అరుణా అసఫ్ అలీ ప్రసిద్ధ భారత స్వాతంత్య్రో ద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకు వెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి ఆమే నాయ కత్వం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా ఆమె చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మొట్ట మొదటి మేయర్. అరుణకు ఆమె మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. అరుణ హర్యానాలోని కాల్కా లో ఒక బెంగాలీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించారు.
విద్యాభ్యాసం లాహోరు, నైనిటాల్‌లలో జరిగింది. అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్లికి దారితీసింది. మతాలు వేరు. వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే. ఆమె కన్నా ఆయన ఇరవై ఏళ్లు పెద్ద. తల్లిదండ్రులు వ్యతిరేకించి నప్పటికీ వారిని కాదని అరుణ అసఫ్‌ను వివాహమాడారు. వివాహం తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నారు.
ఆ సమయంలో ఆమెను దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు. శిక్షాకాలం పూర్తయ్యాక కూడా.. తనతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్లేది లేదని అరుణ పట్టుబట్టారు. 1932లో తీహార్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా జైల్లో ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా అరుణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైల్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఆమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. నేడు అరుణ జయంతి. 1909 జూలై 16న ఆమె జన్మించారు.
ఎన్నారై వీరులు
భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎన్నారై పంజాబీలు అమెరికాలో స్థాపించిన పార్టీనే గదర్‌పార్టీ. ఈ పార్టీ హిందూ, సిక్కు, ముస్లింల కూటమిగా 1913 జూలై 15న ఏర్పాటైంది. 1910 దశకంలో వాషింగ్టన్, ఒరేగాన్ రాష్ట్రాలలోని కట్టెల మిల్లులలో, కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూములలో పని చేయడానికి పంజాబ్ నుండి చాలామంది కార్మికులు వెళ్లారు. అయితే అక్కడ పని చేస్తున్న తెల్లజాతి కార్మికులకంటే భారతీయులకు తక్కువ జీతం చెల్లించడంతో పాటు, బాగా వివక్ష కనబరిచేవారు.. మిల్లు, భూముల యజమానులు. అందుకు తీవ్ర అసంతృప్తికి లోనైన భారతీయులు.. దేశానికి స్వాతంత్య్రం వస్తే గానీ విదేశాల్లోని భారతీయుల పరిస్థితులు మారవని తలచి అనేక ప్రయత్నాల తర్వాత గదర్ పార్టీని స్థాపించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిష్ వారు ‘గదర్’ (తిరుగుబాటు) అని పిలిచేవారు. గదర్ పేరుతో మొదట పత్రికను పెట్టిన మన హిందూ, ముస్లిం, సిక్కు సోదరులు తర్వాత పత్రిక పేరునే పార్టీకి పెట్టారు. అలా గదర్ పార్టీ ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1948లో రద్దయింది.
,
Comments
Please login to add a commentAdd a comment