సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు చట్టం చేసిందని.. దానిని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టడం పార్లమెంటును ధిక్కరించడమేనని టీఆర్‌ఎస్ మండిపడింది. లోక్‌సభ, రాజ్యసభలను కించపర్చేలా, సభ పనితీరును తప్పుపట్టేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని.. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీలు ఉభయసభల్లో సభా హక్కుల తీర్మానం నోటీసులు ఇచ్చారు.
ఈ మేరకు గురువారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎంపీలు సంతోష్‌కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ల బృందం నోటీసులు ఇవ్వగా.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ యూకే సింగ్‌కు ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎంఎస్‌ఎన్ రెడ్డి, రాములు, నేతకాని వెంకటేశ్ నోటీసు లిచ్చారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. సభ విధానాలను కించపరుస్తారా? ప్రధాని ఈ నెల 8న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చలో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో
ఏపీ పునర్విభజన బిల్లును సిగ్గుపడే పద్ధతిలో ఆమోదించారంటూ వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలపై 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నామని టీఆర్‌ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఏదైనా సభలో కొందరు సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నప్పుడు దానిని నిలువరించేందుకు సభ తలుపులు మూసివేయాలన్న ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని ఎంపీలు వివరించారు. 2014లో ఫిబ్రవరి 20న లోక్‌సభలో, ఫిబ్రవరి 21న రాజ్యసభలో ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో ప్రిసైడింగ్ అధికారులు సభ నిర్వహణకోసం అనుసరించిన విధానాలను ప్రధాని మోదీ నేరుగా తప్పుపట్టారని పేర్కొన్నారు. సభలు ప్రిసైడింగ్ అధికారుల మార్గదర్శకత్వంలో నడుస్తాయని, వారిమాట అంతిమమని.. ప్రిసైడింగ్ అధికారిని తప్పేపట్టేలా ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘనæ కిందికి వస్తాయని నోటీసులో స్పష్టం చేశారు.
ఉభయ సభల నుంచి వాకౌట్
ప్రధానిపై ఉభయ సభల్లో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. సభలు ప్రారంభంకాగానే తమ నోటీసులపై నిర్ణయం తీసుకోవాలంటూ పట్టుబట్టారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మొదట రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనేత కేకే ప్రివిలేజ్ నోటీసు అంశాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ దృష్టికి తీసుకెళ్లి.. నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే ప్రివిలేజ్ నోటీసుపై చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని, ఆయన పరిశీలనకు పంపామని హరివంశ్ పేర్కొన్నారు. అయితే నోటీసులపై తక్షణమే నిర్ణయం ప్రకటించాలంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టుబట్టారు.
తమ స్థానాల్లోంచి లేచి నిల్చుని నినాదాలు చేశారు. తర్వాత ఎంపీలు సంతోష్, కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్‌లు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే సభ చైర్మన్ అనుమతించాక మాత్రమే సభ్యులు ఏదైనా అంశాన్ని లేవనెత్తాలంటూ డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీల డిమాండ్‌కు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, ఇతర పక్షాల నేతలు మద్దతు ఇచ్చారు. ఈ సమయంలో ఖర్గే మాట్లాడేందుకు డిప్యూటీ చైర్మన్ అవకాశమిచ్చారు. అయితే ఖర్గే మాట్లాడుతూ..‘‘ఏపీ విభజన బిల్లుపై రెండు సభల్లోనూ ఆమోదం పొందాకే నిర్ణయం జరిగింది. కానీ దీనిపై ప్రధాని వ్యాఖ్యలు చేశారు..’’ అంటూండగానే మైక్‌ను డిప్యూటీ చైర్మన్ కట్ చేశారు. దీనంతటిపై నిరసన వ్యక్తం చేస్తూ.. టీఆర్‌ఎస్ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
మరోవైపు లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రివిలేజ్ నోటీసుపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను పదేపదే కోరారు. కానీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించడంతో టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ప్రివిలేజ్ నోటీసులపై నిర్ణయం వెలువరించేవరకు సభలకు వెళ్లరాదని నిర్ణయించారు.
ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందే..
లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, నామా, బీబీ పాటిల్ తదితరులు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పూర్తి రాజ్యాంగబద్ధంగా, నియమ నిబంధనల మేరకే తెలంగాణ ఏర్పడిందని ఎంపీ కేకే పేర్కొన్నారు. ‘‘సిగ్గుపడే రీతితో ఉమ్మడి ఏపీ విభజన జరిగిందన్న ప్రధాని వ్యాఖ్యలు చాలా విచారకరం. అభ్యంతరకరం. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను ప్రధాని కించపరిచారు. పార్లమెంట్‌లో పాసైన బిల్లునే ఆయన ప్రశ్నించారు. అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది దారుణం. ప్రధాని వ్యాఖ్యలు చాలా బాధించాయి. తెలంగాణ రావడమే తప్పన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. అందుకే ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చాం. ఇది ఆషామాషీగా ఇచ్చింది కాదు’’ అని స్పష్టం చేశారు. ప్రివిలేజ్ తీర్మానాన్ని స్పీకర్/చైర్మన్ ఆమోదిస్తారనే భ్రమలో తాము లేమని.. కానీ పార్లమెంట్ విధానాన్ని ప్రశ్నించలేదంటూ ప్రధాని క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఎంపీ నామా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ లేని సమస్యలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రానికి ఏమాత్రం చేయూతనివ్వని కేంద్రం.. రాష్ట్రాలకు నష్టం కలిగించేలా కొత్త వివాదాలు తెరపైకి తేవడం సహేతుకం కాదని పేర్కొన్నారు. ఈ ప్రెస్‌మీట్ అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధాని తీరును నిరసిస్తూ.. తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ధ నినాదాలు చేశారు.
ప్రధాని వ్యాఖ్యలు అత్యంత దారుణం. పార్లమెంట్ ఉభయ çసభలపై ధిక్కార ధోరణిలో, పార్లమెంట్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల తీరును తప్పుపట్టేలా ఉన్నాయి. ఇది సభల విధానాలు, కార్యకలాపాలను, పనితీరును కించపర్చడమే. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను ప్రధాని అగౌరవపర్చారు. ఈ విషయంగా తగిన చర్యలు తీసుకోవాలి.
– ప్రివిలేజ్ నోటీసులలో టీఆర్‌ఎస్ ఎంపీలు
Comments
Please login to add a commentAdd a comment