ఉద్యమం అనంతరం తెనాలి వచ్చిన తమిళ రాజకీయ ప్రముఖుడు అన్నాదురైకు అమరవీరుల స్థూపాల జ్ఞాపికను బహూకరిస్తున్న ఆనాటి మున్సిపల్ ఛైర్మన్
ముంబైలో గాంధీజీ ఇచ్చిన ‘క్విట్ ఇండియా’ పిలుపును అందుకుని తెనాలిలో ప్రదర్శన కారులు తెనాలి రైల్వే స్టేషన్‌లో సృష్టించిన విధ్వంసం కొనసాగుతూ ఉండగానే.. మద్రాసు నుంచి మద్రాసు–పూరీ ప్యాసింజరు రైలు వచ్చి ప్లాట్‌ఫాంపై ఆగింది. ప్రయాణీకులు అందర్నీ దించాక నాలుగు బోగీల్లో కిరోసిన్ పోసి నిప్పంటించారు. అదే రైలులో దూరప్రయాణం చేస్తున్న యవ బ్రిటిష్ దంపతులు ఎంతకీ దిగిరాకపోవటంతో, వేచివుండి, వారు దిగాక, ఆ బోగీని కూడా తగులబెట్టారు. ఈ మంటలు రైల్వేస్టేషనుకూ వ్యాపించాయి. తర్వాత టెలిఫోన్ తీగెల్ని చిన్నాభిన్నం చేశారు.
చదవండి: స్వతంత్ర భారతి: కలర్‌లో దూరదర్శన్
తూటాలకు ఏడుగురు బలి
అక్కడ్నుంచి కొత్తపేటలోని సబ్‌ట్రెజరీ కార్యాలయానికి ప్రదర్శకులు బయలుదేరారు. ఈ విధ్వంసంపై సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, రిజర్వు పోలీసులతో సహా తెనాలి చేరుకున్నారు. స్థానిక పాత బస్టాండు వద్ద ప్రదర్శకులను నిలువరించేందుకు ప్రయత్నించారు. పోలీసుల హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయలేదు. పైగా వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రజలను ఆపటం కష్టసాధ్యమన్న భావనకొచ్చిన అధికారుల ఆదేశాలతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసు తూటాలకు మాజేటి సుబ్బారావు, శ్రీగిరి లింగం, భాస్కరుని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్యలు కుప్పకూలారు.
}
విద్యార్థులకు అండగా పోలీసులను ఎదిరించిన హెచ్‌ఎం జొన్నలగడ్డ శివసుందరం
చర్చిల్, నేతాజీల దృష్టికి
తెనాలి రైల్వేస్టేషను దగ్ధమైన కొన్ని గంటల్లోనే సమీప దుగ్గిరాల రైల్వేస్టేషన్‌నూ తగులబెట్టారు. అక్కడ నాయకత్వం వహించిన వెనిగళ్ల సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. తెనాలిలో అరెస్టయిన వారిలో రావి సత్యనారాయణ, రావి అమ్మయ్య కూడా ఉన్నారు. ఈ తెనాలి పోరాటం అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, సింగపూర్‌లో ఉన్న నేతాజీ దృష్టికి వెళ్లింది. భారత్‌లో తెనాలి ఎక్కడాని చర్చిల్ ఆరా తీసినట్టు చెబుతారు. ఈ ఉదంతాన్ని బెర్లిన్, టోక్యో రేడియోలు ప్రసారం చేశాయి. ఆ ఆగస్టు విప్లవవీరుల రక్తతర్పణం ఇతర ప్రాంతాల్లో ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.
ప్రజలపై జరిమానా
ఈ ఘటన తర్వాత సాయుధులైన పోలీసులు పురవీధుల్లో నెలల తరబడి ప్రదర్శనలు చేస్తూ ప్రజలను హడలగొట్టారు. నాయకులు, దేశభక్తులను అరెస్టుచేసి, కోర్టుల్లో శిక్షలు విధించారు. ఇందులో మొదటి ముద్దాయిగా రావి అమ్మయ్యను కడలూరు జైలుకు పంపారు. తాలూకా హైస్కూలు విద్యార్థులను అరెస్టు చేసేందుకని అక్కడకు వెళ్లిన పోలీసులను ప్రధానోపాధ్యాయుడు జొన్నలగడ్డ శివసుందరం అనుమతించలేదు. తన శవంపైనే లోపలకు వెళ్లాలని ఖరాఖండీగా చెప్పటంతో చేసేదిలేక తిరుగుముఖం పట్టారు. ఉద్యమకారుల కారణంగా జరిగిన ఆస్తి నష్టానికి పరిహారంగా తెనాలి ప్రజలపై రూ.2 లక్షల సామూహిక జరిమానా విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ డబ్బు వసూలుకు పెట్టిన బాధలు వర్ణనాతీతం.
రణరంగచౌక్‌గా నామకరణం
తెనాలిలో క్విట్‌ఇండియా ఉద్యమంలో పోలీసులతో పోరాటం జరిగిన ప్రదేశానికి రణరంగచౌక్‌గా నామకరణం చేశారు. 1959లో తెనాలి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య, ఇక్కడ అమరవీరుల స్మృతి చిహ్నంగా ఏడు స్థూపాలను నిర్మించారు. అదే ఏడాది డిసెంబరు 20న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు నాడార్‌చేత ఆవిష్కరింపజేశారు. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, కాంగ్రెస్ ప్రముఖులు కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య, వెనిగళ్ల సత్యనారాయణ వంటి ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 12న అమరవీరులకు నివాళిగా తెనాలి మున్సిపాలిటీ అధ్వర్యంలో వీర సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు.
– బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
Comments
Please login to add a commentAdd a comment