Azadi Ka Amrit Mahotsav: Mahadevi Varma Life History In Telugu - Sakshi
Sakshi News home page

Mahadevi Verma Life History: మహాత్ముడి మాటే మహాదేవి బాట

Published Fri, Jul 29 2022 10:35 AM | Last Updated on Fri, Jul 29 2022 11:25 AM

Azadi Ka Amrit Mahotsav Mahadevi Varma Story - Sakshi

మన దేశంలో స్త్రీ వాద కోణంలో ఆలోచించి రచనలు చేసిన తొలి రచయిత్రి మహాదేవి వర్మ

బ్రిటిష్‌ పాలకులను తరిమి కొట్టడానికి ఉద్యమించిన మహామహ నాయకులెందరో. వారి నాయకత్వంలో భారత జాతీయోద్యమం అనేక రూపాల్లో దారులు వేసుకుంది. రైల్‌రోకోలు, జైల్‌భరోలు, రాస్తారోకోలతో ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నవాళ్లు జాతీయోద్యమ యవనిక మీద కనిపిస్తారు. అదే సమయంలో పరోక్షంగా జాతీయోద్యమానికి బీజాలు వేసిన మహామహులూ స్మరణీయులే. అలాంటి వారిలో ముఖ్యులు మహాదేవి వర్మ. 

వలస పాలనకు వ్యతిరేకంగా మహాదేవి అక్షరోద్యమాన్ని చేపట్టారు. కుగ్రామాలకు, అడవి మధ్యలో ఉండే జనావాసాలకు వెళ్లి గ్రామీణులను, ఆదివాసీలను చైతన్యవంతం చేశారు. వారికి అక్షరాలు నేర్పించే నెపంతో గ్రామంలో నివాసం ఏర్పరుచుకున్నారు. అక్షరాలతోపాటు వారికి స్వాతంత్య్రం కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకతను  బోధించారు. గాంధీజీ సూచనల మేరకు ప్రజాజీవితంలోకి వచ్చిన మహాదేవి వర్మ జాతీయోద్యమ విస్తరణకు తన వంతు పాత్రను ప్రభావవంతంగా పోషించారు. 

అత్తగారింటికి వెళ్లలేదు!
మహాదేవి వర్మ ఉత్తరప్రదేశ్‌లోని ఫరక్కాబాద్‌లో జన్మించారు. బ్రిటిష్‌ పాలనలో ఆ ప్రాంతం యునైటెడ్‌ ప్రావిన్స్‌లో ఉండేది. మహాదేవి తండ్రి గోవింద్‌ ప్రసాద్‌ వర్మ సంస్కృత పండితులు, అలహాబాద్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఆమెకు తొమ్మిదో ఏటనే పెళ్లి చేశారు, భర్త స్వరూప్‌ నారాయణ్‌ వర్మ. ఆమె చదువు పట్ల ఆమె తాతగారు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఉండడంతో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాతనే అత్తగారింటికి పంపించాలని పెద్దలందరూ కలిసి నిర్ణయించారు. మహాదేవి వర్మ బీఏ పూర్తి చేసే నాటికి స్వరూప్‌ వర్మ చదువు కూడా పూర్తయింది.

అత్తగారింటికి పంపించడానికి సన్నాహాలు మొదలవుతున్న సమయంలో ఆమె తన ఆందోళనను బయటపెట్టారు. అందుకు తగిన కారణమే ఉంది. ఆమె జంతు ప్రేమికురాలు. మానవ వినోదం కోసం జంతువులను, పక్షులను గాయపరచడానికి, హింసించడానికి, బంధించి ఆనందించడానికి ఆమె వ్యతిరేకి. స్వరూప్‌ వర్మకు జంతువులను వేటాడడం హాబీ. అదే విషయాన్ని చెప్పి జంతువులను వేటాడి, మాంసాహారాన్ని భుజించే వ్యక్తితో జీవించలేనని తేల్చేశారామె. ఆ తరవాత బౌద్ధాన్ని స్వీకరించి పాళి, ప్రాకృత భాషలు చదివారు. ప్రయాగ విద్యాపీఠ్‌లో సంస్కృతంలో ఎం.ఏ చేయడంతోపాటు ఆ విద్యాలయానికి ప్రిన్సిపల్‌గా కూడా విధులు నిర్వర్తించారు. చిత్రలేఖనంలో కూడా మేటి ఆమె.

బ్రిటిష్‌ వారి కన్నుకప్పి..!
గాంధీజీ పరిచయంతో మహాదేవి వర్మ జీవితపంథా మారిపోయింది. ప్రజాసేవకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీని కార్యక్షేత్రంగా మలుచుకున్నారామె. ఆ పరిసర గ్రామాల్లో తాత్కాలికంగా నివాసం ఏర్పరుచుకుంటూ అక్కడి వారికి అక్షరాలు నేర్పించేవారు. ఉపాధ్యాయినిగా గ్రామీణులకు భారతీయతను బోధించడంతోపాటు భారతదేశం వలసపాలనలో మగ్గుతున్న వైనాన్ని వివరించేవారు. గ్రామీణుల, గిరిజనుల ఆలోచనలను జాతీయోద్యమం దిశగా ప్రభావితం చేసేవారు. ఒక గ్రామంలో ఎక్కువ కాలం ఉండే కొద్దీ ఆమె కార్యకలాపాల మీద బ్రిటిష్‌ పాలకుల ప్రతినిధులు నిఘా పెట్టేవారు. 

అనుమానం వచ్చిన వెంటనే ఆమె మరో గ్రామానికి తరలి పోయేవారు. అలా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, నైనితాల్‌కు పాతిక కిలోమీటర్ల దూరాన ఉమాగర్‌ గ్రామంలో కొంతకాలం స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడ కూడా అక్షరాలతోపాటు జాతీయత బీజాలను నాటారు. అక్కడ ఆమె మహిళల విద్య మీద కూడా దృష్టి పెట్టారు. మహిళల స్వయంసమృద్ధి కోసం పని చేశారు. మహిళలకు జాతీయోద్యమ స్ఫూర్తిని నూరిపోశారు. వలసపాలనలో భరతజాతికి ఎదురవుతున్న వివక్షను తెలియజెప్పారు. స్త్రీ చైతన్యవంతం అయితే ఆ ఇంటి మగవాళ్లు జాతీయోద్యమంలో ఎక్కువ కాలం కొనసాగగలుగుతారని నమ్మేవారామె. ఉమాగర్‌లో తన ఇంటికి మీరా టెంపుల్‌గా నామకరణం చేసుకున్నారు మహాదేవి వర్మ. ఆ ఇల్లు ఇప్పుడు మహాదేవి సాహిత్య మ్యూజియంగా కొనసాగుతోంది.

1932లో దేశంలో జాతీయోద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో మహాదేవి వర్మ 25 ఏళ్ల యువతి. అదే సమయంలో ఆమెకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌పై సీటు వచ్చింది. వెళ్లాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయారు. అహ్మదాబాద్‌ వెళ్లి గాంధీజీని కలిసి, ‘‘బాపూజీ.. నన్నేం చేయమంటారు?’’ అని అడిగారు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న గాంధీజీ.. ‘‘ఇక్కడ ఇంత పోరాటం జరుగుతుంటే, అక్కడికి ఎలా వెళ్తావ్‌? ఇక్కడే ఉండి నీ తోటి భారతీయుల్ని జాగృతం చెయ్యి’’ అని అన్నారు. ఆ ఒక్కమాటతో.. మహాదేవి వర్మ తనకొచ్చిన ఆక్స్‌ఫర్డ్‌ అవకా శాన్ని వదులుకున్నారు. మహాత్ముని బాటలో నడిచారు.  

మహిళల వెలుగు
మహాదేవి వర్మ హిందీ సాహిత్యంలో ఛాయావాద సాహిత్యానికి ఒక మూలస్తంభం. నిహార్, రశ్మి, నీర్‌జ, సంధ్యాగీత్‌ (కవితల సంకలనం), 18 నవలలు, అనేక కథలు రాశారు. ‘యమ’ పేరుతో చిత్రలేఖనాలు వేశారు, మనదేశంలో స్త్రీవాద కోణంలో రచనలు చేసిన తొలి రచయిత్రిగా మహాదేవి వర్మను చెప్పుకోవాలి. ఆమె ‘పయనీర్‌ ఆఫ్‌ ఫెమినిజమ్‌’.  స్త్రీ విద్య కోసం అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టారు. మహిళల పత్రిక ‘చాంద్‌’ను నిర్వహించారు.

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె అలహాబాద్‌లో బోధనావృత్తికి పరిమితమవుతూ రచనలను కొనసాగించారు. జ్ఞాన్‌పీఠ్‌, పద్మవిభూషణ్, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ  పురస్కారాలందుకున్న వర్మ 1987 అక్టోబరు 11వ తేదీన అలహాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 
– వాకా మంజులారెడ్డి 

(చదవండి: మనది కాని యుద్ధంలో  మన సైనికులు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement