
నిజామాబాద్ ఎంపీగా సాధించిన విజయాన్ని నియోజకవర్గ పరిధిలోని యువకులందరికీ అంకితమిస్తున్నాను. విజయాన్ని ఇందూరు ప్రజలు అందించారు. ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. యువత వేసిన పునాది మీదే విజయం సాధ్యమైంది. పార్టీ, మోదీ, నాపై అభిమానం చూపి ప్రజలు ఓట్లేసి గెలిపించారు.– విజయానంతరం మీడియాతో బీజేపీ అభ్యర్థి అర్వింద్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గులాబీ కోటలో కమలం వికసించింది. ఇందూరు పార్లమెంట్ స్థానంపై కాషాయం జెండా ఎగిరింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఇందూరు ఎంపీ నియోజకవర్గం చరిత్రలో తొలిసారిగా బీజేపీ పాగా వేసింది. సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై అర్వింద్ 70, 875 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అర్వింద్ 4,80,584 (45.22 శాతం) ఓట్లు సాధించగా, కవితకు 4,09,709 (38.55 శాతం) ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కికి కేవలం 69,240 (6.52 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయనకు డిపాజిట్ దక్కకపోవడం గమనార్హం. బీజేపీ విజయం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన విషయం విదితమే. 43 రోజుల ఉత్కంఠకు తెర దించుతూ గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలోని సీఎంసీలో జరిగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది.
రైతు అభ్యర్థులకు..
పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని, ఎర్రజొన్నకు కనీస మద్దతు ధర కల్పించాలనే తమ సమస్య దేశం దృష్టిని ఆకర్శించేందుకు పసుపు రైతులు బరిలోకి దిగిన విషయం విదితమే. మొత్తం 182 మంది అ«భ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిందరికి కలిపి 94,353 ఓట్లు వచ్చాయి.
భారీగా పోస్టల్ ఓట్లు తిరస్కరణ
ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు వేసే పోస్టల్ ఓట్లు భారీగా తిరస్కరణకు గురికావడం గమనార్హం. మొత్తం 1,560 పోస్టల్ ఓట్లకు గాను, 414 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీకి 836 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 228 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 67, ఇతరులకు 15 పోస్టల్ ఓట్లు వచ్చాయి. దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న విషయం విదితమే.
సంబురాల్లో బీజేపీ శ్రేణులు..
బీజేపీ ఘన విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగితేలారు.
మొరాయించిన ఈవీఎంలు..
ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు మొరాయించడంతో కౌంటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ఆరు ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం. అలాగే బోధన్, నిజామాబాద్ రూరల్‌లలో రెండు, మూడు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు సతాయించాయి. సాంకేతిక సిబ్బంది సరి చేయడంతో లెక్కింపు కొనసాగింది.
ఐదు అసెంబ్లీసెగ్మెంట్లలో ఆధిక్యం
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికంగా బీజేపీకి 31,588 ఓట్ల మెజారిటీ వచ్చింది. నిజామాబాద్ రూరల్‌లో 13,185 ఓట్లు, బాల్కొండలో 11,731 ఓట్లు, కోరుట్లలో 20,022 ఓట్లు, జగిత్యాలలో 7,320 ఓట్ల ఆధిక్యం సాధించింది. నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ కంటే స్వల్ప మెజారిటీ తగ్గింది. మొత్తం మీద 70 వేలపైచిలుకు మెజారిటీ దక్కింది.
రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఫలితం ఆలస్యమైంది. విజయం సాధించిన అర్వింద్ ధర్మపురికి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఆర్.ఎం.రావు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు.
డిపాజిట్ గల్లంతు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌కు డిపాజిట్ గల్లంతైంది. డిపాజిట్ దక్కాలంటే పోలైన మొత్తం ఓట్లలో 1/6వ వంతు ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ ఈ మేరకు ఓట్లు రాలేదు.
వచ్చిన ఓట్లు69,240(6.52 శాతం)
పోరాడి ఓడి..
టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పోరాడి ఓడారు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ కంటే ఆధిక్యం సాధించారు. అలాగే బోధన్ అసెంబ్లీ స్థానంలోనూ టీఆర్‌ఎస్‌కు లీడ్ వచ్చింది. మిగిలిన నియోజకవర్గాల్లో కవిత నువ్వా..నేనా.. అన్నట్లుగా పోటీ పడ్డారు.
వచ్చిన ఓట్లు4,09,709(38.55 శాతం)
అర్వింద్‌కు వచ్చిన ఓట్లు 4,80,584
(45.22 శాతం)70, 875 ఓట్ల మెజారిటీ
Comments
Please login to add a commentAdd a comment