లెజెండ్స్ -ఎంఆర్ కృష్ణ :దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న దళిత నేత ఎం.ఆర్ కృష్ణ. క్విట్ ఇండియా అని నినదించిన నాయకుడు. తెలంగాణ విముక్తి పోరాటంలో హైదరాబాద్ స్టేట్‌ను భారతావనిలో కలపాలని పోరాడారు. సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన ఎం.ఆర్. కృష్ణ రక్తం ఉరకలేసిన రోజుల నుంచి స్వతంత్ర జాతి నిర్మాణం వరకు దేశానికి సేవలందించారు. పార్లమెంటేరియన్‌గా మూడు దశాబ్దాల పాటు ఢిల్లీలో వాణి వినిపించిన ఆయన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో డిప్యూటీ మినిస్టర్‌గా రక్షణ, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి శాఖలను నిర్వహించారు. ఆయన గురించి ఈ తరానికి పెద్దగా తెలియదనే చెప్పాలి.-పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి, కరీంనగర్
నాలుగు వరుస విజయాలు
దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు గెలిచిన దళిత నాయకుడు ఎం.ఆర్.కృష్ణ. వరుసగా ముప్‌పై ఏళ్లు పార్లమెంట్‌లో తన వాణి వినిపించారు. భారతావనికి స్వాతంత్రం సిద్ధించాలని, నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛాగీతం ఆలపించాలని తపించారాయన. 1942లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలకంగా వ్యవహరించారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా, హైదరాబాద్ స్టేట్‌కి విముక్తి లభించలేదు. యువతను చైతన్యం చేసి, నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ నేతలతో కలిసి నిజాం గద్దె దిగే వరకు పోరాడారాయన. తెలంగాణ విముక్తి పోరాటాల్లో ఆయన పేరు లిఖించదగినది.
తొలి పార్లమెంట్ సభ్యత్వం
దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1952లో పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభను ద్విసభ్య నియోజకవర్గంగా ప్రకటించారు. అంటే ఒక జనరల్ సభ్యుడు, ఒక ఎస్సీ సభ్యుడు పోటీ చేయవచ్చు. ఆ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి ఎస్.సీ.ఎఫ్ తరపున పోటీ చేసిన కృష్ణ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తెలంగాణ నాయకురాలు టీ.ఎన్.సదాలక్ష్మిపై 1.38 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1957లో జరిగిన రెండో పార్లమెంట్ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పీడీఎఫ్‌కు చెందిన పీ.ఎల్.దాస్‌పై 38 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.
1962లో చట్టసభల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడంతో ఆయన కరీంనగర్ నుంచి తన ప్రస్థానాన్ని కొత్తగా ఏర్పాటైన పెద్దపల్లికి మార్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1962, 1967లో పోటీ చేసి.. అప్పటి సీపీఐ నాయకుడు పళనివేలు మీద రెండుసార్లు విజయకేతనం ఎగరేశారు. 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి ఉద్యమం అనంతరం మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితి తెలంగాణలోని 14 సీట్లలో విజయం సాధించింది. ఆ పార్టీ తరపున 1971లో పెద్దపల్లి నుంచి పోటీ చేసిన వి.తులసీరాం చేతిలో ఎం.ఆర్.కృష్ణ లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972లో రాజ్యసభకు నామినేట్ చేశారు. అది రాజ్యసభకు మధ్యంతర ఎన్నిక. ఆ తర్వాత 1976లో తిరిగి రాజ్యసభకు నామినేట్ అయ్యి 1982 వరకు కొనసాగారు. జవహర్‌లాల్ నెహ్రూ, గుల్జారీలాల్ నందా, ఇందిరాగాంధీ, మురార్జీ దేశాయ్, చరణ్‌సింగ్ వంటి మహామహులు ప్రధానులుగా కొనసాగిన కాలంలో ఎంపీగా ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఘనత కృష్ణకే దక్కుతుంది
కేంద్రమంత్రి
ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో నవంబర్ 1967 నుంచి 1970, జూన్ వరకు కేంద్ర రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా, ఆ తరువాత 1971, మార్చి వరకు అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి డిప్యూటీ మంత్రిగా సేవలు అందించారు. 1962లో జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా పనిచేసి తన సమర్ధతను చాటుకున్నారు ఎం.ఆర్ కృష్ణ. మరోపక్క సామాజిక రంగంలోనూ తన సేవలను తుది వరకు కొనసాగించారు. దళిత జాతి జనోద్ధరణ కోసం ఆయన జీవితకాలం పోరాడారు. పలు సామాజిక సంఘాలతో కలిసి దళితవాడల్లో అక్షరాస్యత, అభివృద్ధి కోసం కృషి చేశారు. సికింద్రాబాద్ అల్వాల్‌లో జై జవహర్ కాలనీ ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ మల్టీ పర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్ కూడా ఆయన ఏర్పాటు చేసిందే. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్టŠస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. క్రీడలంటే ఆసక్తి కనబరిచే కృష్ణ.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ చైర్మన్‌గా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ సభ్యుడిగా కూడా కొనసాగారు. ఆయన 80 ఏళ్ల వయసులో 2004, మే 12న దివంగతులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment