ఆ మేరకు చట్టాలను సవరిస్తాం
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా: అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరిస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చేవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రేప్ లాంటి నేరాలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని మమత అన్నారు.
అత్యాచారానికి మరణశిక్ష విధించే సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసినా, రాష్ట్రపతికి పంపినా.. తాను రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎంసీ శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలిపారు.
గవర్నర్ తమ బిల్లును తొక్కిపెడితే రాజ్‌భవన్ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్మా చేస్తామని మమత అన్నారు. టీఎంసీ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ర్యాలీని ఉద్దేశించి మమత బుధవారం ప్రసంగించారు. రాజ్‌భవన్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో ఒక ఉద్యోగిని ఆరోపించడాన్ని ప్రస్తావించారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తమ ప్రభుత్వంపై, టీఎంసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
20 రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను తక్షణం విధుల్లో చేర్చాల్సిందిగా కోరారు. ‘తమ సహచరిణికి న్యాయం కోరుతున్న డాక్టర్ల ఆవేదన పట్ల నేను మొదటినుంచీ సానుభూతితోనే ఉన్నాను. ఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయినా జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ రోగులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి విధుల్లోకి తిరిగిరండి’ అని మమత విజ్ఞప్తి చేశారు.
మెడికోల కెరీర్‌కు ఇబ్బంది రాకూడదనే ఒక్క డాక్టర్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయలేదన్నారు. ‘ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ స్వా«దీనం చేసుకొని 16 రోజులు అయింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ బయటపెట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు. శవాలపై రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపిచి్చందని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యను చూపి బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటోందని మండిపడ్డారు.
ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదు?
ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లపై మమతా తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లతో మహిళలపై లైంగిక దాడులు, హింసను నిరోధించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని నేను బీజేపీ అడుగుతున్నా.
అస్సాంలో ఒక నిందితుడినే ఎందుకు ఎన్‌కౌంటర్ చేశారు? ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, భవిష్యత్తులో గెలవలేమని తెలుసు కాబట్టే తన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడి బీజేపీ పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. దుర్గా పూజ సంబరాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందన్నారు.
బెంగాల్ తగలబెడితే.. ఢిల్లీ కూడా
బెంగాల్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కుట్ర పన్నారని బీజేపీపై మమత ధ్వజమెత్తారు. బెంగాల్‌ను తగలబెడితే అసోం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ, యూపీల్లోనూ అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం సిగ్గుచేటని బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్‌లో శాంతిభద్రతలు కాపాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment