2017లో కరేంగే.. కర్‌కే రహేంగే
నవభారత నిర్మాణానికి ఇదే నినాదం
- 75 ఏళ్ల క్విట్ ఇండియాపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మోదీ
- ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు చీకటి శక్తుల కుట్ర: సోనియా
- అప్పుడు భారత్ ఛోడో.. ఇప్పుడు భారత్ జోడో: స్పీకర్
- సుదృఢ భారతావనికి ఉభయసభల తీర్మానం
న్యూఢిల్లీ: నవ భారతావని నిర్మాణానికి కొత్త నినాదాన్ని, సరికొత్త కార్యాచరణను ప్రకటించారు ప్రధాని మోదీ. వలస పాలకులను తరిమి కొట్టిన క్విట్ ఇండియా ఉద్యమ నినాదం ‘డూ ఆర్ డై’ తరహాలో.. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ‘చేద్దాం.. చేసి చూపిద్దాం (కరేంగే.. కర్‌కే రహేంగే)’ అనే నూతన నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత.. తదితర సమస్యల పరిష్కారానికి పటిష్ట, సమగ్ర, ఉమ్మడి కార్యాచరణ అవసరమని, అందుకు అందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు.
అప్పుడే స్వాతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు నిండే 2022 నాటికి నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. 75 ఏళ్ల క్విట్ ఇండియాపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు కొన్ని చీకటి శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఉభయసభల్లోనూ సంబంధిత తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
అవినీతే ప్రధాన అవరోధం
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 2017 నుంచి 2022 వరకు నవభారత నిర్మాణానికి ఎంపీలంతా కృషిచేయాలని కోరారు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన అవరోధంగా మారిందని.. రాజకీయ వ్యవస్థను చెదలా పట్టిందని మోదీ పేర్కొన్నారు. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం సమస్యలు పెను సవాళ్లుగా మారాయని.. ఈ సమస్యను అధిగమించేందుకు ఓ సానుకూల మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని వెల్లడించారు. ‘1942లో గాంధీ డూ ఆర్ డై అనే నినాదాన్నిచ్చారు. ఇప్పుడు మనం కరేంగే ఔర్ కర్‌కే రహేంగే నినాదంతో ముందుకెళ్దాం. సంకల్ప సిద్ధితో వచ్చే ఐదేళ్లు భారత్ తీసుకొచ్చే సానుకూల మార్పులే ప్రపంచదేశాలకు స్ఫూర్తినిచ్చేందుకు ఉపకరిస్తాయి’ అని మోదీ పేర్కొన్నారు.
ఇందుకోసం ఎంపీలు పార్టీలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమరయోధులు కలలుగన్న భారతాన్ని వచ్చే ఐదేళ్లలో నిర్మించటంలో ముందడుగేయాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, జయప్రకాశ్ నారాయణ్, రాం మనోహర్ లోహియా, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురు వంటి ప్రముఖుల సేవలను మోదీ గుర్తుచేశారు. భారత స్వాతంత్య్ర పోరాటం భారత్‌కు స్వేచ్ఛ కల్పించేందుకు మాత్రమే కాదని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల వలసవాద విధానానికి చరమగీతం పాడేందుకు నిర్ణయాత్మకంగా మారిందని ప్రధాని గుర్తుచేశారు. 1942–1947 మధ్య స్వాతంత్య్రం పొందేందుకు ప్రపంచమంతా సానుకూల వాతావరణం ఏర్పడిందని.. ఈరోజు మళ్లీ దేశానికి అనుకూలమైన వాతావరణమే కనపడుతోందన్నారు.
ప్రజలు బాధ్యతలు తెలుసుకోవాలి
ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ అమలులో రాజకీయాలకు అతీతంగా పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణమైన మద్దతు తెలిపాయని మోదీ తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనూ ఇలా అందరినీ కలుపుకుపోయే విధానాన్నే అనుసరిస్తామన్నారు. ‘మనమంతా కలసి అవినీతిని నిర్మూలించగలం. పేదలకు వారి హక్కులను అందించగలం. యువతకు ఉపాధి కల్పించగలం. పౌష్టికాహారలోపాన్ని అంతం చేయగలం. మహిళాసాధికారతకున్న అడ్డంకులను తొలగించగలం. నిరక్షరాస్యతను నిర్మూలించగలం. ఈ సంకల్పంతో ముందుకెళ్దాం’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
దేశాన్ని ఏకం చేసేలా..: స్పీకర్
స్వాతంత్య్రోద్యమంలో అందరినీ ఏకం చేసేం దుకు క్విట్ ఇండియా ఉద్యమం చూపిన స్ఫూర్తితోనే మళ్లీ దేశాన్ని ఏకం చేయాల్సిన ప్రయత్నం అవసరమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ‘నాటి పోరాట యోధులు భారత్ ఛోడో (భారత్ వదిలి పెట్టండి) అని నినదించారు. నేడు మనం భారత్ జోడో (భారత్‌ను కలుపుదాం) నినా దాన్ని స్వీకరిద్దాం. దేశంలో సమగ్రాభివృద్ధి జరగాలన్న సమరయోధుల కలలను సాధిం చేందుకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని చర్చలో స్పీకర్ పేర్కొన్నారు.
‘హిందూ పాకిస్తాన్’ వద్దు: ఏచూరి
‘దేశం నుంచి మతతత్వం నిర్మూలించబడాలని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఈ దిశగా మనమేం చేస్తున్నామనేదే అసలైన ప్రశ్న’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి రాజ్యసభలో పేర్కొన్నారు. భారతదేశం హిందూ పాకిస్తాన్‌గా మారకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్ర సాధనలో దేశ విభజన జరిగిన బాధాకర ఘటన గుర్తుకొస్తుందన్నారు.
చీకటి శక్తులతో ప్రమాదం
దేశ ప్రజాస్వామ్య మూలాలను చీకటి శక్తులు విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందో ళన వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాయని.. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదని పరోక్షంగా ఆరెస్సెస్‌పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంపై చర్చలో సోనియా మాట్లాడుతూ.. ‘దేశంలో విభజన, విద్వేషపూరిత రాజకీయాలే కనబడుతున్నాయి. రాజ్యాంగం చెప్పిన బహుళత్వం, సమసమాజ నిర్మాణం పదాలకు నేటి సమాజంలో చోటులేదు. లౌకిక, ప్రజాస్వామిక, స్వేచ్ఛా విలువలన్నీ ప్రమాదంలో పడ్డాయి.
చర్చ, భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజావేదిక కుచించుకుపోతోంది. చీకటి శక్తులు బయటకొస్తున్నాయా? సమానత్వం, సామాజిక న్యాయం, న్యాయాధారిత వ్యవ స్థ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య మూలాలపై ఆధారపడిన దేశ ప్రజా స్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయా?’ అని సోనియా ప్రశ్నించారు. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామ్యంలేని, క్విట్ ఇండియాను వ్యతిరేకించిన వ్యక్తులు, శక్తులు, సంస్థలను దేశం మరిచిపోకూడదన్నారు. ‘సంకుచిత మనస్తత్వానికి బంధితమయ్యే, విచ్ఛిన్నకర, మతతత్వ సిద్ధాంతాలను మనం ఆమోదించవద్దు. స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలనుకుంటే.. దీన్ని ప్రమాదంలో పడేస్తున్న శక్తులను ఓడించాలి. మతతత్వ శక్తులు విజయం సాధించకుండా మనం అడ్డుకోగలం, అడ్డుకుంటాం’ అని పేర్కొన్నారు.
ఉభయసభల తీర్మానం
‘125 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధులుగా మేం.. మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతాన్ని 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా) నిర్మించటంలో ప్రతి పౌరుడిని కలుపుకుని పనిచేస్తాం. బలమైన, అభివృద్ధి చెందే, స్వచ్ఛమైన, దివ్యమైన, అవినీతి రహిత భారత నిర్మాణానికి మేం చిత్తశుద్ధితో పనిచేస్తాం. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడతాం. సామరస్యం, దేశభక్తిని పెంపొందించేందుకు పని చేస్తాం’ అని లోక్‌సభ తీర్మానం పేర్కొం ది. రాజ్యసభలోనూ ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బలమైన. స్వయంవర్ధక, లౌకిక, ప్రజాస్వామ్యవాద భారత నిర్మాణంలో భాగస్వాములవుతా మని సభ్యులు తెలిపారు. మహాత్మాగాంధీ పిలుపుతో యావద్భారతం క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొందని రాజ్యసభ చైర్మన్ అన్సారీ అన్నారు.