
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో అధికార టీఆర్‌ఎస్ అక్ర మాలకు పాల్పడుతోందని దాఖలైన పిటిషన్‌లో ఓటర్ జాబితా వెలువరించకుండా ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల తుది జాబితా వివరాలు తమ ముందుంచాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. పెండింగ్‌లోని 5,517 దరఖాస్తులను ఆమోదించకుండా ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఓట్లు సృష్టించి లబ్ధి పొందాలని టీఆర్‌ఎస్ చూస్తోందని బీజేపీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూ యాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ సాగించింది. ఈసీ తరఫున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.
‘కొత్త ఓట్ల కోసం(ఫామ్–6) మొత్తం 25,013 దరఖాస్తులు వచ్చాయి. 7,247 తిరస్కరించాం. 5,517 పెండింగ్ దశలో ఉన్నాయి. 12,249 దరఖాస్తులను అనుమతించాం. అలాగే తప్పుల సవరణ (ఫామ్–8) కోసం 2,142 దరఖాస్తులు రాగా, 239 అనుమతించాం. 1,822 పెండింగ్‌లో ఉన్నాయి. 81 తిరస్కరించాం. దరఖాస్తు చేసుకున్న ఓట్ల అనుమతికి ఏడు రోజుల నోటీసు పీరియడ్ ఉంటుంది.. ఆలోగా ఎవరూ అభ్యంతరం తెలుపక పోతేనే దరఖాస్తులకు ఆమోదం లభిస్తుంది. పెండింగ్ దరఖాస్తుల్లో ఈ సాయంత్రం వరకు ఎన్ని పరిష్కారమైతే అన్ని అనుమతిస్తాం.. మిగతావి ఆగిపోతాయి. 2018లో 2,14,847, 2019లో 2,28,774, 2020లో 2,30,328, 2021లో 2,26,515, 2022లో(ఇప్పటివరకు) 2,38,759.. ఇదీ గత ఐదేళ్ల జాబితా’అని వివరించారు.
నిబంధనల ఉల్లంఘన జరిగింది..
పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదించారు. ‘రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గాల్లోనే 2 లక్షల ఓటర్లు దాటలేదు. కానీ, మునుగోడులో ఆ మార్కు దాటడంతో అవకతవకలు జరిగాయి అనడానికి బలం చేకూరుస్తోంది’అని వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. మీరు హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు కోరుకుంటున్నారు.. మునుగోడు ఉప ఎన్నిక రద్దు కావాలంటున్నారా? ఓటర్ జాబితాపై స్టే కావాలా? ఏం కోరుకుంటున్నారో చెప్పండి.. అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
హుజూరాబాద్‌లోనూ ఇదే ఈసీ పనిచేసింది.. అక్కడ ఎన్నికల సమయంలో కొత్త ఓట్ల సంఖ్య పెరిగింది.. మరీ అప్పుడు అభ్యంతరం తెలపలేదమని పిటిషనర్ అడ్వొకేట్‌ను ప్రశ్నించింది. పిటిషనర్ పార్టీ గెలిస్తే కేసులో వాదనలు ముగిస్తామని.. లేదా కొద్ది ఓట్ల తేడాతో ఓడితే విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో రచనారెడ్డి మాట్లా డుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛ గా జరగాలన్నదే తమ అభిమత మని వివరించారు. దీంతో ఓటర్ల తుది జాబితా వివరాలు వెల్లడించాలని బెంచ్ కోరింది. శుక్రవారం సాయంత్రానికి అది ఖరా రవుతుందని దేశాయ్ చెప్పడంతో... వచ్చే విచారణ నాటికి వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment