Tenali Railway station
-
జైహింద్ స్పెషల్: తెనాలి ఎక్కడ? ఆరా తీసిన చర్చిల్!
ముంబైలో గాంధీజీ ఇచ్చిన ‘క్విట్ ఇండియా’ పిలుపును అందుకుని తెనాలిలో ప్రదర్శన కారులు తెనాలి రైల్వే స్టేషన్లో సృష్టించిన విధ్వంసం కొనసాగుతూ ఉండగానే.. మద్రాసు నుంచి మద్రాసు–పూరీ ప్యాసింజరు రైలు వచ్చి ప్లాట్‌ఫాంపై ఆగింది. ప్రయాణీకులు అందర్నీ దించాక నాలుగు బోగీల్లో కిరోసిన్ పోసి నిప్పంటించారు. అదే రైలులో దూరప్రయాణం చేస్తున్న యవ బ్రిటిష్ దంపతులు ఎంతకీ దిగిరాకపోవటంతో, వేచివుండి, వారు దిగాక, ఆ బోగీని కూడా తగులబెట్టారు. ఈ మంటలు రైల్వేస్టేషనుకూ వ్యాపించాయి. తర్వాత టెలిఫోన్ తీగెల్ని చిన్నాభిన్నం చేశారు. చదవండి: స్వతంత్ర భారతి: కలర్లో దూరదర్శన్ తూటాలకు ఏడుగురు బలి అక్కడ్నుంచి కొత్తపేటలోని సబ్‌ట్రెజరీ కార్యాలయానికి ప్రదర్శకులు బయలుదేరారు. ఈ విధ్వంసంపై సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, రిజర్వు పోలీసులతో సహా తెనాలి చేరుకున్నారు. స్థానిక పాత బస్టాండు వద్ద ప్రదర్శకులను నిలువరించేందుకు ప్రయత్నించారు. పోలీసుల హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయలేదు. పైగా వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రజలను ఆపటం కష్టసాధ్యమన్న భావనకొచ్చిన అధికారుల ఆదేశాలతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసు తూటాలకు మాజేటి సుబ్బారావు, శ్రీగిరి లింగం, భాస్కరుని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్యలు కుప్పకూలారు. } విద్యార్థులకు అండగా పోలీసులను ఎదిరించిన హెచ్ఎం జొన్నలగడ్డ శివసుందరం చర్చిల్, నేతాజీల దృష్టికి తెనాలి రైల్వేస్టేషను దగ్ధమైన కొన్ని గంటల్లోనే సమీప దుగ్గిరాల రైల్వేస్టేషన్నూ తగులబెట్టారు. అక్కడ నాయకత్వం వహించిన వెనిగళ్ల సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. తెనాలిలో అరెస్టయిన వారిలో రావి సత్యనారాయణ, రావి అమ్మయ్య కూడా ఉన్నారు. ఈ తెనాలి పోరాటం అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, సింగపూర్‌లో ఉన్న నేతాజీ దృష్టికి వెళ్లింది. భారత్‌లో తెనాలి ఎక్కడాని చర్చిల్ ఆరా తీసినట్టు చెబుతారు. ఈ ఉదంతాన్ని బెర్లిన్, టోక్యో రేడియోలు ప్రసారం చేశాయి. ఆ ఆగస్టు విప్లవవీరుల రక్తతర్పణం ఇతర ప్రాంతాల్లో ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. ప్రజలపై జరిమానా ఈ ఘటన తర్వాత సాయుధులైన పోలీసులు పురవీధుల్లో నెలల తరబడి ప్రదర్శనలు చేస్తూ ప్రజలను హడలగొట్టారు. నాయకులు, దేశభక్తులను అరెస్టుచేసి, కోర్టుల్లో శిక్షలు విధించారు. ఇందులో మొదటి ముద్దాయిగా రావి అమ్మయ్యను కడలూరు జైలుకు పంపారు. తాలూకా హైస్కూలు విద్యార్థులను అరెస్టు చేసేందుకని అక్కడకు వెళ్లిన పోలీసులను ప్రధానోపాధ్యాయుడు జొన్నలగడ్డ శివసుందరం అనుమతించలేదు. తన శవంపైనే లోపలకు వెళ్లాలని ఖరాఖండీగా చెప్పటంతో చేసేదిలేక తిరుగుముఖం పట్టారు. ఉద్యమకారుల కారణంగా జరిగిన ఆస్తి నష్టానికి పరిహారంగా తెనాలి ప్రజలపై రూ.2 లక్షల సామూహిక జరిమానా విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ డబ్బు వసూలుకు పెట్టిన బాధలు వర్ణనాతీతం. రణరంగచౌక్గా నామకరణం తెనాలిలో క్విట్ఇండియా ఉద్యమంలో పోలీసులతో పోరాటం జరిగిన ప్రదేశానికి రణరంగచౌక్గా నామకరణం చేశారు. 1959లో తెనాలి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య, ఇక్కడ అమరవీరుల స్మృతి చిహ్నంగా ఏడు స్థూపాలను నిర్మించారు. అదే ఏడాది డిసెంబరు 20న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు నాడార్చేత ఆవిష్కరింపజేశారు. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, కాంగ్రెస్ ప్రముఖులు కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య, వెనిగళ్ల సత్యనారాయణ వంటి ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 12న అమరవీరులకు నివాళిగా తెనాలి మున్సిపాలిటీ అధ్వర్యంలో వీర సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
సాహిత్య బాటసారి శారద
‘‘అది 1937వ సంవత్సరం. చలికాలపు ఓ ఉదయం. పన్నెండేళ్ల పిల్లవాడు తెనాలి రైల్వేప్లాట్‌ఫాంపై కాలుమోపాడు. తెలుగు ఒక్క ముక్క రాదు. ఎక్కడో పుదుక్కోటలో పుట్టి, మద్రాసులో పెరిగి, జానెడు పొట్టకోసం తెనాలి వచ్చాడు. హోటల్ కార్మికుడిగా చేరి తెలుగు నేర్చుకున్నాడు. అతనికి చదువు ఒక వ్యసనం. తనలోని తీవ్రమైన భావావేశాన్ని ప్రకటించడానికి రచనను ఆశ్రయించాడు. తోటి హోటల్ కార్మికులమైన మాకు తెలుగుతోపాటు తమిళ అక్షరాలు కూడా నేర్పాడు, పుస్తకాలు చదివించాడు. తను రాయడమే కాకుండా, నాచేత, ప్రకాశరావు, అబ్బరాజు నాగభూషణరావు, ముక్కామల మల్లికార్జునరావు చేత రాయించి మమ్మల్ని రచయితలను చేశాడు’’ అంటూ ఆలూరి భుజంగరావు తన జీవిత చట్రం నుంచి శారద జీవితాన్ని ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘సాహిత్య బాటసారి శారద స్మృతి శకలాలు’. ఈ పుస్తకం 1985లో వచ్చింది. శారద తుపాను వేగంతో సాహిత్యంలోకొచ్చాడు. అంతేవేగంతో జీవితం నుంచి నిష్క్రమించాడు. బతికినంత కాలం హోటల్ కార్మికుడిగానే బతికాడు. ఒక చేత్తో రచనలు చేస్తూనే, మరో చేత్తో రోడ్డుపక్క మసాలా గారెలు, మిరపకాయ బజ్జీలు అమ్మాడు. బస్సుల్లో నిమ్మకాయ మజ్జిగ, రోడ్డుపక్క పాతపుçస్తకాలు అమ్మాడు. అసలు పేరు ఎస్. నటరాజన్. శారద, గంధర్వుడు, శక్తి అన్న పేర్లతో వందకుపైగా కథలు రాశాడు. అపస్వరాలు, మంచి–చెడు, ఏదిసత్యం, సరళాదేవి హత్య, మహీపతి, అందాల దీవి వంటి ఆరు నవలలు రాశాడు. ముప్ఫై ఏళ్లే జీవించాడు. ‘‘అది 1947 ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు. నేను, శారద పనికోసం తెనాలి వీధులన్నీ తిరిగాం. మాకు పనులు ఇవ్వని హోటల్ యజమానులు, మమ్మల్ని కొట్టిన యజమానులు, మా జీతాలు ఎగ్గొట్టిన యజమానులు ఆరోజు జెండాల్ని ఎగరేశారు. ఆరోజు మా పొయ్యిలో పిల్లి లేవలేదు. నేను, శారద, అమ్మ కటిక పస్తులు పడుకున్నాం’’ అంటూ భుజంగరావు చెప్పిన విషయాలు కంటతడి పెట్టిస్తాయి. ‘‘ఆనాటి హోటల్ వృత్తి అవగుణాల నిలయం. పొద్దుగూకులూ బండెడు చాకిరీ చేయాల్సి ఉండేది. నాలుగు డబ్బులు చేతికి వచ్చిన రోజున ఏ చీట్లాటకో, తాగుడుకో, దొమ్మరిగుడిసెలకో వెళుతుండేవారు. అంతటి కల్మషంలో బతుకుతున్నా కూడా కథలు రాయాలన్న అపురూప ఊహ కలిగించినవాడు శారద.’’ ‘‘ఆరోజు ఆగస్టు 17, 1955వ సంవత్సరం. ‘కాఫీకి రారా బుజ్జీ’ అని శారద కేకవేశాడు. ‘నేను రానురా కథరాసుకుంటున్నా’ అన్నాను. తలెత్తి గేటువేపు చూశాను. అదే ఆఖరి చూపు. రాత్రి తొమ్మిది గంటలకు ‘శారద చనిపోయాడు’ అన్నారెవరో! మర్నాడు శవసంస్కారానికి బజారున పడ్డాం చందాలకు. అప్పటికతనికి ఇద్దరు పిల్లలు. భార్య నిండు గర్భవతి.’’ ‘‘శారద కథ రాయాలంటే అరకప్పు కాఫీ తాగి, æతాజ్ మహల్ బీడీకట్ట దగ్గర పెట్టుకుంటేనేగానీ కలం కదిలేది కాదు. పరిచయమున్న వారందరినీ కాఫీకి, బీడీలకు అణాడబ్బులడిగేవాడని అపప్రధ ఉండేది. ఎక్కడో తమిళ దేశంలో పుట్టి, తెనాలికొచ్చి తెలుగు నేర్చుకుని, తెలుగు జీవితాన్ని అక్షరబద్ధం చేసిన శారదకు కాఫీ కోసం, బీడీల కోసం ఎన్ని అణాలిస్తే అతని రుణం తీర్చుకోగలం!’’ అన్న భుజంగరావు మాటలు మనల్ని వెంటాడుతాయి. - రాఘవ శర్మ -
విజయవాడ-గూడూరు మధ్య త్వరలో మూడో లైన్
తెనాలి రూరల్: విజయవాడ-గూడూరు, విజయవాడ విశాఖపట్నం మధ్య త్వరలో మూడో రైల్వే లైన్ ఏర్పాటు కానుందని విజయవాడ అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె.వేణుగోపాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వే, ఇతర పనులు పూర్తయ్యాయని చెప్పారు. తెనాలి రైల్వే స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ... రత్నాచల్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను తెనాలి వరకు పొడిగించే విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చన్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో లక్ష లీటర్ల కెపాసిటీ ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు, ప్లాట్‌ఫామ్‌లపై పూర్తి స్థాయి షెడ్డులను నిర్మించనున్నామని తెలియజేశారు. ప్రయాణికులు పట్టాలు దాటకుండా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట స్టేషన్ మేనేజర్ సీహెచ్ డేనియల్‌రాజు పలువురు ఇతర అధికారులు ఉన్నారు.