సాక్షి, హైదరాబాద్: బీజేపీ.. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తను వేగవంతం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సహం ఉన్న వారి నుంచి పార్టీ నాయకత్వం దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 6,003 అప్లికేషన్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 40 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి ఉన్న ముఖ్య నేతల స్థానాలకు గానూ మొదటి జాబితాను అగ్ర నాయకత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.మిగతా చోట్ల అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, విజయావకాశాలు, ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశాలున్న బలమైన నేతల పేర్లు తదితర అంశాలపై పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
ఆదివారం దిల్ కుశ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నట్టు సమాచారం. చాలాచోట్ల నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను సూచిస్తూ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన జాబితాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
సంఘ్ పరివార్ నుంచి కూడా జాబితా?
ఇక సంఘ్ పరివార్ నుంచి కూడా అభ్యర్థుల ప్రతిపాదనలతో మరో జాబితా తీసుకున్నట్టు సమాచారం. ఈ జాబితాలను సరి చూసి కామన్‌గా వచ్చిన పేర్లతో ముసాయిదా జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వ పరిశీలనకు పంపించ నున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండుమూడు రోజుల్లో ఈ ముఖ్యనేతలు మరోసారి సమావేశమై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సమాలోచనలు జరపనున్నట్టు తెలిసింది. కాగా, ఈ నెల 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం పొద్దుపోయే వరకు ఈ భేటీ సాగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment