
‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో..!
2022 నాటికి కులతత్వం, మతతత్వం, అవినీతి, పేదరికాన్ని నిర్మూలించాలి
► జీఎస్టీ అమలుతో ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పు
► వరద రాష్ట్రాలకు కేంద్రం విస్తృత సాయం
► మాసాంతపు మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 2022 నాటికి(దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా) దేశంలోని కుల, మతతత్వాలతోపాటుగా పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, చెత్తలను పారద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని.. జీఎస్టీని చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో వరదలు, భారత స్వాతంత్య్ర సంగ్రామం, రానున్న స్వాతంత్య్ర దినోత్సవంపై మోదీ మాట్లాడారు. పండుగల్లో పర్యావరణ అనుకూల వస్తువుల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.
ఐదేళ్లలో మార్పు రావాలి.. దేశానికి ప్రధాన సమస్యలుగా మారిన మతతత్వం, కుల వ్యవస్థ, అవినీతి, ఉగ్రవాదం, పేదరికాన్ని 2022 నాటికి దేశం నుంచి నిర్మూలించేలా ప్రతి భారతీయుడు కృషిచేయాలని.. ఈ దిశగా ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీని ద్వారానే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యేలోపు నవభారత నిర్మాణం జరుగుతుందన్నారు. 1942, ఆగస్టు 9న మహాత్ముడు ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కారణంగానే.. 1947లో బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లారని గుర్తుచేసిన మోదీ.. 2017లో నవభారత నిర్మాణానికి ప్రతి భారతీయుడు ప్రతినబూనటం ద్వారా 2022 కల్లా ఫలితాలు సాధించగలమన్నారు.
దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 70 ఏళ్లలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతుల్లో ఉపాధి పెంచేందుకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. సాధించిన విజయాలకన్నా అంచనాలు భారీగా పెరిగిపోయాయి’ అని ప్రధాని వెల్లడించారు. తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చాలా ఎక్కువసేపు ఉంటోందన్న విమర్శల నేపథ్యంలో ఈసారి తక్కువ సమయంలోనే ప్రసంగం పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తానని మోదీ తెలిపారు. రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దీపావళి పండుగల్లో దేశంలోని పేదలు తయారుచేసే వస్తువులను కొనటం ద్వారా వారి ఆర్థిక సాధికారతకు తోడ్పడాలని కోరారు.
విస్తృతంగా వరద సాయం
వరదల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వివిధ రాష్ట్రాలకు కేంద్రం విస్తృతంగా సాయం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. అస్సాం, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిని ఆర్మీ, వైమానిక దళం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో వరదల వల్ల రైతులకు నష్టం జరగకుండా.. బీమా క్లెయిమ్‌ల సెటిల్మెంట్‌లో చొరవ తీసుకోవాలని పంట బీమా కంపెనీలకు సూచించామన్నారు.
‘పనామా’పై చర్యలేవి?: కాంగ్రెస్
అవినీతి నిర్మూలనపై ప్రసంగిస్తున్న ప్రధాని.. పనామా పేపర్ల లీకేజీపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇదే అంశంపై పాకిస్తాన్‌లో ప్రధాని షరీఫ్‌నే పదవినుంచి తప్పించారని గుర్తుచేసింది. ‘ప్రధాని అవినీతిపై సుదీర్ఘంగా మాట్లాడతారు కానీ పనామా అవినీతిపై స్పందించరు. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు, బీజేపీ ఎంపీ అభిషేక్ పై ఆరోపణలొస్తే ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించింది.
కల నెరవేరింది!
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చిందని.. సహకార సమాఖ్య విధానానికి ఇదో ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ వంటి కీలక సంస్కరణ కోట్లమంది జనాభా ఉన్న దేశంలో ఇబ్బందుల్లేకుండా సులభంగా అమల్లోకి తీసుకురావటం ఓ చారిత్రక ఘట్టమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల్లో జీఎస్టీ అమలు కేస్ స్టడీ జరగాల్సిన అంశమన్నారు.
ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా దేశంలో ఓ సంస్కరణగానే కాకుండా.. నిజాయితీని పెంచే సరికొత్త సంస్కృతిగా, సాంస్కృతిక అభివృద్ధిగా చూడాలని అన్నారు. జీఎస్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటోందని వెల్లడించారు. ఏకాభిప్రాయంతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలే సహకార సమాఖ్య విధానానికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సానుకూల మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయన్నారు.