ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు నేడు అంతకు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో 2022–2023 వార్షిక బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవ నాల నిర్మాణం, వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు 90% శాతం ప్రైవేటు అద్దె బిల్డింగు లలో కొనసాగుతున్నాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గది, వసతి గది (డార్మెటరీ) రెండూ ఒకటే. ఇక సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే... అవి సమస్యల నిలయాలుగా ఉన్నాయి.
గతంలో స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్ల పేరుతో కొన సాగిన హస్టళ్ళు, నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లుగా మారాయి. సంక్షేమ వసతి గృహాలలో కొన్నింటిని 1990 ప్రాంతంలో రేకుల షెడ్డులుగా నిర్మించగా... ఇవ్వాల అవి శిథిలావస్థకి చేరాయి, మెజారిటీ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి. అద్దె బిల్డింగుల సముదా యాలు వ్యాపార సంబంధిత అవసరాలకై నిర్మించినవి కావడంతో కనీస వసతి సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తల్ల డిల్లిపోతున్నారు. మా క్షేత్ర స్థాయి పరిశీలనలో... గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పరిధిలో 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు పూర్తిగా ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి.
పదవ తరగతిలోపు విద్యార్థు లుండే ప్రీ మెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు బాల బాలికలవి 12 ఉండగా... ఇందులో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాలలో ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 24 ఉండగా, ఇందులో 23 హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రైవేట్ బిల్డింగు లలో కనీస సౌకర్యాలు లేక పోగా, ప్రతి నెల అద్దె లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బుతో ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించ వచ్చు. కానీ ఆ పని చేయడంలేదు.
హాస్టళ్లలో రీడింగ్ రూమ్‌లు, లైబ్రరీలు, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వెంటాడుతున్నాయి. గురుకులాల్లో కంప్యూ టర్ బోధన పేరుకు మాత్రమే సాగుతోంది. సంక్షేమ హస్టళ్ళలో చదువుతున్న పదవతరగతిలోపు విద్యార్థులకు రూ. 62 మాత్రమే కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తుండగా... పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వటం లేదు. నెల నెలా కాస్మోటిక్స్ కొనుక్కో వడానికి, బస్ పాస్, ఇంటర్నెట్ రీచార్జీ తదితర అవసరాలు నెరవేర్చుకోవడానికైప్రభుత్వం ఎలాంటి స్టైఫండ్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు కూలీ పనులకు వెళ్తూ అర్ధ కార్మికు లవుతున్నారు. ఇటీవల పనికి వెళ్లొస్తున్న అంబర్‌పేట హాస్టల్ విద్యార్థి యాక్సిడెంట్‌లో మరణించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. చాలా హాస్టళ్లకు రెగ్యులర్ వాచ్ మెన్, వాచ్ ఉమెన్, ఇతర సిబ్బంది లేరు, హాస్టళ్లలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు.
సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ. 35 ఇస్తుండగా, కాలేజి విద్యార్థులకు రూ. 50 ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఖర్చుతోనే ప్రతిరోజూ మూడుసార్లు భోజనం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మెనూలో కూరగాయలతో కూర వండాల్సి ఉండగా... చాలా వసతి గృహాల్లో పప్పుతోనే సరిపెడు తున్నారు. మూడు పూటలా బియ్యంతో తయారైన ఆహారాన్నే తినటంతో... కార్బోహైడ్రేట్లు తప్ప శరీరానికి అందవలసిన మిగతా విటమిన్లు ఏ, సీ, బీ–కాంప్లెక్స్; ప్రొటీన్స్, కొవ్వులు ఇతర పోషకాలు తగినంతగా పిల్లలకు అందటంలేదు. భారత దేశంలోని పిల్లలందరి మనుగడ, పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యాలకు ఉపకరించే పోషకాహార విధానం లేదని యుని సెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) 2016–18 ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితి గమనిస్తే 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారని తేలింది. చాలామంది అండర్ వెయిట్‌కి చేరి రోగాల బారిన పడుతున్నారు.
‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్’ అన్న గురజాడ మాటలు అందరూ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సరైన తిండి, బట్ట, వసతి సౌకర్యాల లేమితో బలహీనంగా తయారవుతున్న రేపటి పౌరులను ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కదా!
కె. ఆనంద్
వ్యాసకర్త పి.డి.ఎస్.యు. (విజృంభణ)
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మొబైల్: 96523 57076
Comments
Please login to add a commentAdd a comment