
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కే.కేశవరావు(కే.కే) తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో జారీచేసింది. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.
బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, కేసీఆర్‌కు సన్నిహితుడైన కె. కేశవరావు బుధవారం ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే తాను కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.
కాగా.. అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్‌లో బుధవారం చేరారు. కేకే.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పార్టీ మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.