సాక్షి, చిత్తూరు రూరల్: తెలుగుదేశం రుణమాఫీ హామీ మాయలో రైతులు ఓడిపోయారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో పరపతి కోల్పోయారు. 2014 ఎన్నికల ముందు అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న బాబు .. ఆ తర్వాత మాట మార్చి సవాలక్ష నిబంధనలతో నాలుగున్నరేళ్లు దాటినా అరకొర రుణమాఫీతో చుక్కలు చూపించారు. 2019 ఎన్నికలు సమీపిం చడంతో రైతుల ఓట్లను దండుకోవడానికి రూట్ మార్చారు. అన్నదాత సుఖీభవ అంటూ నారా మంత్రంతో మళ్లీ రైతులను నట్టేట ముంచడానికి సిద్ధమయ్యారు. అయితే మట్టిని నమ్ముకున్న రైతన్నలు నిన్ను నమ్మం బాబూ.. ఈ సారీ రైతు బిడ్డ, ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే మా మద్దతు అని స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 2013 డిసెంబర్ నాటికి అన్ని రకాల వ్యవసాయ రుణాలు 5,800 మంది ఖాతాల్లో రూ. 78.2 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇవన్నీ బేషరతుగా మాఫీ చేయాలి. కానీ అలా చేయలేదు. కమిటీలు, నిబం ధనలు, షరతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేసి మాఫీ సొమ్ముపై కొర్రీలు వేశారు. ఆంక్షల కారణంగా 4,296 మంది రైతులు మాత్ర మే రుణమాఫీకి అర్హులయ్యారు. 1,504 మంది అనర్హులని వేటు వేశారు. దీంతో వారందరూ చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేతులెత్తేశారు...
అంతంతమాత్రంగా చేసిన మాఫీ రుణాన్ని విడతల వారీగా అంటూ మాఫీ పత్రాలతో మాయ చేశారు. ఇవన్నీ చూసి రైతులు కంగుతున్నారు. మాఫీ కోసం బ్యాంకులు వ్యవసాయశాఖ, కలెక్టరేట్, కార్యాలయాలు తిరిగి అలసిపోయారు. ఇందుకోసం రోజుల తరబడి పనులు మానేసి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా చాలా మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదు. వేలాది మంది రైతులు అరకొర మాఫీకి నోచుకున్నారు. నాలుగు, ఐదు విడతలకు గాను రూ. 345 లక్షలు విడుదల కావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తున్నా అతీగతీ లేకపోయింది.
ఎన్నికల మాయ..
రుణమాఫీని గాలికొదిలేసిన చంద్రబాబు తర్వాత ఎన్నికల కొత్తమాయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ రైతులను మోసం చేయడానికి అన్నదాత సుఖీభవ పేరుతో ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. రైతుల ఖాతాలోకి రూ. 1000 చొప్పున జమ చేసి రైతుల కంట్లో కారం చల్లుతున్నారు. ఇదీ కూడా అరకొరగానే జమ కావడంతో రైతాంగం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
రైతులకు నేనున్నా..
‘రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుం డా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం రూ.12, 500 ఇస్తాం. రైతులందరకీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్‌ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గిట్టుబాటు ధర కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం’ అంటూ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
న్యాయం లేదు..
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోవిందరెడ్డి. చిత్తూరు మండలంలోని తాళంబేడు గ్రామం. ఇతనికి 2.33 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2012లో ఈ పొలంపై బ్యాంకులో రూ. 60 వేలు రుణం తీసుకున్నా రు. ఇందుకు గాను అతనికి వడ్డీతో కలిపి ఇప్పటి వరకు రూ. 97.50 వేలకు అప్పు చేరింది. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇతనికి రుణం పూర్తిగా మాఫీ అవుతుందని సంబరపడ్డారు. తీరా ఒక్కపైసా కూడా మాఫీ కాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన న్యాయం జరగడం లేదని గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పు చేసి రుణం తీర్చుకున్నా..
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరుమొగిలిరెడ్డి. ఇతనిది మండలంలో టీ.వేపనపల్లి గ్రామం. ఎకరా పొలంకు రూ. 47 వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నారు. చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ నుంచి ఇతనికి ఒక్క పైసా రాలేదు. బ్యాంకు అధికారులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. చేసేదీ లేక వారి సమక్షంలో వడ్డీకి అప్పు చేసి బ్యాంకు రుణం తీర్చుకున్నారు. దీనిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు లేరు.
ఆశలు అడియాసలు చేశారు
టీ. వేపనపల్లె గ్రామానికి ఈయన పేరు మునిరత్నం రెడ్డి ఇతనికున్న 2 ఎకరాలకు గాను రూ. 65 వేలు బ్యాంకులో అప్పు చేశారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తే రుణమాఫీ అవుతుందని భావించారు. బ్యాంకుకు వడ్డీ, అసలు కట్టడం మానేశారు. చివరకు వారి నిరాశే మిగిలింది. రుణమాఫీకి వీరు అర్హులు కారని ప్రభుత్వం పక్కనబెట్టింది. బ్యాంకు నుంచి ఒత్తిడి రావడంతో తీసుకున్న రుణాన్ని ఏడాది క్రితమే వడ్డీతో కలిపి చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment