సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా వర్గాల ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లపాటు ఆ నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్‌మ్యాప్‌ను, ఫార్మూలాను ఖరారు చేయనుంది.
ఈ సీట్లలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానిపై లోతైన అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాలతోపాటు మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తోంది.
ముందుగానే అభ్యర్థుల ఎంపిక దిశగా..
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించి ముందు నుంచే వారిని పోటీకి సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఆయా స్థానాలకు సంబంధించి పార్టీలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల, ఆయా సీట్లలో ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి, ఏ పార్టీ వారిని చేర్చుకొని సీటిస్తే పక్కాగా విజయం సాధించవచ్చు వంటి అంశాలపై కసరత్తు చేపడుతోంది. కనీసం 10 సీట్లు కైవసం చేసుకొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలు, కార్యక్రమాలను సిద్ధం చేసుకోనుంది.
ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో అమలు కాని అంశాలపై విశ్లేషణకు కమలదళం సిద్ధమవుతోంది. దళితులకు ఇచ్చిన మూడెకరాల చొప్పున భూకేటాయింపు హామీ, దళితబంధు కింద రూ. 10 లక్షలు ఖాతాల్లో డిపాజిట్ అంశాలను ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపుదల, ఇతర హామీల అమలుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా నిరసనలు చేపట్టాలని భావిస్తోంది.
28న పార్టీ ముఖ్యుల భేటీ..
ఈ నెల 28న రాష్ట్రంలోని ఎస్సీ అసెంబ్లీ సీట్లపై కూలంకష పరిశీలనకు ఎస్సీ నేతలు, పార్టీ ముఖ్యనేతలతో బీజేపీ అంతర్గత భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి స్పష్టమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment