చంద్రబాబు, కెసిఆర్ చేతులు కలిపిన గవర్నర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావు కరచాలనం చేసుకున్నారు. వారి ఇద్దరి చేతులను గవర్నర్ నరసింహన్ కలిపి పట్టుకున్నారు. ముఖ్యమంత్రుల హోదాలో ఇద్దరూ కలవడం ఇదే మొదటిసారికావడం విశేషం. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికేందుకు వారు ఇద్దరూ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. రాష్ట్రపతి రాక సందర్బంగా ఇద్దరూ ఈ రోజు తప్పనిసరిగా కలవవలసిన అవసరం ఏర్పడింది. పాత మిత్రులైన ఇద్దరూ చాలా కాలం తరువాత కలిశారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా గవర్నర్ నరసింహన్తోపాటు ముగ్గురూ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు నాయుడు కెసిఆర్ భుజం తట్టి నవ్వుతూ మాట్లాడారు. గవర్నర్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినా కెసిఆర్ ఆ రోజు రాలేదు. అందువల్ల ఆరోజు వీరు కలవలేకపోయారు. నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక్కడకు వచ్చారు. ఆయనకు గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబు నాయుడు, కెసిఆర్లను కలపడంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం చేకూర్చడానికి వెంకయ్య నాయుడు ఇక్కడకు వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఆయన కలిశారు. ఆ తరువాత వీరిద్దరూ ఇలా కలవడం శుభసూచకంగా భావిస్తున్నారు.