హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చే రాజకీయ పార్టీలకే ఈ ఎన్నికల్లో తమ మద్దతు ఇస్తామని ఆయా కుల సంఘాల అధ్యక్షులు తేల్చి చెప్పారు. ఈ మేరకు 26 కుల సంఘాల అధ్యక్షులు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను కలిసి తమ కులాలను బీసీల్లో చేర్చే వరకు అండగా నిలిచి పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. 26 కులాలను బీసీల్లో నుంచి తొలగించడం ద్వారా ప్రభుత్వం ఆ కులాల పిల్లలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా కులాలను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఏ కులాన్ని తొలగించాలన్నా కలపాలన్నా బీసీ కమిషన్‌కు మాత్రమే అధికారం ఉందన్నారు.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలును క్లియర్ చేయాలని, లేని పక్షంలో ఈ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పి.వి.వి.సత్యనారాయణ (శెట్టి బలిజ), శ్రీరాంచంద్రమూర్తి (కళింగ), యుగేంధర్ (గవర), జె.హేమసుందరరావు (తూర్పుకాపు), గోల్లు బాబురావు (కొప్పుల వెలమ), పి.వెంకట్ (కూరాకుల), మురళి (పలిడోర), అప్పారావు (నాగవంశీ), తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment