16 నుంచి ఏవియేషన్ ఎగ్జిబిషన్ | Aviation Exhibition From 16 | Sakshi
Sakshi News home page

16 నుంచి ఏవియేషన్ ఎగ్జిబిషన్

Published Mon, Mar 14 2016 1:50 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

16 నుంచి ఏవియేషన్ ఎగ్జిబిషన్ - Sakshi

16 నుంచి ఏవియేషన్ ఎగ్జిబిషన్

ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్
హాజరు కానున్న దేశ,విదేశీ అతిథులు

 
 సాక్షి, హైదరాబాద్: నగరం మరో అంతర్జాతీయ వేడుకకు ఆతిథ్యమివ్వనుంది. ప్రతిష్టాత్మకమైన  5వ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్‌లను బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరగుతున్నాయి. కేంద్రం, పౌర విమానయాన శాఖ, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఫిక్కీ సౌజన్యంతో ఈ నెల 16న ప్రదర్శన ప్రారంభమవుతుంది. ‘‘ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టార్: పొటెన్షియల్ యాజ్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ అండ్ ఎంఆర్‌ఓ హబ్’’ ఇతివృత్తంగా ప్రదర్శన జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదర్శన ప్రారంభిస్తారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే, ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ తదితరులు హాజరవుతారు.

 దేశ విదేశాల అతిథులు...
 ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనకు పోలెండ్ మంత్రి ఆన్‌డ్రెజ్ ఆడంసిక్, మలేషియా రవాణా మంత్రి దాతో లియో టియాంగ్‌లై, జర్మనీ ఫెడరల్ మినిస్టర్ అలెగ్జాండర్, అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ సుసాన్ కుర్లాండ్, చెక్ రిపబ్లిక్ డిప్యూటీ మంత్రి జిరి కోలిబా తదితర అతిథులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.

 ఏవియేషన్ మార్కెట్‌లోకి వాయువేగంతో...
 ప్రపంచంలో ఏవియేషన్ మార్కెట్‌లో 2020 నాటికి అమెరికా, చైనా దేశాల తరువాత భారత్‌దే పైచేయి కానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏవియేషన్ మార్కెట్‌లో భారత్‌ది తొమ్మిదో స్థానం. దేశం నుంచి 85 అంతర్జాతీయ విమానయాన సర్వీసులు 40 దేశాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగా 2020 నాటికి దేశంలో విమాన ప్రయాణికులు ప్రస్తుతం ఉన్న 159.3 మిలియన్ల నుంచి 450 మిలియన్లకు చేరుకోనున్నట్లు అంచనా. రాబోయే 20 ఏళ్లలో 200 లోకాస్ట్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాత్సవ ఒక ప్రకటనలో తెలిపారు.  

 200 సంస్థల భాగస్వామ్యం...
 ఏవియేషన్ షోలో 12 దేశాలకు చెందిన సుమారు 200 ప్రముఖ సంస్థలు భాగస్వాములవుతున్నట్లు అనిల్ శ్రీవాత్సవ తెలిపారు. ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీలో అగ్రగామి సీఎఫ్‌ఎం, యూటీసీ, జీఈ ఏవియేషన్, రోల్స్‌రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ వంటి సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. చిన్నపాటి బిజినెస్ జెట్లతో పాటు 29 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొలువుదీరుతాయి. ఎయిర్ ఇండియాకు చెందిన బీ777, హెచ్‌ఏఎల్‌కు చెందిన డోర్నియర్, థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన టీఏసీ-003, పవన్‌హంస్‌కు చెందిన ఎంఐ-172, కతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఏ 350, ఎయిర్ ఏసియా, లెగసీ, ఫీణోమ్, ఎంబ్రేరర్, ఎమిరేట్స్, ఫాల్కన్, కింగ్ ఎయిర్, గ్రాండ్ కారావాన్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు కనువిందు చేస్తాయి. 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 200 స్టాల్స్, 14 చాలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 17న దేశ పౌరవిమానయాన రంగంపై ప్రత్యేక సెమినార్ ఉంటుంది. ఈ నెల 17న దేశ పౌరవిమానయాన రంగంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నారు. ఇందులో ఈ రంగం అభివృద్ధి, నూతన విధానాలు, బిజినెస్ అంశాలపై దేశవిదేశాల నిపుణులు ప్రసంగిస్తారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో ఇంటరాక్టివ్ సెషన్ కూడా నిర్వహిస్తున్నాం’ అని అనిల్ చెప్పారు.
 
 ఆగిన హెలీ టూరిజం
 పర్యాటక శాఖ సహకారంతో ఇండ్‌వెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ టూరిజం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న ఏవియేషన్ ఎగ్జిబిషన్ నేపథ్యంలో కొన్ని అనుమతులు రాలేదు. దీంతో ఈ నెల 11 నుంచి ఆగిన ‘జాలీ రైడ్’ను 21న పునరుద్ధరిస్తామని నిర్వాహకులు తెలిపారు.
 
 చివరి రెండు రోజులూ సాధారణ సందర్శకులకు...
 ఈ నెల 16, 17, 18 తేదీల్లో బిజినెస్ విజిటర్లను మాత్రమే ప్రదర్శనకు అనుమతిస్తారు. చివరి రెండు రోజులు... 19, 20 తేదీల్లో (ఉదయం 10 నుంచి 1 గంట; మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సాధారణ పౌరులు సందర్శించవచ్చు. ప్రదర్శన తిలకించాలనుకొనేవారు ‘బుక్‌మైషో.కామ్’ వెబ్‌సైట్‌లో రూ.300 చెల్లించి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. బిజినెస్ విజిటర్లు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ కార్గో ఏరియాలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement