![Azadi ka Amrut Mahotsav: Nation Observes 80th Anniversary Of Quit India Movement - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/8/quit-india-movement.jpg.webp?itok=LtVSjxVC)
స్వాతంత్య్రం కోసం ఇండియా ఎన్నో ఉద్యమాలు చేసింది. వాటిల్లో చివరి ఉద్యమం.. క్విట్ ఇండియా! నిజానికది ఉద్యమం కాదు. ఒక యుద్ధం. భరతజాతి అంతా ఏకమై బ్రిటిషర్‌లపై విరుచుకుపడిన మహాభారత యుద్ధం! ఆ యుద్ధంతోనే మనం స్వాతంత్య్రాన్ని గెలుచుకున్నాం. ఈ డెబ్బ ఐదేళ్లను నడిపిన ఒక స్ఫూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమం నేటితో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇండియాలో బ్రిటిష్ పాలనను తుదముట్టించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో పిలుపు నిచ్చిన ఉద్యమమే క్విట్ ఇండియా.
ఆ రోజున బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ ‘డూ ఆర్ డై’ అన్నారు. ఆ వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి ‘క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ‘ కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, ఈ నిరసనలపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్లలో చాలామంది యుద్ధం ముగిసే వరకు జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు.
మరోవైపు.. క్విట్ ఇండియాకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు)లు బ్రిటిస్ వారికి మద్దతుగా నిలిచాయి! యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. విద్యార్థులు అక్ష రాజ్యాలకు (జర్మనీ, ఇటలీ, జపాన్) మద్దతు ఇస్తూ ప్రవాసంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు.
దాంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణì వేయగలిగింది. వెంటనే స్వాతంత్య్రం ఇవ్వడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మంది. ఈ ఘర్షణలో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా, శాంతియుతంగా ఎలా నిష్కమ్రించాలనే ప్రశ్న యుద్ధానంతరం వారికి ఎదురుగా నిలిచింది. అనంత పరిణామాలు ఇండియా స్వాతంత్య్రానికి పురికొల్పాయి.
అసలు క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడానికి క్రిప్స్ మిషన్ చర్చల వైఫల్యం ప్రధాన కారణం. 1942 మార్చి 22 న బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతును పొందటానికి బ్రిటిషు ప్రభుత్వం సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను ఇండియా పంపింది. ఆయన బ్రిటిషు ప్రభుత్వపు ముసాయిదా ప్రకటనను సమావేశానికి సమర్పించారు. అందులో రాజ్యాంగ సభ ఏర్పాటు, రాష్ట్రాల హక్కుల వంటివేవో ఉన్నాయి. అయితే అవి కూడా రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తరువాత మాత్రమే. అంటే ఇప్పుడు కాదు అని. క్రిప్స్ ప్రతిపాదనపై గాంధీజీ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఇది మునిగిపోతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment