వైద్యురాలి హత్యపై చిల్లర రాజకీయాలు
విపక్షాలపై మమత ధ్వజం
కోల్‌కతా: వైద్యురాలి రేప్, హత్యపై విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, విద్యార్థులను ఎగదోసి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నాయని సీపీఎం, బీజేపీలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అవరణలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై తమకేమీ అభ్యంతరం లేదని, సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని, కేసు త్వరితగతిన తేలాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు.
‘వైద్యురాలి కుటుంబానికి అండగా నిలువాల్సిందిపోయి సీపీఎం, బీజేపీలు చవకబారు రాజకీయాలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇక్కడా తేగలమని వారు అనుకుంటున్నారు. నేనొకటే చెప్పదలచుకున్నాను. నాకు అధికార వ్యామోహం లేదు’ అని మమత అన్నారు. హత్య గురించి తెలియగానే రాత్రంతా కేసును పర్యవేక్షించానని, పోలీసు కమిషనర్‌తో, బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు.
మేము ఏం చేయలేదో చెప్పండి? ఏం చర్యలు తీసుకోలేదో చెప్పండి? అని విపక్షాలపై మండిపడ్డారు. ‘డీఎన్‌ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజిని సేకరించడం, శాంపిల్స్‌ను పరీక్షించడం.. ఇలా ప్రతిదీ 12 గంటల్లోపే జరిగింది. నిందితుడిని కూడా 12 గంటల్లోనే అరెస్టు చేశాం’ అని చెప్పుకొచ్చారు. సీబీఐ ఆదివారం లోగా కేసును చేధించాలని డిమాండ్ చేశారు. కోల్‌కతా పోలీసులు 90 శాతం దర్యాప్తును పూర్తి చేశారన్నారు. దోషులను ఉరి తీయాలన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో స్వయంగా తాను శుక్రవారం కోల్‌కతా వీధుల్లో నిరసన ప్రదర్శన చేయనున్నట్లు వెల్లడించారు.
నిందితుడిని రక్షించే ప్రయత్నం: రాహుల్
వైద్యురాలి రేప్, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరగడం ఆసుపత్రిపై, అధికార యంత్రాంగంపై పలు సందేహాలకు తావిస్తోందన్నారు. డాక్టర్లలో, మహిళల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. ‘‘మెడికల్ కాలేజీలోనే డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువు కోసం ఎలా పంపిస్తారు? నిర్భయ వంటి కఠినచట్టాలు కూడా ఇలాంటి నేరాలను ఎందుకు ఆపలేకపోతున్నాయి?’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment