సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా తమ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.కేశవరావు ఎన్నికయ్యే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్ స్థానంలో కేకేను ఎన్నుకునే అంశంపై ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇస్తే టీఆర్‌ఎస్‌కు చాన్స్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానితో కేసీఆర్ భేటీ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు.
సభాపతిగా ఆ పార్టీకి చెందిన వెంకయ్యనాయుడు పదవిలో ఉన్నారు. ఇక డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించామన్న సంకేతాలు పంపినట్టు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అటు లోక్‌సభలోనూ స్పీకర్‌గా బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్ ఉండగా, డిప్యూటీ స్పీకర్‌గా అన్నా డీఎంకేకు చెందిన తంబిదురైని ఎన్నుకున్నారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్యసభలోనూ అనుసరించాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్‌కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం.
సభలో బలాబలాలు ఇలా..
ప్రస్తుతం రాజ్యసభలో (ఖాళీలు పోను) 241 మంది సభ్యులున్నారు. తన అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా నెగ్గించుకోవాలంటే బీజేపీ కూటమికి 122 మంది కావాలి. ప్రస్తుతం సభలో ఆ కూటమికి 87 మంది సభ్యులున్నారు. అంటే 35 మంది తక్కువగా ఉంటారు. ఇక యూపీఏకు 58 మంది సభ్యులున్నారు. ఈ కూటమి కూడా సొంతంగా అభ్యర్థిని నెగ్గించుకోలేని పరిస్థితి. ఈ లెక్కలను బేరీజు వేసుకున్న సీఎం కేసీఆర్.. మిత్రపక్షాల సాయంతో ఆ పదవిని పొందేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లోనూ టీఆర్‌ఎస్ కంటే ఎక్కువ రాజ్యసభ సభ్యులున్న పార్టీలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు 13 మంది, సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది రాజ్యసభ సభ్యులున్నారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షాల నుంచే ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఈ రెండు పార్టీలూ పోటీపడే అవకాశమున్నట్టుగా టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నా డీఎంకేకు సైతం 13 మంది సభ్యులు ఉన్నా.. లోక్‌సభ డిప్యూటీ స్పీకరుగా అవకాశాన్ని తీసుకున్న ఆ పార్టీకి మరోసారి జాతీయస్థాయి పదవిని ఇవ్వకపోవచ్చునని భావిస్తున్నారు. బిజూ జనతాదళ్(బీజేడీ)కు కూడా 9 మంది సభ్యులున్నా.. డిప్యూటీ చైర్మన్ పదవిపై ఆ పార్టీ పెద్దగా ఆసక్తిని ప్రదర్శించడం లేదని సమాచారం. ఆ తర్వాతి స్థానంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఆరుగురు సభ్యులున్నారు. ఆరుగురు రాజ్యసభ సభ్యులతోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోగలిగితే జాతీయస్థాయిలో టీఆర్‌ఎస్ పేరు చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
తృణమూల్ పోటీ పడుతుందా?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ప్రతిపక్షాలకే ఇవ్వాలని నిర్ణయిస్తే తమకు తృణమూల్ నుంచి అంతర్గతంగా పోటీ ఉండే అవకాశముందని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీతో టీఆర్‌ఎస్‌కు చెందిన కేకేకు రాజకీయంగా మంచి సంబంధాలున్నాయి. దీంతో ఆ పార్టీతోపాటు మిగత పార్టీల మద్దతు కూడగట్టడంపై కేసీఆర్ దృష్టి సారించినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. గుణాత్మక మార్పు కోసం జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదిస్తున్న కేసీఆర్.. వివిధ పక్షాల మద్దతు కూడగట్టి బీజేపీ సాయంతో డిప్యూటీ చైర్మన్ పదవిని సాధిస్తారని పేర్కొంటున్నారు.
కేకేనే ఎందుకు?
ప్రస్తుతం టీఆర్‌ఎస్ నుంచి కె.కేశవరావు, డి.శ్రీనివాస్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, జె.సంతోష్‌రావు, బి.లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన కేకే ఎంపిక సరైనదేనని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా కేకే పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కొంతకాలం తెరమరుగైనట్టుగా కనిపించినా.. అనూహ్యంగా పీసీసీ అధ్యక్ష పదవిని పొందారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే పీసీసీకి చీఫ్‌గా వ్యవహరించారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం పొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment