నిజామాబాద్ : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి చాటు బిడ్డంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. బీఆర్‌ఎస్ చేసిన కృషి వల్లే నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ ప్రారంభమైందని కవిత అన్నారు.
జనవరి 16న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లతో కలిసి నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు.
పసుపు బోర్డ్ ప్రారంభ కార్యక్రమంపై ఎమ్మెల్సీ కవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం. ప్రారంభ కార్యక్రమంపై మాకు అభ్యంతరం ఉంది. పసుపు బోర్డ్ ప్రారంభోత్సవం ఒక పార్టీ కార్యక్రమంలా ఉంది. మేం స్థానిక ప్రజా ప్రతినిధులం. మాకు ఆహ్వానాలు అందలేదు. 2014 నుంచి 2018 వరకూ పసుపు బోర్డు కోసం నేను పార్లమెంట్ వేదికగా పోరాటం చేశాను. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోతే దిగుమతులు ఆపాలి. రూ. 15 వేల మద్దతు ధర పసుపు రైతులకు ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెల్పూరులో ఉన్న 40 ఎకరాల స్పైసెస్ బోర్డు స్థలంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
జక్రాన్ పల్లి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ ఎయిర్ పోర్ట్ తీసుకురావాలి. కంబోడియా మలేషియా లాంటి దేశాల నుంచి తక్కువ క్వాలిటీ ఉన్న పసుపు దిగుమతులు అవుతున్నాయి.. ఇంకా డబుల్ అయ్యింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రెండు సార్లు కలిశాను. బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుందని గతం నుంచి డిమాండ్ చేస్తున్నాను.
ధర్మపురి అరవింద్ తండ్రి చాటు కొడుకుగా ఉండే వారు. అలాంటి వ్యక్తి తన వల్లే పసుపు బోర్డు వచ్చిందనడం హాస్యాస్పదం. స్పైసెస్ రీజినల్ కార్యాలయం తీసుకొచ్చి ఆనాడు తాను అంబాసిడర్ కారు అడిగితే ప్రధాని మోదీ బెంజ్ కారు ఇచ్చారని అన్నారు. మరి ఇప్పుడు ఏం అంటారు. పసుపు బోర్డు ఒక్కటే కాదు త్రిముఖ వ్యూహం ఉండాలి’ అని కవిత సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment