తెలంగాణ కాషాయ సేన చీఫ్ బండి సంజయ్‌కు పార్టీలో వ్యతిరేకులు ఎలా తయారయ్యారు? పాత నేతలతో పాటు..కొత్త నాయకులు కూడా బండికి దూరంగా జరుగుతున్నారా? సొంత జిల్లా.. పక్క జిల్లా అనే తేడా లేకుండా అసమ్మతి పెంచుకుంటున్నారా? ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుని పార్టీని పరుగులు తీయించిన బండి సంజయ్ వెనుక ఏం జరుగుతోంది?
బీజేపీ తెలంగాణా రాష్ట్ర రథసారథిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక.. పార్టీ పరుగులు తీసిన తీరుతో రాష్ట్ర, జాతీయ నాయకులంతా ఆయన్ను ప్రశంసించారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నా.. తనతో పాటు పదిమంది కలిసి నడిచేలా చేయడంలో బండి సంజయ్ విఫలమవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే అంశాన్ని పార్టీలోని ముఖ్యనేతలు అధిష్ఠానం ముందు మొర పెట్టుకున్నారని.. అందరికీ కలుపుకుని పోలేకపోతున్న బండి సంజయ్ పదవిని కొనసాగించాలా? ఇంతటితో ముగించి మరొకరికి రాష్ట్ర పగ్గాలు అందించాలా అనే ఆలోచనతో హైకమాండ్ ఉందని తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేరమని ఆహ్వానించేందుకు ఈటల రాజేందర్ వెళ్ళినపుడు.. ఆ అంశం గురించి మీడియా అడిగితే.. ఆ విషయం తనకు తెలియదంటూ బండి సంజయ్ చేసిన కామెంట్..ఇద్దరి మధ్యా ఉన్న దూరాన్ని చెప్పకనే చెప్పారు. మరోవైపు తన జిల్లాకే చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డితో కూడా బండికి గతం నుంచీ పొసగదు. గుజ్జుల ఈ మధ్య బండిపై బాహాటంగానే విమర్శలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు సుగుణాకర్ రావుతోగానీ.. మరో జాతీయ నాయకుడైన మురళీధర్ రావుతోగానీ బండి సంజయ్‌కు పొసగదనే విషయం బహిరంగ రహస్యం.
చదవండి: కేటీఆర్ సార్.. మెట్రో మాక్కూడా!
అంతేకాదు.. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు ముఖ్య నేతల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావుతోనూ అంటీముట్టనట్టుండే బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీతోనూ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ తోనూ దూరం..దూరంగానే ఉంటారని టాక్. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ స్థాయిలో వ్యవహరించడం లేదని.. ఏదో ఒక జిల్లా నేతగానే ఇప్పటికీ ఆయన వ్యవహార శైలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయ్యాక.. ఆయన దూకుడు వల్లే రాష్ట్రంలో కాషాయ పార్టీ పరుగులు తీసిందని కాషాయ సేనలో అందరూ అంగీకరిస్తారు. కాని అంతా తానొక్కడే అన్నట్లుగా ఉండటం. ఎవరినీ కలుపుకునిపోకుండా వ్యవహరించడం ఆయనకు నెగిటివ్‌గా మారినట్లు సమాచారం. సీనియర్లనూ కేర్ చేయకపోవడం వంటి చాలా అంశాలు బండి సంజయ్ నాయకత్వపై నిరసనలకు కారణమవుతున్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండినే కొనసాగిస్తారా? మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ కమలం పార్టీలో ఆసక్తికరంగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment