మాట్లాడుతున్న చాడ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని బీసీ కులాల లెక్క తేల్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు బీసీలకు కాకికి ఎంగిలి మెతుకులు వేసినట్టు వేస్తున్నారని విమర్శించారు. బీసీల జనగనణ చేపట్టేలా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. సోమవారం ‘బీసీల హక్కుల సాధన సమితి’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
దీనికి సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండు రంగాచారి అధ్యక్షత వహించ గా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామేశ్వర్ రావు, ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పూలే–అంబేడ్కర్ సమితి నాయకుడు కోలా జనార్దన్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు దుర్గయ్య గౌడ్, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్ హాజరయ్యారు.
చాడ మాట్లాడుతూ.. బీసీల్లో చైతన్యం తీసుకువచ్చేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను సీఎం కేసీఆర్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సగానికిపైగా జనాభా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో రూ. 1,400 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఓబీసీ రిజర్వేషన్లు నాలుగో తరగతి, కింది స్థాయి పోస్టులకే అమలవు తున్నాయని.. తక్కువ జనాభా ఉన్న అగ్రవర్గాలు ఎక్కువ లబ్ధిపొందుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment