మాజీ గవర్నర్‌ బర్నాలా కన్నుమూత | Former Governor Barnala passes away | Sakshi
Sakshi News home page

మాజీ గవర్నర్‌ బర్నాలా కన్నుమూత

Published Mon, Jan 16 2017 3:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

మాజీ గవర్నర్‌ బర్నాలా కన్నుమూత - Sakshi

మాజీ గవర్నర్‌ బర్నాలా కన్నుమూత

అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస
ఉమ్మడి ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలు

చండీగఢ్‌/న్యూఢిల్లీ: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా సేవలందించిన శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నాయకుడు సుర్జిత్‌సింగ్‌ బర్నాలా (91) శనివారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఇక్కడి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) ఆసుపత్రిలో గురువారం చేరిన ఆయనను మెరుగైన వైద్యం కోసం ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు.

ఆయన సొంతూరు బర్నాలాలో ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. బర్నాలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే గగన్‌జిత్‌ సింగ్, మనవడు సమరప్రతాప్‌సింగ్‌ ఈ తంతు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు కన్నీటివీడ్కోలు పలికారు. బర్నాలాకు భార్య సుర్జిత్‌కౌర్, ఇద్దరు కుమారులు. ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన బర్నాలా.. 1946లో లక్నో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
సుదీర్ఘ పయనం: 2003, 04 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన బర్నాలా... ఉత్తరాఖండ్‌కు తొలి గవర్నర్‌గా సేవలందించారు. వీటితోపాటు తమిళ నాడు, అండమాన్‌ నికోబార్‌ దీవులకూ గవర్నర్‌గా పనిచేశారు. అకాలీదళ్‌ పార్టీ నాయకుడైన బర్నాలా 1985లో పంజాబ్‌లో తీవ్రవాదం అట్టుడుకుతున్న కీలక సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 1987 వరకు ఆ పదవిలో కొనసాగారు.

1991లో తమిళనాడు గవర్నర్‌గా (1990–91; 2004–2011) ఉన్న ఆయన... డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలన్న నాటి ప్రధాని చంద్రశేఖర్‌ ప్రతిపాదనను తోసిపుచ్చడం సంచలనం రేపింది. ఈ కారణంతో వెంటనే బర్నాలాను బిహార్‌కు బదిలీ చేయగా, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 1977లో లోక్‌సభకు ఎన్నికై, కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అటల్‌బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో రసాయన–ఎరువుల మంత్రిగా ఉన్నారు.

గొప్ప దేశ భక్తుడిని కోల్పోయాం: ప్రణబ్‌
ఉగ్రవాదం, సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపిన నాయకుడు, గొప్ప దేశ భక్తుడిని దేశం కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన సంతాప సందేశంలో బర్నాలాను కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతకు ఆయన కీలక పాత్ర పోషించారని, సుదీర్ఘ కాలం సహచరుడిగా, స్నేహితుడిగా ఉన్న బర్నాలా... గొప్ప రాజనీతిజ్ఞుడు, పార్లమెంటేరియన్, పాలనాదక్షుడని శ్లాఘించారు. దేశానికి బర్నాలా చేసిన సేవలు చిరస్మరణీయమంటూ ఆయన కుటుంబానికి ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు, అంకితభావం గల రాజకీయ నాయకుడు, దార్శనికుడు, మంచి రచయిత, అద్భుత మానవతావాది బర్నాలా అని, పంజాబ్‌లో ఉగ్రవాదంపై పోరాడి శాంతిని నెలకొల్పిన ఘనుడని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీర్తించారు.

బర్నాలా శక్తివంతమైన నాయకుడని, భారత రాజకీయాల్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ఆయన పంజాబ్‌ అభివృద్ధికి విశేష కృషి చేశారని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ సంతాపం ప్రకటించారు. వీరితో పాటు ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్‌ సంప్లా తదితరులు బర్నాలా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బర్నాలా సేవలు చిరస్మరణీయమని, ఆయన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు.

కేసీఆర్, బాబు సంతాపం   
సాక్షి,హైదరాబాద్‌/అమరావతి: బర్నాలా మృతికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్‌ రావు, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బర్నాలా చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రాబాబు కొనియాడారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఎన్నో పదవులను అలంకరించి, వాటికి వన్నె తెచ్చారన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement