సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోరు ముమ్మరమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచి తీరడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. అభ్యర్థులు ఖరారవడం, నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చావో రేవో తేల్చుకునే క్రమంలో ఆ రెండు పార్టీలకు దీటుగా తలపడుతోంది. మరోవైపు బీఎస్పీ కూడా రంగంలోకి దిగింది. ఎప్పుడో మొదలైన ప్రచారం
ప్రస్తుతం ఊపందుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఊరూ వాడల్లో హోరెత్తుతోంది.
ఎవరూ తగ్గేదేలే..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మొదలైన ఉప ఎన్నిక పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు గెలుపే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారం టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లెంకలపల్లి గ్రామ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకుని పర్యవేక్షిస్తుండటం ఇందుకు నిదర్శనం.
అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికలో అలసత్వం వద్దని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమకు కేటాయించిన గ్రామాలు, యూనిట్‌లలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఆయన మరోసారి బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి స్వయంగా లేఖలు కూడా రాయనున్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. ఇక బీజేపీ బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ కదలికలపై నిఘా వేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు వీలున్నన్ని ఎక్కువసార్లు ఓటర్లను కలిసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ కూడా కష్టపడుతోంది. టీపీసీసీకి చెందిన ముఖ్య నాయకులందరూ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పాటు స్వతంత్రులు కూడా ప్రచారంలో మునిగి తేలుతుండగా.. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో ప్రధాన పార్టీలన్నీ సామాజిక అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment