దాదాపు నాలుగు నెలలు గడిచినా మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. మెయిటీ, కుకీ అనే రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఇప్పటికీ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉన్నాయి.
ఈ ఆందోళనలతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగింది. గత ఆగస్టు 27న ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇద్దరు విద్యార్థినుల హత్య దరిమిలా జనం ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, కొండ ప్రాంతాలలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్(స్పెషల్ పవర్స్) యాక్ట్(ఏఎఫ్‌ఎల్‌పీఏ)ను మరో 6 నెలల పాటు పొడిగించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో హింసాకాండను నియంత్రించే దిశగా ప్రభుత్వం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానం అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ ద్వారా ఒక జిల్లాలో శాంతిభద్రతలు నిర్వహించడం. అంటే ఈ విధానంలో ఒక జిల్లాలో భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఒక దళానికి అప్పగించనున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా దానికి ఆ దళం బాధ్యత వహిస్తుంది. ఇది హింసాయుత ఘటనలను నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు మణిపూర్‌లో హింసను అరికట్టడానికి పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు కృషి చేస్తున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివిధ బలగాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడమే కాకుండా జవాబుదారీతనాన్ని కూడా నిర్ధారిస్తుందని ఢిల్లీకి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక దళం మోహరించినందున, ఆ దళం అధికారి అక్కడ అల్లర్లు జరగకుండా చూస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహించడంలో వివిధ దళాలు తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నాయి. ఆర్పీఎఫ్‌లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని, వారిని అధికశాతం జిల్లాల్లో మోహరించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు.
మణిపూర్‌లో 16 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి. 2023 మే 3 నుండి హింస చెలరేగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్, ఆర్మీని మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 200 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ హింస ఆగడం లేదు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.
ఇది కూడా చదవండి: పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి?
Comments
Please login to add a commentAdd a comment