ముఖ్య నేతలు మద్దతు తెలిపారు. ఇక పార్టీలో చేరడమే తరువాయి అని.. అధికార పార్టీలో అంతర్భాగం అవుతున్నామని భావించిన ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు మాత్రం ఇంకా ఆ సమయం ఎప్పుడొస్తుందోనని వేచి చూస్తున్నారు.
వేడెక్కుతున్న రాజకీయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలతో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు నడుం బిగించాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించడమే లక్ష్యంగా.. కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతోపాటు జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను కార్యకర్తలకు వివరించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 16వ తేదీన ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ సమావేశాలకు టీఆర్‌ఎస్‌లో చేరుతామని నిర్ణయం తీసుకున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరవుతారా?లేదా? అనే అంశంపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పినపాక నియోజకవర్గం ఉండడంతో 16వ తేదీ ఉదయం మహబూబాబాద్‌లో, మధ్యాహ్నం ఖమ్మంలో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య హాజరుపై రసవత్తరమైన చర్చ జరుగుతోంది.
పార్టీలో అధికారికంగా అప్పటికీ చేరని పక్షంలో వారు నేరుగా సమావేశాల్లో పాల్గొనకుండా.. తమ మద్దతుదారులను తరలించడంపై దృష్టి సారిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి వారిని టీఆర్‌ఎస్ నేతలుగానే పార్టీ, కార్యకర్తలు భావించే అవకాశం ఉన్నందున నేరుగా సమావేశాలకు వచ్చి మద్దతు పలికే అవకాశం సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 16వ తేదీలోపు రేగా, సండ్రలు అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదని.. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక వీరి చేరికలపై ముహూర్తం ఖరారు కానున్నట్లు పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, టీడీపీలను వీడిన రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్యలను టీఆర్‌ఎస్‌లోకి అధికారికంగా ఎప్పుడు ఆహ్వానించాలనే అంశంపై పలు అంశాలు ముడిపడి ఉన్నాయని, ఇందులో కొన్ని సాంకేతిక అంశాలు సైతం ఉండడంతో వారి చేరికపై కొంత సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరూ కేటీఆర్ సభల్లో పాల్గొనే అంశం మాత్రం టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం మేరకే ఉంటుందని, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇద్దరు నేతలు పరిచయం కావడానికి వేదికయ్యే అవకాశం ఉండడంతో పార్టీ అధిష్టానం ఇందుకు సమ్మతించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment