ఉద్యోగాలు చేసుకునేవారికి ఎంతో మేలు
ఉచిత సేవలందిస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్న ప్రీతి
సాక్షి, సిటీబ్యూరో: ఏ ఇంట చూసినా ఇంతి పని అంతా ఇంతాకాదు. పొద్దుతో ఆమె పోటీ పడుతోంది. ఉద్యోగ జీవనంలో ఇంటిపని, వంటపనికి అదనంగా ఇప్పుడు ఆమెకు ఆఫీస్ పని తోడైంది. లివింగ్ కాస్ట్, ఇతర ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో భార్యాభర్తలు జాబ్ చేస్తేనే, అనుకున్న లైఫ్‌ను లీడ్ చేయొచ్చని చాలామంది భావిస్తున్నారు. మహిళాసాధికారత పెరిగిన తర్వాత భర్తతోపాటు భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అదనపు పని, అదనపు ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆమెకు పనిమనిషి అవసరం చాలా ఏర్పడింది. హైటెక్‌సిటీ లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో పనిమనుషులకు చాలా డిమాండ్ ఉంది. ఎంతగా అంటే ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఖాళీగా లేము అనేంతగా..! ఇలాంటి సమస్యకు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వినూత్న పరిష్కారం చూపుతున్నారు. ‘ఆస్క్ లో’పేరుతో వాట్సాప్ వేదికగా ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఇలా నలుగురికి సాయపడేందుకు ప్రయతి్నస్తున్నారు.
పనిమనుషులు, వంటవారు, డ్రైవర్లు కావాలనుకుంటే.. ‘ఆస్క్ లో’వాట్సాప్‌కు మెసేజ్ పెడితే చాలు, మీకు కావాల్సిన పని చిటికెలో అయిపోతుందని చెబుతున్నారు. మీ మెసేజ్ పనిమనుషులు, డ్రైవర్లకు వెళ్తుంది. అది కూడా వాయిస్ రూపంలో తెలుగులో ఆటోమాటిక్‌గా పంపిస్తారు. మీకు కావాల్సిన సమయంలో వాళ్లు ఖాళీగా ఉంటే తాము వస్తామని తిరిగి మెసేజ్ చేస్తారు. అయితే అప్పటివరకే కాకుండా పూర్తిస్థాయిలో కూడా ఏ టైమ్‌కు రావాలో కూడా మాట్లాడుకుని పనికుదుర్చుకోవచ్చు. ఇలా పనిమనుషులు, డ్రైవర్లకు పని దొరకడంతోపాటు అవసరం ఉన్న ఉద్యోగులకు కూడా మేలు జరుగుతోంది. రెండు పారీ్టల నడుమ మధ్యవర్తి లేకుండా నేరుగా వారే మాట్లాడుకునే వీలుంది.
మహిళలకు ఉపయోగంగా ఉంటుందని..
రాజస్థాన్‌కు చెందిన ప్రీతి 20 ఏళ్ల కింద హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 10 ఏళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. నిత్యజీవితంలో ఎదురైన అనుభవాలు ఈ స్టార్టప్ ఏర్పాటు చేసేందుకు దోహదపడ్డాయని ప్రీతి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో సామాన్యులకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని, అది ఈ వేదిక ఏర్పాటుతో నెరవేరిందని ప్రీతి చెబుతున్నారు. అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా ఈ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. పైగా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారికి అప్లికేషన్స్ వెబ్‌సైట్ వాడటం రాకపోవచ్చు. అందుకే అలాంటివారికి సులువుగా పనిదొరికే విధంగా ఈ ప్లాట్‌ఫారం ఉపయోగపడుతుందని వివరించారు.
సేవా దృక్పథంతో..
సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను అందిస్తున్నా. భవిష్యత్తులో సేవలు మరింత మందికి అందించాలని భావిస్తున్నా. ఇప్పుడు నేను నివసిస్తున్న గచ్చిబౌలి ప్రాంతంలో మాత్రమే అందిస్తున్నా. చాలామంది ఈ సేవలను మెచ్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాస్త ఇబ్బంది అయినా వారి ప్రశంసలతో ముందుకు వెళ్లాలనే ఆకాంక్ష పెరుగుతోంది. – ప్రీతి, ఆస్క్ లో, వ్యవస్థాపకురాలు
Comments
Please login to add a commentAdd a comment