Komatireddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలకలం | MLA Komatireddy Raj gopal Reddy Hot Topic in Telangana Politics | Sakshi
Sakshi News home page

Komatireddy Raj gopal Reddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలకలం

Published Tue, Jul 26 2022 2:27 AM | Last Updated on Tue, Jul 26 2022 8:11 AM

MLA Komatireddy Raj gopal Reddy Hot Topic in Telangana Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మూడు ప్రధాన పార్టీలు దీనిపై దృష్టి సారించాయి. హస్తం పార్టీకి రాజగోపాల్‌రెడ్డి కొరకరాని కొయ్యగా మారితే.. ఇదే అవకాశంగా ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. ఉప ఎన్నికకు వెళ్లడం ద్వారా హుజూరాబాద్, దుబ్బాక తరహాలోనే మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్‌ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుండగా.. ఉప ఎన్నిక అనివార్యమైతే వచ్చే సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడం ద్వారా కారు చెక్కు చెదరలేదని నిరూపించాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు.  

రెండు, మూడేళ్లుగా ఇదే వరస 
కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్‌రెడ్డి గడిచిన రెండు మూడేళ్లుగా పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న, పిలుపునిస్తున్న ఏ కార్యక్రమంలోనూ ఆయన పాలుపంచుకోవడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌నియమితులైన తరువాత ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ అగ్ర నాయకుల్లో ఒకరైన అమిత్‌షాతో టచ్‌లో ఉంటూ కాంగ్రెస్‌పై విమర్శలు కొనసాగిస్తున్నారు.  

తాజాగా మరోసారి.. 
మూడు నాలుగురోజుల క్రితం ఢిల్లీలో అమిత్‌ షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి, అప్పుల వ్యవహారం తదితర అంశాలతోపాటు బీజేపీలో చేరే అంశంపై కూడా చర్చించారనే వార్తలు వెలువడ్డాయి. తద్వారా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మునుగోడు నియోజకవర్గం వైపు మళ్లాయి. 

కాంగ్రెస్‌లో కలకలం 
బీజేపీలోకి వెళ్లడం ఖాయమంటూ వచ్చిన వార్తలకు సోమవారం వివరణ ఇచ్చే సమయంలో.. సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే రాష్ట్రంలో కేసీఆర్‌ను మట్టి కరిపించే సత్తా ఉంది..’ అంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన తరువాత కూడా ఆయన మాటల్లో ఏమాత్రం మార్పులేక పోవడం గమనార్హం.  

చర్యల్లేవు..ఖండనల్లేవు! 
రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడిన అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణిస్తునట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోక పోవడం, రాష్ట్ర నాయకులెవ్వరూ కనీసం రాజగోపాల్‌ వ్యాఖ్యలను ఖండించకపోవడం, ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేయకపోవడం గమనార్హం. దీనిని పార్టీ నాయకులు కొందరు తప్పుపడుతున్నారు. అదే బీసీ వర్గాలకు చెందిన నాయకులకైతే వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తారని, కానీ రాజగోపాల్‌రెడ్డిపై చర్యకు ఎందుకు వెనకాడుతున్నారని రాజ్యసభ మాజీ ఎంపీ ఒకరు ప్రశ్నించడం గమనార్హం. అయితే అధిష్టానం ఆదేశిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమని రాష్ట్ర క్రమ శిక్షణా కమిటీ నాయకులు చెప్పడం విశేషం.
 
ఉప ఎన్నిక కసరత్తు మొదలు? 
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి, ఉప ఎన్నిక అనివార్యమైతే.. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్‌ కూడా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారతారనే వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి, దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెండురోజుల కిందట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పద్మశాలీలు, గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీసీ నాయకుడు ఎవరైనా ఉంటే.. వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. 

అదే పనిలో కమలనాథులు  
ఉప ఎన్నిక జరిగితే సత్తా చాటేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. నియోజకవర్గంలో స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజాభిప్రాయం, తదితర అంశాలపై ఒక స్వతంత్ర సంస్థ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. మునుగోడు ప్రజలేమనుకుంటున్నారు, రాజ్‌గోపాల్‌రెడ్డి వైఖరిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది, అధికార టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటి? అక్కడ ప్రధానంగా ఏయే సమస్యలున్నాయి, రాజకీయ సమీకరణలు, బీజేపీకి ఏ మేరకు మొగ్గు ఉండబోతోందన్న అంశాలపై లోతైన అధ్యయనం చేయిస్తోంది. 

కారు జోరు తగ్గకుండా..  
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో పాటు జిల్లా ముఖ్యులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. మునుగోడు పరిస్థితిపై లోతుగా ఆరా తీశారు. హుజూరాబాద్‌లో పరాజయంతో ఎదుర్కొంటున్న విమర్శలకు దీటుగా జవాబివ్వాలనే యోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే క్రమంలో ఎంతో కాలంగా గట్టుప్పల్‌ మండల కేంద్రం కావాలన్న అక్కడి ప్రజల డిమాండ్‌ను నెరవేరుస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అక్కడి కాంగ్రెస్‌ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేలా పావులు కదిపారు. 

ఇతర ఉప ఎన్నికలకు భిన్నం... 
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు జరిగిన వివిధ ఉప ఎన్నికలకు ఏదో ప్రాధాన్యత ఉండగా మునుగోడు పరిస్థితి భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఎంపీగా గెలిచాక ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో హుజుర్‌నగర్‌  ఉప ఎన్నిక జరిగింది. నాగార్జునసాగర్, దుబ్బాకలలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మరణంతో, టీఆర్‌ఎస్‌ నుంచి ఈటల రాజేందర్‌ తొలగింపు, రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఇందుకు భిన్నమైన కారణాలు మునుగోడుకు ఉన్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికను కోరుకుంటున్న దాఖలాలు లేవు. అందువల్ల కేవలం రాజకీయ బలాబలాలు నిరూపించుకునేందుకు ఉప ఎన్నిక జరిగితే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement