
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉందని, విభజన చట్టంలోని హామీలను నేరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న విభజన చట్టంలోని హామీల సాధనకై కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామన్నారు.
ప్రతి జిల్లా, మండల/పట్టణ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగుర వేసి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీగా సీపీఐ మొట్ట మొదటగా తీర్మానించి, అనేక పద్ధతుల్లో ఉద్యమ కార్యాచరణను రూపొందించి రాష్ట్ర సాధన కోసం పోరాడిందని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్షతతో, రాజకీయ సంకుచిత ఆలోచనలతో కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని, 1,800 మంది అమరులు తెలంగాణ కోసం తమ ప్రాణాలర్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ అమరుల ఆశయాలను నేరవేర్చాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉందని చాడ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment