
సాక్షి,న్యూఢిల్లీ:జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ఛైర్మన్‌గా తెలంగాణ వాసి పల్లె గంగారెడ్డి(Palle Gangareddy) నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) సోమవారం(జనవరి 13) నోటిఫికేషన్ విడుదల చేసింది. పల్లె గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి. సంకక్రాంతి వేళ పసుపు రైతులకు శుభవార్త చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును నోటిఫై చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఇది చాలా గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ కేంద్రంగా మంగళవారం నుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అర్వింద్ తెలిపారు.
గతంలో పసుపుబోర్డుపై నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు నడిచాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల వరకు పసుపు బోర్డు కాకపోయినప్పటికీ స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరిగి ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. ఎట్టకేలకు 2025లో సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును కేంద్రం నోటిఫై చేసింది.