కుటుంబ పాలన.. ‘క్విట్‌ ఇండియా’ | Quit India: PM Narendra Modi apparent jibe at Opposition alliance | Sakshi
Sakshi News home page

కుటుంబ పాలన.. ‘క్విట్‌ ఇండియా’

Published Mon, Aug 7 2023 4:00 AM | Last Updated on Mon, Aug 7 2023 4:00 AM

Quit India: PM Narendra Modi apparent jibe at Opposition alliance - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో భారత్‌ యావత్తూ ముందుకొస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోని ఓ వర్గం తాము పనిచెయ్యం, ఇతరులను పనిచెయ్యనివ్వబోమన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

  ఇది నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి అని వాపోయారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పార్లమెంట్‌ భవనం నిర్మించామని, ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నమని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అది ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పార్లమెంట్‌ను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అందులోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు.

కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేయడాన్ని కూడా వ్యతిరేకించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పారీ్టలు కేవలం ఎన్నికల సమయంలోనే సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ను స్మరిస్తాయని, తాము గుజరాత్‌లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గత 70 ఏళ్లలో మన అమర జవాన్ల కోసం కనీసం యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించలేదని కాంగ్రెస్‌ పారీ్టపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము నిర్మిస్తే నిస్సిగ్గుగా బహిరంగంగా విమర్శలు చేశాయని దుయ్యబట్టారు.  

దేశ ప్రగతికి రెక్కలు తొడుగుతున్న యువత  
ప్రతికూల రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలను, పార్టీ రాజకీయాలను లెక్కచేయకుండా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తుతం రోజ్‌గార్‌ మేళా కొనసాగుతోందన్నారు. దేశంలో మార్పు మొదలైందని, దేశ అభివృద్ధితో యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మన యువత కొత్త రెక్కలు తొడుగుతున్నారని ప్రశంసించారు.  
 
ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా  

ఈ నెల 9న జరిగే ‘క్విట్‌ ఇండియా’ వార్షికోత్సవాన్ని మోదీ ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక దినం అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచి్చన రోజు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా క్విట్‌ ఇండియా అంటూ బిగ్గరగా నినదిస్తోందని వివరించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వంటివి దేశం వదిలి వెళ్లిపోవాలని ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు.

గత ఏడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు  పిలుపునిచ్చారు. సదుపాయాలు పెరగడం, జీవనం సులభతరం కావడంతో దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందన్నారు.  ‘అమృత్‌భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ది కోసం మోదీ శంకుస్థాపన చేయగా, వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 55, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement