member of parliaments
-
కేంద్రీయ విద్యాలయాలు.. ఎంపీలకు షాక్!
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రత్యేక కోటా కింద కేటాయిస్తున్న ఈ సీట్లపై.. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) బుధవారం ప్రకటన చేసింది. కేవీఎస్ ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి కోటా కింద 10 సీట్లు కేటాయిస్తూ వస్తోంది. అయితే ఈ కోటా పెంచాలని ఎంపీలు డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఏకంగా కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అడ్మిషన్లు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్పెషల్ ప్రొవిజన్ కింద ఎంపీలు, కేంద్ర ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతల పిల్లలు సహా 19 కేటగిరీల్లో కోటా కేటాయింపులు ఉంటూ వచ్చాయి. -
ప్రధాని పద్ధతి సరికాదు.. ప్రివిలేజ్ కమిటీకి టీఆర్ఎస్ ఎంపీల నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు చట్టం చేసిందని.. దానిని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టడం పార్లమెంటును ధిక్కరించడమేనని టీఆర్ఎస్ మండిపడింది. లోక్‌సభ, రాజ్యసభలను కించపర్చేలా, సభ పనితీరును తప్పుపట్టేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని.. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీలు ఉభయసభల్లో సభా హక్కుల తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎంపీలు సంతోష్‌కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ల బృందం నోటీసులు ఇవ్వగా.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ యూకే సింగ్‌కు ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎంఎస్ఎన్ రెడ్డి, రాములు, నేతకాని వెంకటేశ్ నోటీసు లిచ్చారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. సభ విధానాలను కించపరుస్తారా? ప్రధాని ఈ నెల 8న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చలో మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఏపీ పునర్విభజన బిల్లును సిగ్గుపడే పద్ధతిలో ఆమోదించారంటూ వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలపై 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఏదైనా సభలో కొందరు సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నప్పుడు దానిని నిలువరించేందుకు సభ తలుపులు మూసివేయాలన్న ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని ఎంపీలు వివరించారు. 2014లో ఫిబ్రవరి 20న లోక్‌సభలో, ఫిబ్రవరి 21న రాజ్యసభలో ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో ప్రిసైడింగ్ అధికారులు సభ నిర్వహణకోసం అనుసరించిన విధానాలను ప్రధాని మోదీ నేరుగా తప్పుపట్టారని పేర్కొన్నారు. సభలు ప్రిసైడింగ్ అధికారుల మార్గదర్శకత్వంలో నడుస్తాయని, వారిమాట అంతిమమని.. ప్రిసైడింగ్ అధికారిని తప్పేపట్టేలా ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘనæ కిందికి వస్తాయని నోటీసులో స్పష్టం చేశారు. ఉభయ సభల నుంచి వాకౌట్ ప్రధానిపై ఉభయ సభల్లో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు.. సభలు ప్రారంభంకాగానే తమ నోటీసులపై నిర్ణయం తీసుకోవాలంటూ పట్టుబట్టారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మొదట రాజ్యసభలో టీఆర్ఎస్ పక్షనేత కేకే ప్రివిలేజ్ నోటీసు అంశాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ దృష్టికి తీసుకెళ్లి.. నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే ప్రివిలేజ్ నోటీసుపై చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని, ఆయన పరిశీలనకు పంపామని హరివంశ్ పేర్కొన్నారు. అయితే నోటీసులపై తక్షణమే నిర్ణయం ప్రకటించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. తమ స్థానాల్లోంచి లేచి నిల్చుని నినాదాలు చేశారు. తర్వాత ఎంపీలు సంతోష్, కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్‌లు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే సభ చైర్మన్ అనుమతించాక మాత్రమే సభ్యులు ఏదైనా అంశాన్ని లేవనెత్తాలంటూ డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్‌కు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, ఇతర పక్షాల నేతలు మద్దతు ఇచ్చారు. ఈ సమయంలో ఖర్గే మాట్లాడేందుకు డిప్యూటీ చైర్మన్ అవకాశమిచ్చారు. అయితే ఖర్గే మాట్లాడుతూ..‘‘ఏపీ విభజన బిల్లుపై రెండు సభల్లోనూ ఆమోదం పొందాకే నిర్ణయం జరిగింది. కానీ దీనిపై ప్రధాని వ్యాఖ్యలు చేశారు..’’ అంటూండగానే మైక్‌ను డిప్యూటీ చైర్మన్ కట్ చేశారు. దీనంతటిపై నిరసన వ్యక్తం చేస్తూ.. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు లోక్‌సభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రివిలేజ్ నోటీసుపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను పదేపదే కోరారు. కానీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించడంతో టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ప్రివిలేజ్ నోటీసులపై నిర్ణయం వెలువరించేవరకు సభలకు వెళ్లరాదని నిర్ణయించారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందే.. లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, బీబీ పాటిల్ తదితరులు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పూర్తి రాజ్యాంగబద్ధంగా, నియమ నిబంధనల మేరకే తెలంగాణ ఏర్పడిందని ఎంపీ కేకే పేర్కొన్నారు. ‘‘సిగ్గుపడే రీతితో ఉమ్మడి ఏపీ విభజన జరిగిందన్న ప్రధాని వ్యాఖ్యలు చాలా విచారకరం. అభ్యంతరకరం. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను ప్రధాని కించపరిచారు. పార్లమెంట్లో పాసైన బిల్లునే ఆయన ప్రశ్నించారు. అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది దారుణం. ప్రధాని వ్యాఖ్యలు చాలా బాధించాయి. తెలంగాణ రావడమే తప్పన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. అందుకే ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చాం. ఇది ఆషామాషీగా ఇచ్చింది కాదు’’ అని స్పష్టం చేశారు. ప్రివిలేజ్ తీర్మానాన్ని స్పీకర్/చైర్మన్ ఆమోదిస్తారనే భ్రమలో తాము లేమని.. కానీ పార్లమెంట్ విధానాన్ని ప్రశ్నించలేదంటూ ప్రధాని క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీ నామా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ లేని సమస్యలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రానికి ఏమాత్రం చేయూతనివ్వని కేంద్రం.. రాష్ట్రాలకు నష్టం కలిగించేలా కొత్త వివాదాలు తెరపైకి తేవడం సహేతుకం కాదని పేర్కొన్నారు. ఈ ప్రెస్‌మీట్ అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని తీరును నిరసిస్తూ.. తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ధ నినాదాలు చేశారు. ప్రధాని వ్యాఖ్యలు అత్యంత దారుణం. పార్లమెంట్ ఉభయ çసభలపై ధిక్కార ధోరణిలో, పార్లమెంట్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల తీరును తప్పుపట్టేలా ఉన్నాయి. ఇది సభల విధానాలు, కార్యకలాపాలను, పనితీరును కించపర్చడమే. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను ప్రధాని అగౌరవపర్చారు. ఈ విషయంగా తగిన చర్యలు తీసుకోవాలి. – ప్రివిలేజ్ నోటీసులలో టీఆర్ఎస్ ఎంపీలు -
233 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 539 మంది అభ్యర్ధుల్లో 43 శాతం అంటే 233 మంది ఎంపీలపై నేరాభియోగాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తెలిపింది. గత లోక్‌సభతో పోలిస్తే నేరారోపణలు ఉన్నవారి సంఖ్య 26 శాతం అధికం కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలైన 539 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ బీజేపీ నుంచి ఎన్నికైన వారిలో 116 మంది ఎంపీలపై (39 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారిలో 29 మంది ఎంపీలపై (57 శాతం) క్రిమినల్ కేసులున్నాయి. ఇక 13 మంది జేడీ(యూ) ఎంపీలపై, 10 మంది డీఎంకే ఎంపీలపై. తొమ్మిది మంది తృణమూల్ ఎంపీలపై క్రిమనల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. నూతన లోక్‌సభలో 29 శాతం కేసులు లైంగిక దాడి, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి కేసులు ఉన్నాయని వెల్లడించింది. 2009 నుంచి తీవ్ర నేరాలు నమోదయ్యాయని వెల్లడించిన ఎంపీల సంఖ్య రెట్టింపైందని ఏడీఆర్ తెలిపింది. -
ఎంపీల పురిటిగడ్డ.. అవనిగడ్డ
సాక్షి, అవనిగడ్డ : దివిసీమ ఎంపీల పురిటిగడ్డ అని చెప్పవచ్చు. జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా అవనిగడ్డ ఏకంగా ఆరుగురు ఎంపీలను అందించింది. వీరిలో ఐదుగురు మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపికకాగా, మరొకరు తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 1952లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో అవనిగడ్డకు చెందిన కమ్యునిస్టు పార్టీ యోధుడు సనకా బుచ్చికోటయ్య సీపీఐ(ఎంఎల్) నుంచి గెలుపొందారు. 1957 ఎన్నికల్లో అవనిగడ్డకు చెందిన మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరుపున, 1967 ఎన్నికల్లో నాగాయలంక మండలం తలగడదీవికి చెందిన మండల వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1967 ఎన్నికల్లో చల్లపల్లిరాజాగా పిలుచుకునే యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్ తరుఫున విజయం సాధించారు. బందరు పార్లమెంట్‌కు ఇలా వరుసగా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన నలుగురు నాన్‌లోకల్ నేతలు ఎంపిక కావడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు. రాష్ట్రంలో మరే ఇతర పార్లమెంట్ నియోజకవర్గానికి ఇలా చరిత్ర లేదు. ఒకే నియోజకవర్గానికి చెందిన నలుగురు నాన్‌లోకల్ వ్యక్తులు ఎంపీలుగా గెలుపొందిన రికార్డు దివిసీమదే. 1999 ఎన్నికల్లో వక్కపట్లవారిపాలేనికి చెందిన అంబటి బ్రాహ్మణయ్య ఎంపీగా గెలుపొందగా, అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన సింగం బసవపున్నయ్య 1989లో తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న జయపురానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌ని కలుపుకుంటే దివిసీమ ఏడుగురు ఎంపీలను అందించింది. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆ క్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఇటు ఎన్నికల నిర్వహణకు కూడా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడానికి అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈనెల 18 నుంచి 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న కౌటింగ్ ప్రక్రియ ఉంటుందని వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్లో మొత్తం 15,53,577 మంది ఓటర్లు ఉండగా, 8,14,689 మంది మహిళలు, 7,38,577 మంది పురుషులు, 35 మంది ఇతరులున్నట్లు తెలిపారు. అయితే పోటీ చేసే అభ్యర్థే కాకుండా వారి ప్రపోజల్స్ కూడా నామినేషన్ వేయవచ్చన్నారు. అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురు మాత్రమే నామినేషన్ వేయడానికి లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో అభ్యర్థులు, పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని పాటించాలని, కేవలం మూడు వాహనాలు మాత్రమే ఉపయోగించి వాటిని100 మీటర్ల పరిధిలోనే నిలిపివేయాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీకి చెందిన అభ్యర్థులకైతే రూ.12,500 డిపాజిట్ చేయాలన్నారు. అదే విధంగా పార్టీలు, అభ్యర్థులు వివిధ అనుమతుల కోసం ‘సువిధ’ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం జిల్లా స్థాయిలో 1950 టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సంసిద్ధులుగా ఉన్నామని, నోడల్ అధికారులు, వివిధ రకాల బృందాలను ఏర్పాటు చేసి సన్నాహక సమావేశాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు ప్రాంతాల్లో, ఆస్తులపై ఉన్న పార్టీల, అభ్యర్థులకు చెందిన జెండాలు, ప్లెక్సీలు, గోడ రాతలు, ప్రభుత్వ పథకాల పోస్టర్లను తొలగిస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్,నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నిజామాబాద్ సెగ్మెంట్లో ఓటర్లు పురుషులు : 7,38,577 మహిళలు : 8,14,689 ఇతరులు : 35 మొత్తం ఓటర్లు :15,53,577 రాజకీయ పార్టీలతో సమీక్ష... పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కోరారు. ప్రగతిభవన్‌లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల నియామవళి తప్పనిసరిగా అందరూ అమలు చేయాలన్నా రు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సహకరించాలని కోరారు. నామినేషన్ వేసే అభ్యర్థులు పాటిం చాల్సిన నిబంధనలను ఈ సందర్భంగా కలెక్టర్ వారికి వివరించారు. -
పనులు పూర్తిచేయకపోవడం బాధాకరం
నల్లగొండ పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధులను సద్వినియోగపరచి ప్రజల సామూహిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోను, జిల్లా కలెక్టర్ చాంబర్లో ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణతో కలిసి వేర్వేరుగా వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో మంజూరు పనులు, వాటి ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు విధిగా పాటిస్తూ మంజూరైన పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఏజన్సీలను ఆయన కోరారు. 2013-14 సంవత్సరానికి సంబంధించిన పనులు కూడా కొన్ని ప్రారంభించకపోవడం, మరికొన్ని ఇంకా పూర్తి చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రారంభించని పనులు 10 రోజుల్లో ప్రారంభించాలని లేకుంటే రద్దు చేయడానికి ప్రతిపాదించాలని కోరారు. పూర్తిచేసిన ప్రతి పని దగ్గర పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి పూర్తి చేసినట్లు తెలిపే శిలాఫలకాలు విధిగా ఏర్పాటు చేయాలని ఇంజనీర్లను కోరారు. ఈ విషయములో ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికీ అధికారులు పాటిం చకపోవడం విచాకరమన్నారు. రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పనులు పూర్తి అయి ఆరు నెలలు గడిచినా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు పనుల ఎంబీ పూర్తి చేయనందున బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు. రాజ్యసభ సభ్యుడి నిధుల నుంచి చౌటుప్పల్ ఆస్పత్రికి ఇచ్చిన అంబులెన్సును రోగుల కోసం వినియోగించకుండా డాక్టర్లు సొంత పనులకు వాడుకుంటున్నారనిఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దృష్టికి తెచ్చినా ఫలితం కనిపించలేదని ఆయన ఇన్చార్జి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ వెంటనే స్పందిస్తూ ఈ విషయంలో అంబులెన్స్ లాగ్ బుక్ సమర్పించాలని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని టెలిఫోన్లో ఆదేశించారు. నారాయణపురం మండలంలో పూర్తి చేసిన పనులకు సంబంధించి 24గంటల లోగా ఎంబీ రికార్డు చేసి చెల్లింపులు జరపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రవి, సీపీఓ నాగేశ్వర్రావు, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఈశాన్య ప్రజల భద్రతపై కమిటీ
హస్తినలో అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా మృతి చెందడంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలలోని ప్రజల భద్రతపై అధ్యాయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి బెజ్బారువా నేతృత్వం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారని తెలిపింది. రెండు నెలలో ఆ కమిటీ నివేదిక అందజేస్తుందని వెల్లడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గురువారం ఉదయం న్యూఢిల్లీలో సమావేశమైయ్యారు. ఆ సమావేశం జరిగిన కొద్ది నిముషాలకే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత గురువారం దేశరాజధానిలోని లజ్‌పత్ నగర్ మార్కెట్లో నిడో తానియాతో కొంత మంది యువకులు ఘర్షణ పడ్డారు. ఆ మరుసటి రోజున నిడో తానియా మృతి చెందాడు. దాంతో ఢిల్లీలో ఈశాన్య రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకు దిగారు. తానియా మృతిపై ఇటు విపక్షాలు అటు స్వపక్షంలోని సభ్యులు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైనాయి. అందులోభాగంగా నిన్న ప్రారంభమైన లోక్‌సభ నిడో తానియా మృతిని ఖండించింది. ఆ ఘటన తీవ్ర దురదృష్టకరమైనదిగా స్పీకర్ మీరా కుమార్ అభివర్ణించారు. తానియా మృతికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సభలో వామపక్షాలు డిమాండ్ చేశాయి. తానియా మృతిని ఢిల్లీ హైకోర్టు సూమోటుగా స్వీకరించి విచారణ జరుపుతుంది. నిడో మరణంపై న్యాయదర్యాప్తునకు కూడా ఆ హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, షిండే ఈశాన్య ప్రాంత ఎంపీలతో సమావేశమైయ్యారు.