మారి పరిస్థితుల ఆధారంగా ఎస్టీ జాబితా
న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల ఆధారంగా షెడ్యూల్ కులా(ఎస్టీ)ల జాబితాలో కొత్త కులాలను చేర్చాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. ఆ కులం ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న ఆచారవ్యవహారాలు, వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, కాలక్రమంలో మారిన పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలని కేంద్రం భావిస్తోంది. అందుకు సంబంధించి తగిన విధివిధానాలను సమీక్షించే ప్రయత్నం కూడా చేస్తోంది.
ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చాలని రాష్ట్రాల నుంచి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతి రోజూ వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ కొత్త ఆలోచనలో పడింది. కొత్త కులాలను ఎస్టీలుగా గుర్తించడానికి, ఇతర సూచనలు సలహాలు ఇవ్వడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆజీఐ), నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్(ఎన్సీఎస్టీ), సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ గత సంవత్సరం కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది. మానవజాతి పరిణామ క్రమం, ఒక కులం ఆదిమ లక్షణాలు, దాని విలక్షణ సంస్కృతి, భౌగోళిక ఒంటరితనం, వెనుకబాటుతనం తదితర లక్షణాల ఆధారంగా ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచన చేస్తున్నారు.
ప్రస్తుతానికి రాజ్యాంగంలోని 342 ఆర్టికల్ ప్రకారం దేశం మొత్తంమీద 700 కులాలను గుర్తించారు. ఇప్పడు వివిధ రాష్ట్రాలలో మరికొన్ని కులాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్టీల జాబితాలో చేర్చడానికి పరిశీలిస్తున్న కులాలు ఎక్కువగా అస్సాం, ఒడిశా రాష్ట్రాలలో ఉన్నాయి.