సాక్షి, హైదరాబాద్: బీసీ లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ గణనతోపాటు చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉన్నాయని, అందుకు విరుద్ధంగా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పంచాయతీల కాల పరిమితి ముగిసిందని, అయినా ఎన్నికలు నిర్వహించకపోవడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌కు చెందిన జెడ్పీటీసీ బి.సతీశ్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు.
ఆ ఆదేశాలు అమల్లోనే ఉన్నాయి
కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ బాధ్యతలను నిర్వర్తించకుండా ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 2017 ఆగస్టులోనే ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ..‘‘బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నేనే ఈ ఏడాది జూన్‌లో ఆదేశాలిచ్చాను. బీసీ జనాభా గణన ఇంకా పూర్తి కాలేదు. అలాంటప్పుడు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఎలా ఆదేశించగలను? నేను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయి. వాటిపై అప్పీల్ దాఖలు చేయలేదు. వాటిని ఎత్తివేయాలంటూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఆ ఉత్తర్వులు అమల్లో ఉండగా, వాటికి విరుద్ధంగా వెంటనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కానే కాదు. బీసీ గణన ముఖ్యం. అవి తేలితేనే రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఆ తర్వాత ఎన్నికలు జరుగతాయి’’అని స్పష్టంచేశారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పంచాయతీల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వివరించారు. ‘‘ఎన్నికలు జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్లను నియమించుకుంటే నియమించుకుంటారు. ఆ విషయంలో జోక్యం చేసుకోలేం’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్లు కోరుతున్నట్టుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
Published Wed, Aug 1 2018 3:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment