Quit India
-
బీజేపీ భారత్ వీడిపో
కోల్‌కతా: మణిపూర్ హింసాకాండ కారకులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ‘‘బీజేపీ భారత్ వీడిపో’’ అన్న నినాదం మారుమోగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, పీఎం కేర్ నిధుల అంశంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మమత అన్నారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ–20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభ నుంచి విపక్ష పార్టీ సభ్యులు పారిపోయారని, వారు వ్యాప్తి చేసిన నెగిటివిటీని తాము సమర్థంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మమత కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిరుపేద ప్రజలు బతకడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘‘ప్రధానమంత్రి జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో నిరుపేదలు బతకడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని మమత తాను విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్‌లో ఆరోపించారు. బ్రిటిష్ పాలకుల్ని క్విట్ ఇండియా అంటూ అప్పట్లో మహాత్మా గాంధీ నినదించారని, ఇప్పుడు దేశ ప్రజలు బీజేపీ క్విట్ ఇండియా అంటున్నారని మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
కుటుంబ పాలన.. ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో భారత్ యావత్తూ ముందుకొస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోని ఓ వర్గం తాము పనిచెయ్యం, ఇతరులను పనిచెయ్యనివ్వబోమన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి అని వాపోయారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పార్లమెంట్ భవనం నిర్మించామని, ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నమని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అది ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పార్లమెంట్‌ను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అందులోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేయడాన్ని కూడా వ్యతిరేకించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పారీ్టలు కేవలం ఎన్నికల సమయంలోనే సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను స్మరిస్తాయని, తాము గుజరాత్లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గత 70 ఏళ్లలో మన అమర జవాన్ల కోసం కనీసం యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించలేదని కాంగ్రెస్ పారీ్టపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము నిర్మిస్తే నిస్సిగ్గుగా బహిరంగంగా విమర్శలు చేశాయని దుయ్యబట్టారు. దేశ ప్రగతికి రెక్కలు తొడుగుతున్న యువత ప్రతికూల రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలను, పార్టీ రాజకీయాలను లెక్కచేయకుండా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తుతం రోజ్‌గార్ మేళా కొనసాగుతోందన్నారు. దేశంలో మార్పు మొదలైందని, దేశ అభివృద్ధితో యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మన యువత కొత్త రెక్కలు తొడుగుతున్నారని ప్రశంసించారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఈ నెల 9న జరిగే ‘క్విట్ ఇండియా’ వార్షికోత్సవాన్ని మోదీ ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక దినం అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచి్చన రోజు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా క్విట్ ఇండియా అంటూ బిగ్గరగా నినదిస్తోందని వివరించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వంటివి దేశం వదిలి వెళ్లిపోవాలని ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సదుపాయాలు పెరగడం, జీవనం సులభతరం కావడంతో దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందన్నారు. ‘అమృత్‌భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ది కోసం మోదీ శంకుస్థాపన చేయగా, వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 55, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
క్విట్ ఇండియా దినోత్సవంలో బండి సంజయ్
-
మహోజ్వల భారతి: అరుణ చేతికి క్విట్ ఇండియా!
అరుణా అసఫ్ అలీ ప్రసిద్ధ భారత స్వాతంత్య్రో ద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకు వెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి ఆమే నాయ కత్వం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా ఆమె చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మొట్ట మొదటి మేయర్. అరుణకు ఆమె మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. అరుణ హర్యానాలోని కాల్కా లో ఒక బెంగాలీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం లాహోరు, నైనిటాల్‌లలో జరిగింది. అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్లికి దారితీసింది. మతాలు వేరు. వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే. ఆమె కన్నా ఆయన ఇరవై ఏళ్లు పెద్ద. తల్లిదండ్రులు వ్యతిరేకించి నప్పటికీ వారిని కాదని అరుణ అసఫ్ను వివాహమాడారు. వివాహం తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమెను దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు. శిక్షాకాలం పూర్తయ్యాక కూడా.. తనతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్లేది లేదని అరుణ పట్టుబట్టారు. 1932లో తీహార్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా జైల్లో ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా అరుణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైల్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఆమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. నేడు అరుణ జయంతి. 1909 జూలై 16న ఆమె జన్మించారు. ఎన్నారై వీరులు భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎన్నారై పంజాబీలు అమెరికాలో స్థాపించిన పార్టీనే గదర్‌పార్టీ. ఈ పార్టీ హిందూ, సిక్కు, ముస్లింల కూటమిగా 1913 జూలై 15న ఏర్పాటైంది. 1910 దశకంలో వాషింగ్టన్, ఒరేగాన్ రాష్ట్రాలలోని కట్టెల మిల్లులలో, కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూములలో పని చేయడానికి పంజాబ్ నుండి చాలామంది కార్మికులు వెళ్లారు. అయితే అక్కడ పని చేస్తున్న తెల్లజాతి కార్మికులకంటే భారతీయులకు తక్కువ జీతం చెల్లించడంతో పాటు, బాగా వివక్ష కనబరిచేవారు.. మిల్లు, భూముల యజమానులు. అందుకు తీవ్ర అసంతృప్తికి లోనైన భారతీయులు.. దేశానికి స్వాతంత్య్రం వస్తే గానీ విదేశాల్లోని భారతీయుల పరిస్థితులు మారవని తలచి అనేక ప్రయత్నాల తర్వాత గదర్ పార్టీని స్థాపించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిష్ వారు ‘గదర్’ (తిరుగుబాటు) అని పిలిచేవారు. గదర్ పేరుతో మొదట పత్రికను పెట్టిన మన హిందూ, ముస్లిం, సిక్కు సోదరులు తర్వాత పత్రిక పేరునే పార్టీకి పెట్టారు. అలా గదర్ పార్టీ ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1948లో రద్దయింది. , -
‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో ఉద్యమం
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిర్మితమైన ఉద్యమాలలో క్విట్ ఇండియా ఉద్యమం చరిత్రాత్మకమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరుణంలో ఆ క్విట్ ఇండియా స్ఫూర్తితో తెలంగాణ అవసరాల కోసం పార్టీ శ్రేణులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా 78వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండాను ఉత్తమ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లి పోవాలని డిమాండ్ చేస్తూ 1942 ఆగస్ట్ 8న బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభలో మహాత్మాగాంధీ పిలుపునిచ్చారని చెప్పారు. ఈ ఉద్యమంతో దేశంలో లక్షలాది మంది కాంగ్రెస్ నాయకులను ఎలాంటి విచారణ లేకుండా బ్రిటిష్ పాలకులు జైళ్లలో పెట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆడంబరాలు చేసుకుంటూ తెలంగాణను రూ.3 లక్షల కోట్ల అప్పుల ఊబిలో పడేశారని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డి పాడు దగ్గర ఆంధ్రప్రదేశ్ రోజుకు 11 టీఎంసీల నీరు తీసుకుపోతుంటే ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, గూడూరు నారాయణరెడ్డి, దాసోజు శ్రావణ్ పాల్గొన్నారు. నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం మాజీ ఎంపీ నందిఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ సంతాపం ప్రకటించింది. ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు గాంధీభవన్‌లో నందిఎల్లయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సోమవారం సిద్దిపేట, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో సంతాప సభలు నిర్వహించాలని ఉత్తమ్ సూచించారు. -
ప్రజావంచకులారా.. క్విట్ ఏపీ: వైఎస్ జగన్
హైదరాబాద్: భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన 'క్విట్ ఇండియా' ఉద్యమస్ఫూర్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తుచేసుకున్నారు. 75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్యమానికి ఒక భారతీయుడిగా తాను సెల్యూట్ చేస్తున్నట్టు ఆయన బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ ఉద్యమం నిరంతరం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని గుర్తుచేశారు. మోసగాళ్లారా, దోపిడీ పాలకులారా, ప్రజావంచకులారా క్విట్ ఏపీ అంటూ మనం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విధంగా ట్వీట్ చేశారు. pic.twitter.com/nsyodmlx2l — YS Jagan Mohan Reddy (@ysjagan) 9 August 2017 -
1942లో డూ ఆర్ డై.. 2017లో
2017లో కరేంగే.. కర్కే రహేంగే నవభారత నిర్మాణానికి ఇదే నినాదం - 75 ఏళ్ల క్విట్ ఇండియాపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మోదీ - ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు చీకటి శక్తుల కుట్ర: సోనియా - అప్పుడు భారత్ ఛోడో.. ఇప్పుడు భారత్ జోడో: స్పీకర్ - సుదృఢ భారతావనికి ఉభయసభల తీర్మానం న్యూఢిల్లీ: నవ భారతావని నిర్మాణానికి కొత్త నినాదాన్ని, సరికొత్త కార్యాచరణను ప్రకటించారు ప్రధాని మోదీ. వలస పాలకులను తరిమి కొట్టిన క్విట్ ఇండియా ఉద్యమ నినాదం ‘డూ ఆర్ డై’ తరహాలో.. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ‘చేద్దాం.. చేసి చూపిద్దాం (కరేంగే.. కర్కే రహేంగే)’ అనే నూతన నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత.. తదితర సమస్యల పరిష్కారానికి పటిష్ట, సమగ్ర, ఉమ్మడి కార్యాచరణ అవసరమని, అందుకు అందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు. అప్పుడే స్వాతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు నిండే 2022 నాటికి నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. 75 ఏళ్ల క్విట్ ఇండియాపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు కొన్ని చీకటి శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఉభయసభల్లోనూ సంబంధిత తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అవినీతే ప్రధాన అవరోధం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 2017 నుంచి 2022 వరకు నవభారత నిర్మాణానికి ఎంపీలంతా కృషిచేయాలని కోరారు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన అవరోధంగా మారిందని.. రాజకీయ వ్యవస్థను చెదలా పట్టిందని మోదీ పేర్కొన్నారు. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం సమస్యలు పెను సవాళ్లుగా మారాయని.. ఈ సమస్యను అధిగమించేందుకు ఓ సానుకూల మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని వెల్లడించారు. ‘1942లో గాంధీ డూ ఆర్ డై అనే నినాదాన్నిచ్చారు. ఇప్పుడు మనం కరేంగే ఔర్ కర్కే రహేంగే నినాదంతో ముందుకెళ్దాం. సంకల్ప సిద్ధితో వచ్చే ఐదేళ్లు భారత్ తీసుకొచ్చే సానుకూల మార్పులే ప్రపంచదేశాలకు స్ఫూర్తినిచ్చేందుకు ఉపకరిస్తాయి’ అని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఎంపీలు పార్టీలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమరయోధులు కలలుగన్న భారతాన్ని వచ్చే ఐదేళ్లలో నిర్మించటంలో ముందడుగేయాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, జయప్రకాశ్ నారాయణ్, రాం మనోహర్ లోహియా, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురు వంటి ప్రముఖుల సేవలను మోదీ గుర్తుచేశారు. భారత స్వాతంత్య్ర పోరాటం భారత్‌కు స్వేచ్ఛ కల్పించేందుకు మాత్రమే కాదని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల వలసవాద విధానానికి చరమగీతం పాడేందుకు నిర్ణయాత్మకంగా మారిందని ప్రధాని గుర్తుచేశారు. 1942–1947 మధ్య స్వాతంత్య్రం పొందేందుకు ప్రపంచమంతా సానుకూల వాతావరణం ఏర్పడిందని.. ఈరోజు మళ్లీ దేశానికి అనుకూలమైన వాతావరణమే కనపడుతోందన్నారు. ప్రజలు బాధ్యతలు తెలుసుకోవాలి ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ అమలులో రాజకీయాలకు అతీతంగా పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణమైన మద్దతు తెలిపాయని మోదీ తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనూ ఇలా అందరినీ కలుపుకుపోయే విధానాన్నే అనుసరిస్తామన్నారు. ‘మనమంతా కలసి అవినీతిని నిర్మూలించగలం. పేదలకు వారి హక్కులను అందించగలం. యువతకు ఉపాధి కల్పించగలం. పౌష్టికాహారలోపాన్ని అంతం చేయగలం. మహిళాసాధికారతకున్న అడ్డంకులను తొలగించగలం. నిరక్షరాస్యతను నిర్మూలించగలం. ఈ సంకల్పంతో ముందుకెళ్దాం’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. దేశాన్ని ఏకం చేసేలా..: స్పీకర్ స్వాతంత్య్రోద్యమంలో అందరినీ ఏకం చేసేం దుకు క్విట్ ఇండియా ఉద్యమం చూపిన స్ఫూర్తితోనే మళ్లీ దేశాన్ని ఏకం చేయాల్సిన ప్రయత్నం అవసరమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ‘నాటి పోరాట యోధులు భారత్ ఛోడో (భారత్ వదిలి పెట్టండి) అని నినదించారు. నేడు మనం భారత్ జోడో (భారత్‌ను కలుపుదాం) నినా దాన్ని స్వీకరిద్దాం. దేశంలో సమగ్రాభివృద్ధి జరగాలన్న సమరయోధుల కలలను సాధిం చేందుకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని చర్చలో స్పీకర్ పేర్కొన్నారు. ‘హిందూ పాకిస్తాన్’ వద్దు: ఏచూరి ‘దేశం నుంచి మతతత్వం నిర్మూలించబడాలని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఈ దిశగా మనమేం చేస్తున్నామనేదే అసలైన ప్రశ్న’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి రాజ్యసభలో పేర్కొన్నారు. భారతదేశం హిందూ పాకిస్తాన్‌గా మారకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్ర సాధనలో దేశ విభజన జరిగిన బాధాకర ఘటన గుర్తుకొస్తుందన్నారు. చీకటి శక్తులతో ప్రమాదం దేశ ప్రజాస్వామ్య మూలాలను చీకటి శక్తులు విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందో ళన వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాయని.. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదని పరోక్షంగా ఆరెస్సెస్‌పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంపై చర్చలో సోనియా మాట్లాడుతూ.. ‘దేశంలో విభజన, విద్వేషపూరిత రాజకీయాలే కనబడుతున్నాయి. రాజ్యాంగం చెప్పిన బహుళత్వం, సమసమాజ నిర్మాణం పదాలకు నేటి సమాజంలో చోటులేదు. లౌకిక, ప్రజాస్వామిక, స్వేచ్ఛా విలువలన్నీ ప్రమాదంలో పడ్డాయి. చర్చ, భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజావేదిక కుచించుకుపోతోంది. చీకటి శక్తులు బయటకొస్తున్నాయా? సమానత్వం, సామాజిక న్యాయం, న్యాయాధారిత వ్యవ స్థ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య మూలాలపై ఆధారపడిన దేశ ప్రజా స్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయా?’ అని సోనియా ప్రశ్నించారు. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామ్యంలేని, క్విట్ ఇండియాను వ్యతిరేకించిన వ్యక్తులు, శక్తులు, సంస్థలను దేశం మరిచిపోకూడదన్నారు. ‘సంకుచిత మనస్తత్వానికి బంధితమయ్యే, విచ్ఛిన్నకర, మతతత్వ సిద్ధాంతాలను మనం ఆమోదించవద్దు. స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలనుకుంటే.. దీన్ని ప్రమాదంలో పడేస్తున్న శక్తులను ఓడించాలి. మతతత్వ శక్తులు విజయం సాధించకుండా మనం అడ్డుకోగలం, అడ్డుకుంటాం’ అని పేర్కొన్నారు. ఉభయసభల తీర్మానం ‘125 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధులుగా మేం.. మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతాన్ని 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా) నిర్మించటంలో ప్రతి పౌరుడిని కలుపుకుని పనిచేస్తాం. బలమైన, అభివృద్ధి చెందే, స్వచ్ఛమైన, దివ్యమైన, అవినీతి రహిత భారత నిర్మాణానికి మేం చిత్తశుద్ధితో పనిచేస్తాం. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడతాం. సామరస్యం, దేశభక్తిని పెంపొందించేందుకు పని చేస్తాం’ అని లోక్‌సభ తీర్మానం పేర్కొం ది. రాజ్యసభలోనూ ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బలమైన. స్వయంవర్ధక, లౌకిక, ప్రజాస్వామ్యవాద భారత నిర్మాణంలో భాగస్వాములవుతా మని సభ్యులు తెలిపారు. మహాత్మాగాంధీ పిలుపుతో యావద్భారతం క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొందని రాజ్యసభ చైర్మన్ అన్సారీ అన్నారు. -
ప్రజావంచకురాలా..క్విట్ ఏపీ: వైఎస్ జగన్
-
‘క్విట్ ఇండియా’ నినాదం ఎవరిది?
న్యూఢిల్లీ: ‘క్విట్ ఇండియా’ నినాదం భారతీయుల హదయాల్లో ఎంతగా నాటుకుపోయిందో బ్రిటిష్ పాలకుల గుండెల్లో కూడా అంతగా నాటుకుపోయి వారిని భయకంపితుల్ని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ స్వాతంత్య్రోద్యమాన్నే ఆ నినాదం ఓ మలుపుతిప్పింది. ఆ క్విట్ ఇండియా (1942, ఆగస్టు 8) ఉద్యమానికి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. అలాంటి నినాదాన్ని కాయిన్ చేసిందెవరని ఎవరైనా అడిగితే ఇంకెవరు! జాతిపితి మహాత్మా గాంధీ అనేవారు నేటికి కూడా ఉన్నారు. కానీ దాన్ని ఆయన కాయిన్ చేయలేదు. ‘క్విట్ ఇండియా’ను కాయిన్ చేసిందీ ఆ ఉద్యమం నాటికి ముంబై మేయర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల యూసుఫ్ మెహరల్లీ. మేయర్ పదవికి ఎన్నికైన తొలి సోషలిస్ట్ మెహరల్లీ. ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎనిమిది సార్లు జైలుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమానికి ఊపునిచ్చిన ‘క్విట్ ఇండియా’ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో కే. గోపాలస్వామి రాసిన ‘గాంధీ అండ్ బాంబే’ పుస్తకంలో వివరించారు. దేశ స్వాతంత్య్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మాగాంధీ తన సహచరులతో ముంబైలో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర పోరాటానికి పనికొచ్చి మంచి నినాదాలను సూచించాల్సిందిగా వారిని కోరారు. అందుకు ‘గెటవుట్’ అని ఎవరో సూచించారు. అదంత మర్యాదగ లేదని గాంధీ తిరస్కరించారు. ‘రిట్రీట్ ఆర్ విత్‌డ్రా’ అన్న పదాన్ని రాజగోపాలచారి సూచించారు. అక్కడే ఉన్న యూసుఫ్ మెహరల్లీ ‘క్విట్ ఇండియా’ పదాన్ని సూచించారు. యే! మేన్ అంటూ గాంధీ వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు. అప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న శాంతికుమార్ మొరార్జీ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కే. గోపాలస్వామి తన పుస్తకంలో వివరించారు. ఇక ఈ నినాదాన్ని, స్వాతంత్య్రోద్యమ ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ‘క్విట్ ఇండియా’ అంటూ విరివిగా బుక్లెట్లను ప్రచురించారు. అవి కొన్ని రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని మెహరల్లీ జీవిత చరిత్రను రాసిన మధు దండావతే పేర్కొన్నారు. ఆగస్టు 7, 1942లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమయ్యే నాటికి ‘క్విట్ ఇండియా’ పేరిట వెయ్యి బ్యాడ్జీలను కూడా తయారు చేశారు. ఆగస్టు 8, 1942లో ముంబైలోని గొవాలియా ట్యాంక్ మైదాన్ బహిరంగ సభ నుంచి ఉద్యమం ప్రారంభమైంది. ఆ నాడు ఈ నినాదం ప్రజల్లో ‘డూ ఆర్ డై’ అనే స్ఫూర్తినిప్పింది. గాంధీతోపాటు ఎంతో మంది నేతలు అరెస్టయినా ఉద్యమం ఆగలేదు. ఆకర్షణీయమైన నినాదాలను కాయిన్ చేయడంలో యూసుఫ్ మెహరల్లీ ఆయనకు ఆయనే సాటి. ఆయన 1928లో కాయిన్ చేసిన ‘సైమన్ గో బ్యాక్’ నినాదం కూడా జనంలోకి చొచ్చుకు పోయింది. నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ పాలన మెరగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడం కోసం బ్రిటిష్ పాలకులు సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక్క భారతీయుడికి కూడా స్థానం కల్పించలేదు. అందరూ బ్రిటిష్ అధికారులే ఉన్నారు. 1928లో సైమన్ కమిషన్ ముంబై రేవులో దిగినప్పుడు ‘సైమన్ గో బ్యాక్’ నినాదాలలో యూసుఫ్ మెహరల్లీ నాయకత్వాన కొంత మంది నిరసన ప్రదర్శన జరిపారు. రేవుకు చేరుకునేందుకు మెహరల్లీ, ఆయన మిత్రులు కూలీల వేశంలో వెళ్లారని మెహరల్లీ ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజీ పారిక్ తెలిపారు. మెహరల్లీ ఆకర్షణీయమైన నినాదాలను కాయిన్ చేయడానికే పరిమితం కాకుండా క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ఆయన తన సహచర మిత్రులైన రామ్ మనోహర్ లోహియా, అరుణా అసఫ్ అలీ, అచ్యుత్ పట్వర్దన్ లాంటి నేతలను కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చారని మధుదండావతే ‘యూసుఫ్ మెహరల్లీ: క్వెస్ట్ ఫర్ న్యూ హారిజాన్స్’లో వివరించారు. -
‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో..!
2022 నాటికి కులతత్వం, మతతత్వం, అవినీతి, పేదరికాన్ని నిర్మూలించాలి ► జీఎస్టీ అమలుతో ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పు ► వరద రాష్ట్రాలకు కేంద్రం విస్తృత సాయం ► మాసాంతపు మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: 2022 నాటికి(దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా) దేశంలోని కుల, మతతత్వాలతోపాటుగా పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, చెత్తలను పారద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని.. జీఎస్టీని చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో వరదలు, భారత స్వాతంత్య్ర సంగ్రామం, రానున్న స్వాతంత్య్ర దినోత్సవంపై మోదీ మాట్లాడారు. పండుగల్లో పర్యావరణ అనుకూల వస్తువుల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో మార్పు రావాలి.. దేశానికి ప్రధాన సమస్యలుగా మారిన మతతత్వం, కుల వ్యవస్థ, అవినీతి, ఉగ్రవాదం, పేదరికాన్ని 2022 నాటికి దేశం నుంచి నిర్మూలించేలా ప్రతి భారతీయుడు కృషిచేయాలని.. ఈ దిశగా ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీని ద్వారానే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యేలోపు నవభారత నిర్మాణం జరుగుతుందన్నారు. 1942, ఆగస్టు 9న మహాత్ముడు ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కారణంగానే.. 1947లో బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లారని గుర్తుచేసిన మోదీ.. 2017లో నవభారత నిర్మాణానికి ప్రతి భారతీయుడు ప్రతినబూనటం ద్వారా 2022 కల్లా ఫలితాలు సాధించగలమన్నారు. దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 70 ఏళ్లలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతుల్లో ఉపాధి పెంచేందుకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. సాధించిన విజయాలకన్నా అంచనాలు భారీగా పెరిగిపోయాయి’ అని ప్రధాని వెల్లడించారు. తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చాలా ఎక్కువసేపు ఉంటోందన్న విమర్శల నేపథ్యంలో ఈసారి తక్కువ సమయంలోనే ప్రసంగం పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తానని మోదీ తెలిపారు. రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దీపావళి పండుగల్లో దేశంలోని పేదలు తయారుచేసే వస్తువులను కొనటం ద్వారా వారి ఆర్థిక సాధికారతకు తోడ్పడాలని కోరారు. విస్తృతంగా వరద సాయం వరదల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వివిధ రాష్ట్రాలకు కేంద్రం విస్తృతంగా సాయం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. అస్సాం, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్లో పరిస్థితిని ఆర్మీ, వైమానిక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో వరదల వల్ల రైతులకు నష్టం జరగకుండా.. బీమా క్లెయిమ్‌ల సెటిల్మెంట్లో చొరవ తీసుకోవాలని పంట బీమా కంపెనీలకు సూచించామన్నారు. ‘పనామా’పై చర్యలేవి?: కాంగ్రెస్ అవినీతి నిర్మూలనపై ప్రసంగిస్తున్న ప్రధాని.. పనామా పేపర్ల లీకేజీపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇదే అంశంపై పాకిస్తాన్లో ప్రధాని షరీఫ్‌నే పదవినుంచి తప్పించారని గుర్తుచేసింది. ‘ప్రధాని అవినీతిపై సుదీర్ఘంగా మాట్లాడతారు కానీ పనామా అవినీతిపై స్పందించరు. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు, బీజేపీ ఎంపీ అభిషేక్ పై ఆరోపణలొస్తే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించింది. కల నెరవేరింది! వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చిందని.. సహకార సమాఖ్య విధానానికి ఇదో ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ వంటి కీలక సంస్కరణ కోట్లమంది జనాభా ఉన్న దేశంలో ఇబ్బందుల్లేకుండా సులభంగా అమల్లోకి తీసుకురావటం ఓ చారిత్రక ఘట్టమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల్లో జీఎస్టీ అమలు కేస్ స్టడీ జరగాల్సిన అంశమన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా దేశంలో ఓ సంస్కరణగానే కాకుండా.. నిజాయితీని పెంచే సరికొత్త సంస్కృతిగా, సాంస్కృతిక అభివృద్ధిగా చూడాలని అన్నారు. జీఎస్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటోందని వెల్లడించారు. ఏకాభిప్రాయంతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలే సహకార సమాఖ్య విధానానికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సానుకూల మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయన్నారు. -
మాజీ గవర్నర్ బర్నాలా కన్నుమూత
అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస ఉమ్మడి ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలు చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా సేవలందించిన శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకుడు సుర్జిత్‌సింగ్ బర్నాలా (91) శనివారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఇక్కడి పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో గురువారం చేరిన ఆయనను మెరుగైన వైద్యం కోసం ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన సొంతూరు బర్నాలాలో ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. బర్నాలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే గగన్జిత్ సింగ్, మనవడు సమరప్రతాప్‌సింగ్ ఈ తంతు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు కన్నీటివీడ్కోలు పలికారు. బర్నాలాకు భార్య సుర్జిత్‌కౌర్, ఇద్దరు కుమారులు. ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన బర్నాలా.. 1946లో లక్నో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సుదీర్ఘ పయనం: 2003, 04 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన బర్నాలా... ఉత్తరాఖండ్‌కు తొలి గవర్నర్‌గా సేవలందించారు. వీటితోపాటు తమిళ నాడు, అండమాన్ నికోబార్ దీవులకూ గవర్నర్‌గా పనిచేశారు. అకాలీదళ్ పార్టీ నాయకుడైన బర్నాలా 1985లో పంజాబ్‌లో తీవ్రవాదం అట్టుడుకుతున్న కీలక సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 1987 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1991లో తమిళనాడు గవర్నర్‌గా (1990–91; 2004–2011) ఉన్న ఆయన... డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్న నాటి ప్రధాని చంద్రశేఖర్ ప్రతిపాదనను తోసిపుచ్చడం సంచలనం రేపింది. ఈ కారణంతో వెంటనే బర్నాలాను బిహార్‌కు బదిలీ చేయగా, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 1977లో లోక్‌సభకు ఎన్నికై, కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అటల్‌బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో రసాయన–ఎరువుల మంత్రిగా ఉన్నారు. గొప్ప దేశ భక్తుడిని కోల్పోయాం: ప్రణబ్ ఉగ్రవాదం, సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపిన నాయకుడు, గొప్ప దేశ భక్తుడిని దేశం కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సంతాప సందేశంలో బర్నాలాను కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతకు ఆయన కీలక పాత్ర పోషించారని, సుదీర్ఘ కాలం సహచరుడిగా, స్నేహితుడిగా ఉన్న బర్నాలా... గొప్ప రాజనీతిజ్ఞుడు, పార్లమెంటేరియన్, పాలనాదక్షుడని శ్లాఘించారు. దేశానికి బర్నాలా చేసిన సేవలు చిరస్మరణీయమంటూ ఆయన కుటుంబానికి ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు, అంకితభావం గల రాజకీయ నాయకుడు, దార్శనికుడు, మంచి రచయిత, అద్భుత మానవతావాది బర్నాలా అని, పంజాబ్‌లో ఉగ్రవాదంపై పోరాడి శాంతిని నెలకొల్పిన ఘనుడని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీర్తించారు. బర్నాలా శక్తివంతమైన నాయకుడని, భారత రాజకీయాల్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ఆయన పంజాబ్ అభివృద్ధికి విశేష కృషి చేశారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ సంతాపం ప్రకటించారు. వీరితో పాటు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ సంప్లా తదితరులు బర్నాలా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బర్నాలా సేవలు చిరస్మరణీయమని, ఆయన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. కేసీఆర్, బాబు సంతాపం సాక్షి,హైదరాబాద్/అమరావతి: బర్నాలా మృతికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బర్నాలా చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రాబాబు కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఎన్నో పదవులను అలంకరించి, వాటికి వన్నె తెచ్చారన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషించారన్నారు. -
క్విట్ ఇండియాకు 75 ఏళ్లు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మహాత్మాగాంధీ యావద్దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు 1942 ఆగష్టు 8వ తేదీన నాంది పలికిన∙క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు నిండాయి. మంగళవారం ఆ ఉద్యమ పటిమ, స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ మాంటిస్సోరి విద్యార్థులు నగరంలో భారీ త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించారు. 102 మీటర్ల పతకాన్ని నగరంలోని కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు ప్రదర్శించారు. నాడు గాందీజీ దేశానికి స్వాతంత్య్రం కోసం బ్రిటిషు వాళ్లను దేశం నుంచి వెళ్లండి అని డూ అర్ డై నినాదాన్ని ఇచ్చారు. నేడు దేశాభివద్ధికి ప్రతిఘటకంగా మారిన అవినీతి, అక్రమాలు, బాలకార్మిక వ్యవస్థ, గహహింస, ప్రజాస్వామ్య విలువల పతనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలువురు విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో డూ బీ ఫోర్ ఉయ్ డై అను నినాదాలు ఇస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్ వద్ద కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పాఠశాల హెచ్ఎం శశికళ జెండా ఊపి ప్రారంభించారు. -
త్రిపుర చూపిన బాట!
స్వాతంత్య్రానంతరం మన దేశంలో తీసుకొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా పేరుబడిన సాయుధ దళాల(ప్రత్యేకాధికారాల)చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడంద్వారా త్రిపుర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తరచు జరిగే సాయుధ తిరుగుబాట్లతో అట్టుడికే ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసమంటూ 1958లో ఈ చట్టాన్ని తీసుకురాగా, త్రిపురలో 1997 ఫిబ్రవరినుంచి దాన్ని అమలుచేయడం ప్రారంభించారు. ఈ చట్టం మన ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని, మన నేతల రెండు నాల్కల ధోరణిని బట్టబ యలు చేస్తుంది. నిజానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది స్వతంత్ర భారత పాలకులే అయినా దీని బీజాలు 1942లో సాగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణిచేయ డానికి బ్రిటిష్ వలస పాలకులు జారీచేసిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. ఈ చట్టం దుర్వినియోగంపైనా, సాధారణ పౌర జీవనంలో అది కలిగిస్తున్న కల్లోలంపైనా దశాబ్దాలుగా ఆరోపణలు వస్తున్నాయి. సాయుధ దళాల చట్టం అమ లవుతున్న ప్రాంతంలో శాంతిభద్రతలను చూసే సైన్యానికి మాత్రమే కాదు...ఆ పనిలో నిమగ్నమై ఉండే సాధారణ పోలీసులకు సైతం ఈ చట్టంకింద రక్షణ ఉం టుంది. ఇది కల్పించే అధికారాలు సాధారణమైనవి కాదు. శాంతిభద్రతల పరి రక్షణలో భాగంగా కల్లోలిత ప్రాంతంలోని ఏ ఇల్లునైనా వారంటు లేకుండా సోదా చేయవచ్చు. అనుమానం వచ్చిన ఎవరినైనా అరెస్టుచేయొచ్చు. ప్రమాదకరమైన వ్యక్తి అని భావించిన పక్షంలో కాల్చిచంపొచ్చు. వారి చర్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా న్యాయస్థానాల్లో కేసు పెట్టడం కూడా సాధ్యంకాదు. ఈ చట్టం ఇస్తున్న రక్షణను అడ్డుపెట్టుకుని సాయుధ దళాల సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని...అమాయక యువకులను కాల్చిచంపుతున్నా రని, మాయం చేస్తున్నారని, అత్యాచారాలకు ఒడిగడుతున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చాన్నాళ్లనుంచి హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అవి న్యాయస్థానాల్లోనూ, వెలుపలా పోరాడు తున్నాయి. మణిపూర్‌కు చెందిన మహిళా నేత ఇరోం షర్మిల పదిహేనేళ్లనుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఇదే చట్టాన్ని 1990నుంచీ జమ్మూ-కశ్మీర్లో కూడా అమలుచేస్తున్నారు. ఆచరణలో ఈ చట్టం అమలువల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో తెలియాలంటే జమ్మూ-కశ్మీర్లో 2000 సంవత్సరంలో జరిగిన చిట్టిసింగ్‌పురా ఎన్కౌంటర్ ఉదం తాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అయిదుగురు యువకులు మరణించిన ఆ కేసులో నేరారోపణలను ఎదుర్కొన్న జవాన్లపై ఏ కోర్టులో విచారించాలన్న అంశం తేలడా నికే పుష్కరకాలం పట్టింది. చివరకు సైనిక కోర్టులో విచారణ జరుపుతారో, సాధారణ కోర్టుల్లో విచారణకు అంగీకరిస్తారో చెప్పాలంటూ 2012లో సుప్రీంకోర్టు ప్రశ్నించాక సైనిక కోర్టులో విచారణకు సైన్యం ఒప్పుకుంది. మణిపూర్‌లో జరిగిన ఆరు ఎన్కౌంటర్లపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు దానిపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే ఆధ్వర్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక కమిషన్‌ను నియమించింది. ఆ ఉదంతాలన్నిటా మరణించింది సాధారణ పౌరులే నని కమిషన్ తేల్చిచెప్పింది. అంతేకాదు...సాయుధ దళాలు సృష్టిస్తున్న భయోత్పా తంవల్ల సాధారణ పౌర జీవనానికి భంగం కలుగుతున్నదని తేల్చిచెప్పింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనంచేసి సిఫార్సులు చేయడానికి 2005లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ సైతం సాయుధ దళాల చట్టాన్ని తక్షణం రద్దుచేయాలని సిఫార్సు చేసింది. మిలిటెన్సీని అదుపు చేయడానికి గట్టి చట్టం అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబంధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనైనా, జమ్మూ- కశ్మీర్‌లోనైనా ఈ చట్టం అండ లేకుండా తాము పనిచేయలేమని సైన్యం చెబుతూ వస్తున్నది. అందువల్లే దీన్ని రద్దు చేస్తామని, అది కుదరకపోతే సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ ప్రభుత్వం కూడా చివరకు చేతులెత్తేసింది. ఆ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన చిదంబరం కోరినా చట్టం ఉపసంహరణ సాధ్యం కాలేదు. త్రిపుర తీసుకున్న తాజా నిర్ణయం వెనక అక్కడి ప్రభుత్వం పదేళ్లుగా చేస్తున్న కృషి ఉంది. మిలిటెంట్ చర్యలను అరికట్టడానికి ఆ ప్రభుత్వం బహుముఖ చర్యలు తీసుకుంది. మిలిటెంట్ల కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచడంతోపాటు రబ్బరు చెట్ల సాగుద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పించడానికి ప్రయత్నించింది. పర్యవసానంగా 2009 తర్వాత అక్కడ మిలిటెన్సీకి సంబంధించి పెద్ద సంఘటనేదీ జరగలేదు. ఆరేళ్ల అనుభవం తర్వాత తమకు ఈ చట్టం అవసరం లేదని త్రిపుర ప్రభుత్వం నిర్ధారణకొచ్చింది. హింసకు పాల్పడుతున్న గ్రూపులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆ పేరిట సైన్యమైనా, మరొక విభాగమైనా పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడకూడదు. సామాన్య పౌరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించకూడదు. సాయుధ దళాల చట్టంవల్ల జరుగుతున్నది ఇదే. త్రిపుర అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేస్తే, ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తే అణచివేత చట్టాల అవసరం ఉండదు. కానీ, మన దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు ఏ సమస్యకైనా అణచివేతే పరిష్కారంగా భావిస్తున్నాయి. ఈ ధోరణిని విడనాడవలసిన అవసరం ఉంది. త్రిపుర నిర్ణయంతో సహజంగానే ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాలపైనా, జమ్మూ-కశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతుంది. సాయుధ దళాల చట్టం విషయంలో ఆ ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంటుందన్నది వేచిచూడాలి. -
ఖాదీప్యమానం!
అర్ధరాత్రి ఒక్కసారిగా దీపాలన్నీ వెలిగినట్లు... పెద్ద కాంతితో వచ్చేసింది స్వాతంత్య్రం! ఆ వేళ ఇద్దరే ఇద్దరు విశ్వరూపమైపజ్వరిల్లారు. ఒకరు గాంధీ, ఇంకొకరు... గాంధీ తర్వాత గాంధీ అంతటి... ‘ఖాదీ’! ‘క్విట్ ఇండియా’ అని సమర వీరులు కళ్లురిమితే... ‘వియ్ డోన్ట్ వాంట్’ అని... విదేశీ వస్త్రాలను విసిరికొట్టారు ఖాదీ యోధులు. జాతీయ ఉద్యమంలో ఒక ఆయుధం... ఖాదీ. జాతీయ పతాకపు వర్ణాలకు ప్రాణాధారం... ఖాదీ. భరతజాతికి ఆత్మగౌరవం... ఖాదీ. ఆగస్ట్ 15 వచ్చేస్తోంది. ‘బ్రాండెడ్’లను కొక్కేనికి తగిలించి, మన సొంత బ్రాండ్‌తో సెల్యూట్ కొట్టేందుకు ‘ముస్తాబు’ అవండి. ఖాదీని కట్టినంత కాలం... భారత్ దేదీప్యమానం! కర్షకుడి కృషితో పండిన పత్తిని చేనేత కార్మికుడు చరఖాపై వడికి, దారం తీసి, మగ్గం మీద నేయగా వచ్చిన వస్త్రం.. ఖాదీ! భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ దేశభక్తిని పెంపొందింపజేసే లక్షణాలను పుష్కలంగా మూటగట్టుకొని నేటి యువత కోసం ఎదురుచూస్తున్నది ఖాదీ!! మన ఆత్మగౌరవ పతాక! ‘ఏ దేశంలోనైనా హస్తకళలు, కుటీర పరిశ్రమల అభివృద్ధి తగినంతగా లేదంటే ఆ దేశ పౌరుల్లో తెలివి, ఆ దేశంలో సంపద లేనట్టే! దిగుమతి అయ్యే వస్తువులను బట్టి చూస్తే ఆ దేశపౌరుల సోమరితనం, పరాన్నజీవితాన్ని గడుపుతుండటం సులువుగా గ్రహించవచ్చు’ అనేది గాంధీజీ అభిప్రాయం. అందుకే స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువుల తయారీని ప్రోత్సహించారు. ఇందులో భాగంగా తానే స్వయంగా నూలు వడికి, ఖాదీ వస్త్రాన్ని తయారుచేసేవారు. ఖాదీ ఎందుకు ధరించాలంటే! ఖాదీ దుస్తులు ఇచ్చే హుందాతనాన్ని ఇతర వస్త్రాలు ఇవ్వలేవు ఖాదీ వస్త్రాన్ని తయారుచేసే చేనేతకార్మికుడికి సహాయపడటం సామాజిక బాధ్యత చర్మానికి రక్షణగా, ఆరోగ్యదాయకంగా ఉండే ఖాదీ, సింథటిక్ మెటీరియల్ వల్ల చర్మానికి కలిగే హానిని నివారిస్తుంది పర్యావరణ సమతుల్యతను కాపాడే సుగుణాల గని ఖాదీ! మన దేశ ఆత్మగౌరవ పతాకను ఎగురవేసే బాధ్యత మనలో ప్రతి ఒక్కరి భుజాల మీద ఉన్నదన్న విషయం మరవద్దు. ప్రతిరోజూ ఖాదీని ధరిద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ వేళ మన ఘనతను మరింతగా నలుదిశలా చాటుదాం. జైహింద్! జై ఖాదీ! - నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి