గిరిజన పారిశ్రామికవేత్తలకు సాయం
మంత్రి చందూలాల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.50 లక్షల వరకు సబ్సిడీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామ న్నారు.
శుక్రవారం సచివాలయంలో గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో మంత్రి చందూలాల్ సమీక్షించారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని తండాలు, గూడాలకు సంబంధించిన రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లాభసాటి పద్ధతిలో గిరిజనులు వ్యవసాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలతో ఆయా రంగాల్లో వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, మొదటి విడతగా రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరవుతున్న గిరిజన విద్యార్థులకు రెసిడెన్సియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే గిరిజన బాలికలకు ఏఎన్‌ఎంలుగా శిక్షణ ఇప్పించి, విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలలో వాలంటీర్ల నియామకం కోసం అనుమతి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు వీలుగా రూ.15 కోట్లతో స్థానిక రోడ్లను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.