సాక్షి, న్యూఢిల్లీ: ఆరెకటిక కులస్తుల సమస్యలు పరిష్కరించడానికి టీఆర్‌ఎస్ తరఫున స్పందిస్తామని ఎంపీ కేశవరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ సమావేశ మందిరంలో టీఆర్‌ఎస్ ఎంపీలతోపాటు ఆరె కటిక సామాజిక వర్గానికి చెందిన వివిధ రాష్ట్రాల ఎంపీలను తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎంపీలు నీలం సోన్కర్, బోలే సింగ్‌జీ హాజరయ్యారు.
ఆర్థికంగా వెనకబడిన ఆరెకటిక లను బీసీ జాబితా నుంచి ఎస్సీల్లో చేర్చాలని ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేశవరావు స్పందిస్తూ.. ఎస్సీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకోవాలో అవి తీసుకునేలా టీఆర్‌ఎస్ పార్టీ ఆలోచిస్తుందని కేశవరావు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆరెకటి కలను ఎస్సీల్లో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఈ సమస్యపై దృష్టిపెట్టాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ప్రమోద్‌బాబు, అడ్వైజర్ శివశంకర్, బాలాజీ, అశోక్, శశి, బాబురావు, మధుసూదన్, అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరెకటికల సమస్యలపై స్పందిస్తాం: ఎంపీ కేశవరావు
Published Sat, Jun 7 2014 12:55 AM | Last Updated on Thu, Aug 9 2018 9:15 PM
Advertisement