సాక్షి, సంగారెడ్డి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలకు కౌంటిరచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను డాక్టర్‌కు చూపించాలి అంటూ కామెంట్స్ చేశారు.
సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కి రైతులు గుర్తుకు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్‌కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్‌కి అవమానం జరిగింది. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ని గౌరవించలేదు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్థంతి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్‌ను కాదని యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని లెక్కచేయలేదు.
ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి అధికారం ఉంటే ఒకలా ఉంటుంది.. లేకపోతే మరోలా మాట్లాడతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment