శెట్టిబలిజల తొలగింపుపై సుప్రీం నోటీసు | Settibalijala removal On Supreme Court notice | Sakshi
Sakshi News home page

శెట్టిబలిజల తొలగింపుపై సుప్రీం నోటీసు

Published Tue, Sep 22 2015 12:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

శెట్టిబలిజల తొలగింపుపై సుప్రీం నోటీసు - Sakshi

శెట్టిబలిజల తొలగింపుపై సుప్రీం నోటీసు

సాక్షి, న్యూఢిల్లీ: బీసీ కులాల జాబితా నుంచి శెట్టిబలిజలను తొలగించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సోమవారం నోటీసు జారీ చేసింది. ఇంతకుముందే కళింగ సామాజిక వర్గం దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి కూడా కౌంటర్ దాఖలుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. బీసీ జాబితా నుంచి కులాలను తొలగించడంపై నాలుగు పిటిషన్లు దాఖలుకాగా... వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ అమితవరాయ్ నే తృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.

శెట్టి బలిజల తొలగింపుపై న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ‘‘50 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ పొందుతున్న శెట్టి బలిజలను ఇప్పుడు విభజన జరిగిందంటూ తెలంగాణలో రిజర్వేషన్ దక్కకుండా చేయడం అన్యాయం. ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో విద్యాభ్యాసం ద్వారా వారు తెలంగాణలో స్థానికులుగా మారారు. ఇప్పుడు వారికి ఇక్కడ రిజర్వేషన్ దక్కదు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికత దక్కదు.

ఈ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా తె లంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ మార్గదర్శనం లేకుండా తనంతట తానుగా బీసీ జాబితాను సవరించింది..’’ అని పేర్కొన్నారు. వాదన విన్న ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కళింగ సామాజిక వర్గానికి చెందిన పిటిషన్‌తో కలిపి దీన్ని విచారించనుంది.
 
విద్యార్థులకు లభించని ఊరట
బీసీ జాబితా నుంచి తొలగించిన కారణంగా మెడిసిన్ ప్రవేశాన్ని కోల్పోయామంటూ గత వారం దాఖలైన పిటిషన్‌తో పాటు సోమవారం దాఖలైన మరో 3 పిటిషన్లకు సంబంధించి విద్యార్థులకు నిరాశే ఎదురైంది. భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31లోగా మెడిసిన్ ప్రవేశాలు పూర్తికావాలని, ఆ ప్రకారం పూర్తయ్యాయని... ఇప్పుడు సీట్లు కూడా లేవని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు విన్నవించారు.

దీనితో ఏకీభవించిన న్యాయస్థానం... ఈ ఏడాదికి ఏమీ చేయలేమని పేర్కొంది. అయితే కింది కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రవేశం పొంది ఫీజు కట్టిన విద్యార్థికి సీటు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక విద్యార్థి తరఫు న్యాయవాది వాదనను న్యాయస్థానం సమర్థించింది. సీటు లభ్యతను పరిశీలించాలని ఎంసీఐని ఆదేశించింది. అయితే దీనిపై ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ కింది కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా వచ్చిన ఆ సీటు.. తదుపరి ఆ ఉత్తర్వులు రద్దయినప్పుడే రద్దయిందని వివరించారు.

ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఆ మేరకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకవేళ సీటు ఇచ్చే పరిస్థితి ఉంటే.. ఆ దిశగా ప్రయత్నిస్తామని విన్నవించారు. దీంతో ఆ ఒక్క విద్యార్థికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం విచారణ జరపనున్నట్లు కోర్టు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement