ముషీరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని తొలగించి ఆ శాఖను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 142ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5న హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద వేలాది మందితో భారీ ధర్నా తలపెట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు.
ఆయన శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పెరుగుతున్న జనాభా ప్రకారం అర్బన్ హెల్త్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, ఏరియా ఆస్పత్రులు, నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటికి సరిపడినంతమంది సిబ్బందిని నియమించకుండా.. ఉన్నవారిని కుదించడానికి కుట్ర పన్నుతూ జీవో 142ను అమలు చేస్తోందని ఆరోపించారు.
ఈ జీవో వల్ల దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులకు నష్టం కలుగుతుందని వివరించారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుని కార్యాలయంలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే పారా మెడికల్ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment