
కోల్‌కతా: మణిపూర్ హింసాకాండ కారకులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ‘‘బీజేపీ భారత్ వీడిపో’’ అన్న నినాదం మారుమోగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు.
పెద్ద నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, పీఎం కేర్ నిధుల అంశంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మమత అన్నారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ–20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభ నుంచి విపక్ష పార్టీ సభ్యులు పారిపోయారని, వారు వ్యాప్తి చేసిన నెగిటివిటీని తాము సమర్థంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మమత కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిరుపేద ప్రజలు బతకడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘‘ప్రధానమంత్రి జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో నిరుపేదలు బతకడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని మమత తాను విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్‌లో ఆరోపించారు. బ్రిటిష్ పాలకుల్ని క్విట్ ఇండియా అంటూ అప్పట్లో మహాత్మా గాంధీ నినదించారని, ఇప్పుడు దేశ ప్రజలు బీజేపీ క్విట్ ఇండియా అంటున్నారని మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment