స్వాతంత్య్రానంతరం మన దేశంలో తీసుకొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా పేరుబడిన సాయుధ దళాల(ప్రత్యేకాధికారాల)చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడంద్వారా త్రిపుర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తరచు జరిగే సాయుధ తిరుగుబాట్లతో అట్టుడికే ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసమంటూ 1958లో ఈ చట్టాన్ని తీసుకురాగా, త్రిపురలో 1997 ఫిబ్రవరినుంచి దాన్ని అమలుచేయడం ప్రారంభించారు. ఈ చట్టం మన ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని, మన నేతల రెండు నాల్కల ధోరణిని బట్టబ యలు చేస్తుంది.
నిజానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది స్వతంత్ర భారత పాలకులే అయినా దీని బీజాలు 1942లో సాగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణిచేయ డానికి బ్రిటిష్ వలస పాలకులు జారీచేసిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. ఈ చట్టం దుర్వినియోగంపైనా, సాధారణ పౌర జీవనంలో అది కలిగిస్తున్న కల్లోలంపైనా దశాబ్దాలుగా ఆరోపణలు వస్తున్నాయి. సాయుధ దళాల చట్టం అమ లవుతున్న ప్రాంతంలో శాంతిభద్రతలను చూసే సైన్యానికి మాత్రమే కాదు...ఆ పనిలో నిమగ్నమై ఉండే సాధారణ పోలీసులకు సైతం ఈ చట్టంకింద రక్షణ ఉం టుంది.
ఇది కల్పించే అధికారాలు సాధారణమైనవి కాదు. శాంతిభద్రతల పరి రక్షణలో భాగంగా కల్లోలిత ప్రాంతంలోని ఏ ఇల్లునైనా వారంటు లేకుండా సోదా చేయవచ్చు. అనుమానం వచ్చిన ఎవరినైనా అరెస్టుచేయొచ్చు. ప్రమాదకరమైన వ్యక్తి అని భావించిన పక్షంలో కాల్చిచంపొచ్చు. వారి చర్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా న్యాయస్థానాల్లో కేసు పెట్టడం కూడా సాధ్యంకాదు. ఈ చట్టం ఇస్తున్న రక్షణను అడ్డుపెట్టుకుని సాయుధ దళాల సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని...అమాయక యువకులను కాల్చిచంపుతున్నా రని, మాయం చేస్తున్నారని, అత్యాచారాలకు ఒడిగడుతున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని చాన్నాళ్లనుంచి హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అవి న్యాయస్థానాల్లోనూ, వెలుపలా పోరాడు తున్నాయి. మణిపూర్‌కు చెందిన మహిళా నేత ఇరోం షర్మిల పదిహేనేళ్లనుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఇదే చట్టాన్ని 1990నుంచీ జమ్మూ-కశ్మీర్‌లో కూడా అమలుచేస్తున్నారు. ఆచరణలో ఈ చట్టం అమలువల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో తెలియాలంటే జమ్మూ-కశ్మీర్‌లో 2000 సంవత్సరంలో జరిగిన చిట్టిసింగ్‌పురా ఎన్‌కౌంటర్ ఉదం తాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అయిదుగురు యువకులు మరణించిన ఆ కేసులో నేరారోపణలను ఎదుర్కొన్న జవాన్లపై ఏ కోర్టులో విచారించాలన్న అంశం తేలడా నికే పుష్కరకాలం పట్టింది.
చివరకు సైనిక కోర్టులో విచారణ జరుపుతారో, సాధారణ కోర్టుల్లో విచారణకు అంగీకరిస్తారో చెప్పాలంటూ 2012లో సుప్రీంకోర్టు ప్రశ్నించాక సైనిక కోర్టులో విచారణకు సైన్యం ఒప్పుకుంది. మణిపూర్‌లో జరిగిన ఆరు ఎన్‌కౌంటర్లపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు దానిపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే ఆధ్వర్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక కమిషన్‌ను నియమించింది. ఆ ఉదంతాలన్నిటా మరణించింది సాధారణ పౌరులే నని కమిషన్ తేల్చిచెప్పింది. అంతేకాదు...సాయుధ దళాలు సృష్టిస్తున్న భయోత్పా తంవల్ల సాధారణ పౌర జీవనానికి భంగం కలుగుతున్నదని తేల్చిచెప్పింది.
క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనంచేసి సిఫార్సులు చేయడానికి 2005లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ సైతం సాయుధ దళాల చట్టాన్ని తక్షణం రద్దుచేయాలని సిఫార్సు చేసింది. మిలిటెన్సీని అదుపు చేయడానికి గట్టి చట్టం అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబంధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనైనా, జమ్మూ- కశ్మీర్‌లోనైనా ఈ చట్టం అండ లేకుండా తాము పనిచేయలేమని సైన్యం చెబుతూ వస్తున్నది. అందువల్లే దీన్ని రద్దు చేస్తామని, అది కుదరకపోతే సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ ప్రభుత్వం కూడా చివరకు చేతులెత్తేసింది. ఆ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన చిదంబరం కోరినా చట్టం ఉపసంహరణ సాధ్యం కాలేదు.
త్రిపుర తీసుకున్న తాజా నిర్ణయం వెనక అక్కడి ప్రభుత్వం పదేళ్లుగా చేస్తున్న కృషి ఉంది. మిలిటెంట్ చర్యలను అరికట్టడానికి ఆ ప్రభుత్వం బహుముఖ చర్యలు తీసుకుంది. మిలిటెంట్ల కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచడంతోపాటు రబ్బరు చెట్ల సాగుద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పించడానికి ప్రయత్నించింది. పర్యవసానంగా 2009 తర్వాత అక్కడ మిలిటెన్సీకి సంబంధించి పెద్ద సంఘటనేదీ జరగలేదు. ఆరేళ్ల అనుభవం తర్వాత తమకు ఈ చట్టం అవసరం లేదని త్రిపుర ప్రభుత్వం నిర్ధారణకొచ్చింది. హింసకు పాల్పడుతున్న గ్రూపులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆ పేరిట సైన్యమైనా, మరొక విభాగమైనా పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడకూడదు. సామాన్య పౌరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించకూడదు. సాయుధ దళాల చట్టంవల్ల జరుగుతున్నది ఇదే. త్రిపుర అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేస్తే, ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తే అణచివేత చట్టాల అవసరం ఉండదు.
కానీ, మన దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు ఏ సమస్యకైనా అణచివేతే పరిష్కారంగా భావిస్తున్నాయి. ఈ ధోరణిని విడనాడవలసిన అవసరం ఉంది. త్రిపుర నిర్ణయంతో సహజంగానే ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాలపైనా, జమ్మూ-కశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతుంది. సాయుధ దళాల చట్టం విషయంలో ఆ ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంటుందన్నది వేచిచూడాలి.
త్రిపుర చూపిన బాట!
Published Mon, Jun 1 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement
Advertisement