సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (బీసీ) కేటగిరీలోకి మరో 30 కులాలను చేర్చేందుకు బీసీ కమిషన్ కసరత్తు వేగిరం చేసింది. ప్రస్తుతం బీసీల్లో 112 కులాలున్నాయి. వీటికి అదనంగా 30 కులాలను చేర్చే అంశంపై బీసీ కమిషన్... గతేడాది ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన బీసీ కమిషన్ తాజాగా నిర్దిష్ట ఆధారాలు, విజ్ఞప్తుల స్వీకరణకు ఉపక్రమించింది. వాస్తవానికి కొత్త కులాల చేర్పు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ గతేడాది సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలుండటంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోవడంతో బీసీ కమిషన్ ఈ ప్రక్రియను వేగం చేసింది.
ఈ నెల 17 నుంచి విజ్ఞప్తుల స్వీకరణ
బీసీ జాబితాలో చేర్చాలని భావిస్తున్న 30 కులాల నుంచి బీసీ కమిషన్ ఇదివరకే విజ్ఞప్తులు, సూచనలు స్వీకరించింది. అయితే మరోసారి నిర్దిష్ట పద్ధతిలో విజ్ఞప్తులు, సూచనలు సమర్పించే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బీసీ కమిషన్ కార్యాలయంలో నిర్దిష్ట విజ్ఞప్తులు, వినతులు స్వీకరించనుంది. కులాల మనుగడ, వారి జీవన విధానం, సంస్కృతితో పాటు సంబంధిత అంశాలను ఆధారాలతో జోడించి కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
రెండు నెలల్లో పూర్తి..!
బీసీల్లో కొత్త కులాల చేర్పునకు సంబంధించిన గరిష్టంగా రెండు నెలల్లో పూర్తి చేయాలని బీసీ కమిషన్ భావిస్తోంది. ఈనెల 27 వరకు విజ్ఞప్తులు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించనుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి అభిప్రాయాల స్వీకరణ, ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తుంది. చివరగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి తుది నివేదికను తయారు చేయనుంది. రెండు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆగస్టు చివరికల్లా పూర్తవుతుందని బీసీ కమిషన్ సభ్యులు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
బీసీ కేటగిరీలో చేర్చాలనుకుంటున్న కులాలు..
బీసీల్లో 112 కులాలున్నాయి. కొత్తగా కాకి పగడాల, మందెచ్చుల, సన్నాయోళ్లు/బత్తిన, కుల్ల కడగి, బౌల్ కమ్మర, బాగోతుల, బొప్పల, తోలుబొమ్మలాట, గంజికూటి, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోళ్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం, సాధనాశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల, గౌడ జెట్టి, ఆదికొడుకులు, తెర చీరల, సారోళ్లు, అరవకోమటి, అహీర్ యాదవ్, గొవిలి కులాలను బీసీలో చేర్చేందుకు బీసీ కమిషన్ పరిశీలన చేస్తోంది.
బీసీ కేటగిరీలోకి మరో 30 కులాలు!
Published Sat, Jun 15 2019 1:25 AM | Last Updated on Sat, Jun 15 2019 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment