నంది ఎల్లయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో జానారెడ్డి, వీహెచ్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిర్మితమైన ఉద్యమాలలో క్విట్ ఇండియా ఉద్యమం చరిత్రాత్మకమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరుణంలో ఆ క్విట్ ఇండియా స్ఫూర్తితో తెలంగాణ అవసరాల కోసం పార్టీ శ్రేణులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా 78వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండాను ఉత్తమ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లి పోవాలని డిమాండ్ చేస్తూ 1942 ఆగస్ట్ 8న బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభలో మహాత్మాగాంధీ పిలుపునిచ్చారని చెప్పారు.
ఈ ఉద్యమంతో దేశంలో లక్షలాది మంది కాంగ్రెస్ నాయకులను ఎలాంటి విచారణ లేకుండా బ్రిటిష్ పాలకులు జైళ్లలో పెట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆడంబరాలు చేసుకుంటూ తెలంగాణను రూ.3 లక్షల కోట్ల అప్పుల ఊబిలో పడేశారని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డి పాడు దగ్గర ఆంధ్రప్రదేశ్ రోజుకు 11 టీఎంసీల నీరు తీసుకుపోతుంటే ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, గూడూరు నారాయణరెడ్డి, దాసోజు శ్రావణ్ పాల్గొన్నారు.
నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం
మాజీ ఎంపీ నందిఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ సంతాపం ప్రకటించింది. ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు గాంధీభవన్‌లో నందిఎల్లయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సోమవారం సిద్దిపేట, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో సంతాప సభలు నిర్వహించాలని ఉత్తమ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment