సమరయోధులకు రాష్ట్రపతి సెల్‌ఫోన్ల కానుక
న్యూఢిల్లీ: క్విట్ ఇండియా ఉద్యమం 72వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు కానుకలుగా మొబైల్ ఫోన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన ’ఎట్‌హోమ్’ కార్యక్రమంలో వీటిని అందించారు. డిజిటల్ విజ్ఞాన పథంలో శరవేగంగా సాగుతున్న దేశ ప్రగతికి ప్రతీకలుగా మొబైల్ ఫోన్లు నిలిచినందున వాటినే సమరయోధులకు కానుకలుగా అందించినట్లు ప్రణబ్ ఈ సందర్భంగా చెప్పారు.
రాష్ట్రపతి వ్యక్తిగత సందేశంతో సమరయోధులకు తలా ఒక మొబైల్ పోన్‌ను అందించినట్టు రాష్ట్రపతిభవన్ ప్రతినిధి తెలిపారు. ‘కుటుంబంతో, మిత్రులతో మీ సంభాషణ మీకు మరెంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. ఆయురారోగ్యాలతో మీరు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్న వారితో సెల్‌ఫోన్లు మనల్ని అనుసంధానం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.