
నాలుగున్నరేళ్ల పాలనతో అన్ని వర్గాలకూ అన్యాయమే.. ఒక్క హామీ కూడా అమలు చేసింది లేదు. పూటకో మాట చెబుతున్న చంద్రబాబు.. బీసీల ఓట్లతో గద్దెనెక్కి వారిని అణగదొక్కుతున్నారు. ఈ నిరంకుశ వైఖరిపై ఆదివారం గుంటూరు వేదికగా యాదవులు గళమెత్తారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ సమావేశమై దుర్మార్గపాలనను అంతమొందిస్తామని నినదించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే యాదవుల సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశానికి యాదవ సంఘ నాయకులు, పెద్దలు, ఉద్యోగులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బాబు పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ దుష్టపాలనను భరించడం ఇక సాధ్యం కాదని పేర్కొన్నారు.
గుంటూరు రూరల్, పాతగుంటూరు, పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ అధ్యయన కమిటీ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాదవ ప్రతిని«ధులు, వివిధ సంఘనేతలు, మేధావులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు వారి సమస్యలు తెలియజేయటంతోపాటు వారి సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు బీసీలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతి ఒక్క వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, సమన్వయకర్త కిలారి రోశయ్య, గుంటూరు వెస్ట్ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు మందపాటి శేషగిరిరావు, నిమ్మకాయల రాజనారాయణయాదవ్, గోళ్ళ శివశంకర్‌యాదవ్, తాళ్ళ వీరయ్య యాదవ్, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి, దాది శివబాబు యాదవ్, కూరాకుల కోటేశ్వరరావు, చిల్లపల్లి మోహనరావు, తోట మణికంఠ, సంకూరి శ్రీను, అజయ్‌యాదవ్, లలిత్‌ప్రజాపతి, మర్రి సత్యనారాయణ, పల్లా శ్రీను, పాణ్యం మురళీకృష్ణ, మండేపూడి పురుషోత్తం, శ్రీకాంత్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్‌యాదవ్ పాల్గొన్నారు.
విదేశీ విద్యకు రుణాలు ఇవ్వాలి
యాదవ యువతకు విదేశీ విద్యకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలి. నిరుద్యోగ యువతకు మీట్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. గొర్రెల కాపరులకు ఇన్సూరెన్స్ కల్పించాలి. ప్రమాదవశాత్తూ మరణించిన గొర్రెలకు రూ. 5 వేల చొప్పున ఇన్సూరెన్స్ ఇవ్వాలి. రూ 2 వేల కోట్లతో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లును కేటాయించాలి.
– గోళ్ల శివశంకర్‌యాదవ్, బీసీ యూత్ సంక్షేమ సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు గుంటూరు
ఏపీపీ పదవులను కేటాయించాలి
రిజర్వేషన్ల ప్రకారం న్యాయస్థానాల్లో ఏపీపీ పదవులను యాదవులకు కేటాయించాలి. బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో సైతం సక్రమమైన న్యాయం జరగటం లేదు. ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయి. ఈ అణచివేతకు చరమగీతం పాడాలి. చట్టసభలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమన్యాయం జరగాలి.
– జీవీ యాదవ్, లాయర్, మాచర్ల
ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
యాదవ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపాలి. వ్యాపారాలకు రూ. 10 నుంచి 25 లక్షల వరకూ రుణాలు ఇవ్వాలి. సబ్సిడీలు 50 శాతం ఇవ్వాలి. 13 జిల్లాల్లో 13 ఎమ్మెల్యే సీట్లు, రాష్ట్రంలో 2–3 పార్లమెంటు సీట్లను కేటాయించాలి. రాష్ట్రంలో మూడు మంత్రి పదవులు కేటా యించాలి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కల్పించాలి. బీసీలలో అ«త్యధిక జనాభా కలిగిన యాదవ వర్గానికి ప్రత్యేక కార్పోరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
– నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
సన్నిధి గొల్లను వంశపారపర్యంగా కేటాయించాలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్ల పదవిని యాదవులకు వంశపారపర్యంగా కేటాయించాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదవిపై మార్పులతో జీవో జారీ చేసింది. ఇది యాదవుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది.అదేవిధంగా వృత్తివిద్యకు ప్రాధాన్యం ఇస్తూ వృత్తి విద్యా ప్లాంట్ యూనిట్లను ప్రభుత్వం పూర్తి రాయితీతో ఏర్పాటు చేయించాలి.
– ఆలా రవికుమార్‌యాదవ్,అఖిల భారత యాదవ
మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు, గుంటూరు
వివక్షకు గురవుతున్నారు
యాదవులు నేటికీ గ్రామాల్లో వివక్షకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నుంచి రూ. లక్ష వంతున నిధులు కేటాయించాలి. సబ్సిడీలు, పశు, గొర్రెల యూనిట్‌లను కేటాయించాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
– బోయిన సుబ్బారావు యాదవ్,
సీనియర్ యాదవ సంఘం నాయకుడు
యాదవుల అభివృద్ధి శూన్యం
గత నాలుగున్నరేళ్ల టీడీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో యాదవుల అభివృద్ధి శూన్యంగా మారింది. బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రభుత్వం మోసగించింది. బీసీలలో ప్రధానంగా యాదవులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అందక పేద ప్రజలు ఎలాంటి అభివృద్ధి చెందక వెనకబడి పోతున్నారు. యాదవులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో తమ సంక్షేమాన్ని కాంక్షించే పాలకులనే గద్దె నెక్కించాల్సిన అవసరముంది.
– దూళ్ల హరియాదవ్
ఐక్యంగా సాధించుకోవాలి
బీసీలలో అత్యధికంగా ఉన్నటు వంటి యాదవులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలం. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమం కోసం అందించిన సంక్షేమ పథకాలను అందిస్తానని వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రకటించడం అభినందనీయం. యాదవులకు ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు, అమరావతిలో 20 ఎకరాల భూమిని కేటాయించాలి.
– యర్రాకుల తులసీరామ్ యాదవ్,అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రూ.1000 కోట్ల నిధులు దారి మళ్లించారు
రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటు బ్యాంకుగా వినియోగించుకుని నట్టేట ముంచాడు. బీసీలకు మేనిఫెస్టోలో 110 పథకాలు చూపి మోసం చేశాడు. ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. బీసీలలో 104 కులాలు ఉండగా ఒక్క కులానికి గుర్తింపు ఇవ్వలేదు. బీసీలకు రూ. 270 కోట్లు కేటాయించామని చెప్పిన చంద్రబాబు ఎవరికి ఇచ్చారంటే సమాధానం లేదు. బీసీ డిక్లరేషన్ ప్రకారం రూ. 1000 కోట్లు ఇచ్చామంటున్న చంద్రబాబు వాటిని దారి మళ్లించారు. బీసీలకు పెద్దపీటను వేసి వారి అభివృద్ధికి పాటుపడుతున్న జననేత జగనన్నకు మనమంతా అండగా ఉండి ఆయనను ముఖ్యమంత్రిని చేసుకుందా. తద్వారా ఆయన ప్రకటించిన విధంగా బీసీలకు డిక్లరేషన్ వస్తుంది. మన ఆర్థిక స్వావలంబనకు ఎంతో దోహదపడుతుంది.
– విడదల రజని,
చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment